నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన రాష్ట్రపతి

తేది : 
Thursday, December 27, 2012

తిరుపతిలో గురువారం ఉదయం నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన తర్వాత రాష్ట్రపతి కీలకోపన్యాసం చేశారు. తెలుగు భాషకు మరింత కొత్తదనం, ఒరవడిని అందించే అవకాశం ఈ సభల ద్వారా లభించిందని పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగు భాష కాలగర్భంలో కలిసిపోకుండా తన మూలాలను పరిరక్షించుకోవటమే కాకుండా ఒక నూతన భాషగా అవతరించిందని వ్యాఖ్యానించారు. తెలుగు భాషలో గొప్ప సాహిత్యం, వ్యాకరణం ఇమిడి ఉన్నాయనీ, పద్య ప్రబంధాలు, పద్యం, గద్యం అందంగా మేళవించిన చెంపూ కావ్యాలు, పామరులు సైతం సులభంగా అర్థం చేసుకునేలా ద్విపదలు, దాశరథి శతకం, వేమన శతకం లాంటివి వచ్చాయని వివరించారు. భాషా వ్యాకరణంలో సమగ్ర పరిశోధన చేసిన పరవస్తు చిన్నయ్యసూరి 19వ శతాబ్దంలో బాలవ్యాకరణం రచించారని, ఆయనకు తెలుగు భాష రుణపడి ఉందని తెలిపారు. తెలుగు సాహిత్యంలో 16-17 శతాబ్దాలు స్వర్ణయుగమని కొనియాడారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలుగునాట సాహిత్య ఉద్యమం అదే ఒరవడితో కొనసాగిందని చెప్పారు. తెలుగు భాషకు సుదీర్ఘ చరిత్ర ఉన్నందు వల్లే ప్రాచీన హోదా లభించిందన్నారు.