తెలంగాణ విమోచనానికి 64 ఏళ్లు

భూమి కోసం... విముక్తి కోసం తెలంగాణా ప్రజలు సాగించిన పోరాటానికి ఫలితం దక్కిన రోజు. భూస్వాముల అరాచకత్వం... నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు.
 

వందల ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకుని జనాన్ని నరకయాతన పెడుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన నాటి ఉద్యమం...  చివరికి సాయుధ పోరాటంగా మారింది. దీంతో భూస్వాములకు అండగా రజాకార్ల పేరుతో నిజాం సైన్యం అరాచకాలు ప్రారంభించింది. దీంతో సాయుద పోరాటం చిలికిచిలికి గాలివానగా మారింది. 1946లో రజాకార్లకు వ్యతిరేకంగా ఆరంభమైన నాటి ఉద్యమం... హైదరాబాద్ విమోచనమే లక్ష్యంతో ముందుకు సాగింది.రెండేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమంలో రజాకార్ల చేతిలో నాలుగున్నర వేల మంది పోరాట యోధులు  నేలకొరిగారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలూ కీలక పాత్ర పోషించారు. 1947 సెప్టెంబర్ 11 న ఈ ఉద్యమం సాయుద పోరాటంగా మారింది. తన సామ్రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13 న భారత సైన్యం రంగంలోకి దిగింది. ఓ వైపు సాయుధ పోరాటం... మరో వైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమీ లేక అప్పటి నిజాం ప్రభువు చేతులెత్తేశాడు. అప్పటివరకు నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతం... నాలుగంటే నాలుగు రోజుల్లోనే భారతదేశంలో విలీనం అయిపోయింది.