మాడపాటి హనుమంతరావు

Madapati Hanumantharaoఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు :  తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో 'మేం ఆంధ్రులం' అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు. 

  • తెలంగాణలో గ్రంథాలయోద్యమ సారధి.
  • హైదరాబాదు నగర తొలి మేయర్.అంతే కాదు.మన రాష్ట్ర్ర విధాన పరిషత్ కు మొదటి అధ్యక్షులు వీరే కావడం ,ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం.
  • 1951 ఏప్రిల్ 16న హైదరాబాద్ నగర తొలి మేయర్ అయ్యారు. వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 1958లో మాడపాటి వారు అధ్యక్షులైనారు.
  • బారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ ఇచ్చి సత్కరించింది.
  • మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పాడు.
  • భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు.

రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు.

మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22వ తేదీన నేటి వరంగల్ జిల్లా మధిర తాలూకా ఎర్రుపాలెం గ్రామంలో తమ మాతామహ స్థానంలో జన్మించారు. తల్లి జమలాపురం వారి ఆడబడుచు వేంకట సుబ్బమ్మ. తండ్రి వేంకటప్పయ్య. తండ్రి మరణంతో నల్లగొండలో పని చేస్తున్న చిన్న మేనమామ రామచంద్రరావు వద్ద వీరు చదువుకున్నారు. హనుమంతరావు వరంగల్‌లో మద్రాసు మెట్రిక్ పాసయ్యారు. ఎనిమిది సంవత్సరాలు వరంగల్‌లో విద్యాశాఖలో పనిచేశారు. ఆయన ఉద్యోగానికి సెలవుపెట్టి హైదరాబాద్‌లో ప్రైవేటుగా ‘లా’ పరీక్ష పాసైన హనుమంతరావు 1917లో ప్రాక్టీసు పెట్టారు.
హనుమంతరావుగారికి తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. 1900లో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, 1904లో వరంగల్‌లో శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించబడింది. హనుమంతరావు దాని కార్యదర్శి. ప్రభుత్వ వత్తిడివల్ల దానికి ఆయన రాజీనామా చేశారు. వేరొకర్ని ఏర్పాటు చేశారు. తమ మాతృస్థానం ఎర్రుపాలెంలో బాలికా పాఠశాల, నారాయణగూడలో బాలిక్నోత పాఠశాల స్థాపించారు.  

నాటి నైజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పటేల్‌, పట్వారీ, పోలీసుల జులం ఎక్కువగా ఉండేది. అన్నదాతల్ని అన్యాయమైన వసూళ్ళతో యమయాతనలు పెట్టేవారు. వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వర్తకుల దగ్గర నిజాం ఎస్టేట్‌కు చెందిన ఉద్యోగులు సరకులు తీసుకుని డబ్బు యిచ్చేవారు కాదు. భూస్వాముల దౌర్జన్యాలకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో దొరల దోపిడీతో పాటు ఇతర భూస్వామ్య, పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి అనేక ప్రజా సంఘాలు వెలిసినాయి. ప్రజలు కళ్ళు తెరవడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగు చెయ్యడానికి వర్తక సంఘాలు వెలిశాయి. ఈ సంఘాలు గ్రామ ప్రాంతాల చైతన్యానికి సంకేతాలుగా నిలిచాయి.

తెలంగాణా వెనుకబాటుతనానికి కారకులైన నిజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుతోపాటు తెలుగుజాతిని జాగృతి చేయడానికి గ్రంథాలయోద్యమం, సంఘసంస్కరణ, స్త్రీ విద్యావ్యాప్తి, సాంఘికోద్యమం, ప్రజాసేవారంగంలో, స్త్రీల ప్రవేశం, విద్యాప్రచారం, సాహిత్య వికాసం వంటి అనేక ఉద్యమాలను ఏకకాలంలో నడిపించడంలో మాడపాటి హనుమంతరావు చేసిన కృషి మరువలేనిది. నిజాం రాష్ట్ర తెలుగు జాతిని మొదట మేల్కొలిపిన మాడపాటి 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా సారథ్యం వహించారు.

నిజాం రాష్ట్ర పాలనలో తెలుగు భాష లేకుండా కొనసాగిస్తున్న రోజుల్లో తెలుగు భాషను కాపాడడమే కాక తెలుగుజాతిని ఐక్యం చేయడానికి గ్రంథాలయాలే పునాదిగా తలచి హనుమకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అభివృద్ధికై మాడపాటి విశేష కృషి చేశారు.

ఆ రోజుల్లో హైదరాబాద్‌ సంస్థానంలో రాజభాష ఉర్దూ -విద్యాబోధన ఉర్దూలోనే జరిగేది. బాలికలకు తెలుగు భాషలో విద్యాబోధన (ఉన్నత పాఠశాల స్థాయిలో) జరిపించడానికి మాడపాటి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలకు పుణలోని థాకర్స్‌ భారత మహిళా విశ్వవిద్యాలయం వారి గుర్తింపు లభించింది.
(చిత్రం) మాడపాటి హనుమంతరావు, నెహ్రూ, అయ్యదేవర కాళేశ్వరరావు
అణగారిన వర్గాల్లో జాగృతి, చైతన్యం కలిగించడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నిజాం పాలన క్రింద మగ్గుతున్న తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపును చాటడానికి సమర్థ ఉపకరణంగా ఆయన జర్నలిజాన్ని ఉపయోగించుకున్నారు. న్యాయమైన పౌర, రాజకీయ హక్కులను గురించి ఆనాటి 'నీలగిరి' పత్రిక, 'గోల్కొండ', 'సుజాత', 'దేశబంధు', 'తెలంగాణా' పత్రికల్లో అనేకవ్యాసాలు ఆయన రాశారు. పిరదౌసి ఫార్సీ కవితను తెలుగులోకి అనువదించారు. ముషీర్‌ ఎ దక్కన్‌ అనే ఉర్దూ పత్రికకు చాలాకాలం సంపాదకీయాలు రాసేవారు.

నాయకులను తయారు చేయడమే కాని, నాయకత్వానికి ఇష్టపడని మాడపాటి 1935 లో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1946 ఫిబ్రవరి 6,7 తేదీలలో మాడపాటి హనుమంతరావు షష్టిపూర్తి ఉత్సవాలు తెలంగాణా అంతటా జరిగాయి. ఆ సందర్భంగా సన్మాన రూపంలో వసూలైన డబ్బుతో ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను స్థాపించి కొన్ని గ్రంథాలను ప్రచురించారు. అంతేకాక బంకించంద్ర ఛటర్జీ వ్రాసిన ఆనందమఠ్‌ ప్రసిద్ధ నవలను తెలుగులో ఆయన అనువదించారు.

మాడపాటి తెలుగు, ఉర్దూ, పారశీక, ఇంగ్లీషు భాషలలో పండితులేకాక, మంచివక్త, రచయితగా గుర్తింపు పొందారు. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధిప్రేరణం అనే కధలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'.  ఇటలీ దేశభక్తుడు ‘గారీబాల్డీ’ జీవిత చరిత్ర రాశారు. రోమన్ సామ్రాజ్య చరిత్ర, క్షేత్రకాలపు హింద్వార్యులు, మహాభారత సమీక్ష, 1940లో మాలతీ గుచ్ఛము,  నిజా రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు రాశారు.

 రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత 1951లో హైదరాబాద్‌ నగర పురపాలక సంఘానికి మొదట మేయర్‌గా మాడపాటి ఎన్నికై నగరాభివృద్ధి కెంతో కృషి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌కు శాశ్వత సభ్యులుగా కొనసాగారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హనుమంతరావుకు డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ మొదటి అధ్యక్షులుగా ఆరేళ్లు మాడపాటి కొనసాగారు. ఆంధ్రాభ్యుదయమే తమ జీవితంగా భావించిన మాడపాటికి భారత ప్రభుత్వం 1955 జనవరి 26న పద్మభూషణ్‌ బిరుదునిచ్చి సత్కరించింది. తెలంగాణాలో ఆంధ్రోద్యమంతోపాటు అనేక సాంఘిక, సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహించి, ఆంధ్ర పితామహుడనే పేరు గాంచిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్‌ 11వ తేదీన 86వ ఏట తనువు చాలించారు.
 

మూలం / సేకరణ: 
andhrabhoomi.net, prabhanews.com