కదిపితే కందిరీగల తుట్టె

ఒక కందిరీగ శబ్దం చేస్తూ చుట్టూ తిరిగినా, లేదూ కుట్టినా భరించటం కష్టం. అలాంటిది కందిరీగల తుట్టెను కదిపితే అన్ని కందిరీగలు మీదపడి కుడితే ఎలా ఉంటుందో వూహించవచ్చు. కందిరీగల తుట్టెను కదపనంతవరకూ ఎలాగో ఒకలాగా ఆ ప్రదేశం నుంచి తప్పించుకుపోవచ్చు. కదిపామంటే పెనుప్రమాదమే. ఇలాంటి కందిరీగల తుట్టెతో క్రోథ స్వభావులను వూరకనే కయ్యానికి కాలు దువ్వే వారిని పోల్చి చెబుతుంటారు. అలాంటి వారిని గమనించి కదిలించకుండా పక్కకు తప్పుకొని పోవటమే మేలని పెద్దలు సూచించే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'వాడిని కదిపితే కందిరీగలతుట్టె, అనవసరంగా వాడిని కదిలించి ఇబ్బందిపడొద్దు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.