స్వామి రామానంద తీర్థ : స్వాతంత్ర సమరయోధుడు, హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి, కార్మిక నాయకుడు, విద్యావేత్త.
ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్ విద్యాపీఠ్‌లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు.