వేమన శతకము

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు 
నం దొకండు విడ్డ పొందు చెడును 
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి 
విశ్వదాభిరామ వినురవేమ!

అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినురవేమ!

అతిథి రాక చూచి యదలించి పడవైచి 
కఠిన చితులగుచు గానలేరు 
కర్మమునకు ముందు ధర్మము గానరో 
విశ్వదాభిరామ వినురవేమా!

అనువుగాని చోట అధికుల మనరాదు 
కొంచెముండుటెల్ల కొదువగాదు 
కొండ యద్దమందు కొంచెమై యుండదా 
విశ్వదాభిరామ వినురవేమ!

అనువుగాని చోట అధికులమనరాదు 
కొంచెముందుటెల్ల కొదువకాదు 
కొండ యద్దమందు కొంచమై ఉండదా 
విశ్వదాభిరామ వినురవేమ

అన్నదానమునకు నధిక సంపదగల్గి 
యమరలోక పూజ్యుడగును మీఱు 
అన్నమగును బ్రహ్మమది కనలేరయా 
విశ్వదాభిరామ వినురవేమ

అర్ధ యంకణమున కాధారమైనట్టి 
యొంటిమేడ గుంజు నొనరనిల్పె 
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు 
విశ్వదాభిరామ వినురవేమ

అల్పబుద్ధివానికధికారమిచ్చిన 
దొడ్డవారినెల్ల తొలగగొట్టు 
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా 
విశ్వదాభిరామ వినుర వేమ

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను 
సజ్జనుండు పలుకు చల్లగాను 
కంచు మోగినట్లు కనకంబు మోగునా 
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె 
జీవబుద్ధి వలన జీవుడయ్యె 
మోహబుద్ధిలయము ముందర గనుగొను 
విశ్వదాభిరామ వినురమేమ!

Pages