స్వామి రామానంద తీర్థ

ramananda teertaస్వామి రామానంద తీర్థ : స్వాతంత్ర సమరయోధుడు, హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి, కార్మిక నాయకుడు, విద్యావేత్త. 

ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్‌. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్‌ విద్యాపీఠ్‌లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు.
 

తొలుత కార్మిక రంగంలో పనిచేసి, కారాగార శిక్ష అనుభవించి ఆరోగ్యం అనుకూలించక, మరాఠ్వాడాలో ఉస్మానాబాదు జిల్లాలోని హిప్పర్గిలో నెలకొల్పబడిన జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులై, ఆరు సంవత్సరాలపాటు ఆ విద్యా సంస్థను గురుకుల పద్ధతిపై చక్కగా ఆయన నిర్వహించారు. 1932లో స్వామి నారాయణ అనే గురువు వీరికి ’విద్వత్‌ సన్యాసం ’ అనే పద్ధతి ప్రకారం సన్యాస దీక్ష ఇచ్చి, ఈయనకు ‘స్వామీ రామానంద తీర్థ’ అని నామకరణం చేశారు. 1938లో రాజకీయరంగంలోకి ప్రవేశించి ఆయన మహారా్రష్ట పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసి, ఆ సంవత్సరమే తన నివాసాన్ని మోమినాబాదు నుంచి హైదరాబాదుకు ఆయన మార్చారు. స్టేట్‌ కాంగ్రెస్‌ అనే సంస్థను నెలకొల్పడానికి స్వామీజీ ప్రయత్నం చేస్తుండగా, స్టేట్‌ కాంగ్రెస్‌ సంస్థను నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్లో నిషేధించింది.

ఆ నిషేధాజ్ఞలకు నిరశనగా స్వామి రామానంద తీర్థ హైదరాబాదులో 1938 అక్టోబరు 27వ తేదీన సత్యాగ్రహం చేయగా ప్రభుత్వం ఆయన్ను బంధించి, 18 నెలలు కఠిన శిక్షనమలుచేశారు. స్టేట్‌ కాంగ్రెస్‌ సంస్థపై నిషేధం తొలగించని కారణంగా, తాను వ్యక్తిగత సత్యాగ్రహం చేస్తానని స్వామీజీ అప్పటి హైదరాబాద్‌ నిజాం ప్రభుత్వానికి తెలియచేయగా, 1940 సెప్టెంబర్‌ 11 వ తేదీన ఆయనను బంధించి, ప్రజారక్షణ నిబంధనల క్రింద నిజామాబాద్‌ కారాగారంలో నిర్బంధంలో ఉంచారు.1942-1950 సంవత్సరాల మధ్య హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉన్నారు.దేశీయ సంస్థానాల మహాసభ కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా ఉన్నారు. 1942 ఆగస్ట్‌లో క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానం ఆమోదింపబడ్డ బొంబాయి కాంగ్రెస్‌ సభలో పాల్గొని షోలాపూర్‌ నుంచి వీరు తిరిగిరాగానే ఆయనను నిజాం ప్రభుత్వం బంధించి1943 డిసెంబరులో విడుదల చేసింది.

హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలని ఉద్యమాన్ని ప్రారంభించినందుకు ఆయనను 1948 జనవరిలో బంధించి, అనేక జైళ్ళల్లో ఉంచారు. నిజాం సైన్యం భారత ప్రభుత్వ సైన్యానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన రామానంద తీర్థ స్వామి నిర్బంధం నుండి విడుదల పొందారు.
రామానంద తీర్థ నాం దేడ్‌లోని పీపుల్స్‌ కాలేజి వ్యవస్థాపకులు.హైదరాబాదు ఖాదీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. హైదరాబాదు హిందీ ప్రచార సంఘానికి అధ్యక్షులుగాను, 1952లో హైదరాబాదు కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులుగాను ఆయన పనిచేశారు.

1952 నుండి 1962 వరకు లోకసభ సభ్యులుగా ఉన్నారు.1953లో హైదరాబాదు నగరంలో ప్రప్రథమంగా జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభకు స్వామీజీ ఆహ్వానసంఘాధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాదు సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని 1953లోనే గట్టిగా కోరిన స్వామీజీ ఎనిమిది తెలంగాణా జిల్లాలను మద్రాసు రాష్ట్రం నుండి విడిపడ్డ ఆంధ్ర ప్రాంతంలో కలిపేసి తెలుగు ప్రజల చిరకాల వాంఛయైన విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటన చేశారు.

అంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆయన అంధ్రప్రదేశ్‌ పౌరుడుగానే హైదరాబాదులో నివాసమేర్పరు చుకొన్నారు.1957 నుండి ఆయన ఉస్మానియా సెనేట్‌లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు. వినోభాజీ ప్రారంభించిన భూదాన్‌ ఉద్యమాలకు ఆయన చేయూత నిచ్చారు. స్వామీజి 1972 జనవరి 22 వ తేదీన హైదరా బాదులో నిర్యాణం చెందారు.

మూలం / సేకరణ: 
suryaa.com