తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు పెంచిన ఎందరో మహనీయుల గురించిన వ్యాసములు
పద్మనాభం! తెలుగు తెర హాస్య నటశ్రేణిలో అగ్రగణ్యుడు. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రేక్షక జనాన్ని నవ్వుల జల్లుల్లో తడిపిన నట ప్రముఖుడు. అనేకానేక చిత్రాలు నిర్మించి విజయాలూ ప్రశంసలూ పొందిన విలక్షణ కళాభిజ్ఞుడు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేసి సినీజీవితం అందించిన అనుభవశాలి. శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గాయకునిగా పరిచయం చేసిన ఘనత పద్మనాభానిదే |
తెలుగు సినీ వినీలాకాశంలో తనదైన హాస్యనటనతో అలరించి విభిన్నమైన శైలిలో ఓ ప్రత్యేకముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే హాస్యనట చక్రవర్తి రాజబాబు. తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తనజీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు వరుసగా ఏడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్ రాజబాబు. |
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. కవిత్వంతో మాధుర్యన్ని కురిపించి ' నైటింగేల్ ఆఫ్ ఇండియా' గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా గవర్నరుగా పనిచేసిన ఆమె రాజకీయాల్లో మహిళలకు అత్యున్నతస్థానం సాధ్యమే అని నిరూపించారు. |
శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం. రేడియోకు "ఆకాశవాణి" అన్నపేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు. |
అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహానాయకులు డా.పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారు. |
స్వామి రామానంద తీర్థ : స్వాతంత్ర సమరయోధుడు, హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి, కార్మిక నాయకుడు, విద్యావేత్త. ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్ విద్యాపీఠ్‌లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు. |
ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు : తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో 'మేం ఆంధ్రులం' అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు. |
ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్.వి. ప్రసాద్ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసారు. |
త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి. |
ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.
'తెలుగు సాహిత్యం'పై శ్రీశ్రీదే అసలైన 'ముద్ర'. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో 'మహాప్రస్థానం' మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది. |