భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.
1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. 1948లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం నాటికి కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెని (1925), హిందు స్తాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు.
నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య.