రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డిరావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించి, విజయవంతం చేశారు. 1922-38 వరకు హైదరాబాద్ స్టేట్ హరిజన సేవక సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గాంధీ, మావో, హోచిమిన్, కృశ్చేవ్‌లను స్వయంగా కలిసిన సమరశీలి. ఒకసారి మహాత్మాగాంధీ హైదరా బాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిశారు. భార్య ఒంటిపై ఉన్న నగల న్నింటినీ గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని చెప్పిన నిరాడం బరుడాయన. సాయుధ పోరాట సమయంలో తన వందల ఎకరాల సొంత భూమిని రైతులకు పంచిన ఉదారవాది.

రావి నారాయణరెడ్డి అందరికీ తెలిసిన కమ్యూ నిస్టు మాత్రమే కాదు. కొందరికే తెలిసిన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామికవాది కూడా. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరకముందు సుమారు 11 ఏళ్లపాటు ఆయన ‘సామాజిక న్యాయం’ సాధించడానికి శ్రమించారు. 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ సమీపంలోని బొల్లేపల్లి గ్రామంలో 1908 జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి నారాయణరెడ్డి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమంలో నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ అతి విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

1975లో- సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్‌దూమ్ భవన్ శంకుస్థాపనకు -ఆనాటి సీపీఐ చైర్మన్- ఎస్‌ఏ డాంగే వచ్చారు. ఆయన్ను కలిసేందుకు కమ్యూనిస్టు నేతలు కొందరు ఒకచోట సమావేశమయ్యారు. అంతలో, ఆ గదిలోకి డాంగే ప్రవేశించారు. అందరూ లేచినిలబడి ఆయన పట్ల గౌరవం ప్రకటించారు. వారిలో రావి నారాయణరెడ్డి (ఆర్ ఎన్) కూడా ఉన్నారు. మిగతా అందరినీ వదిలి తిన్నగా రావి నారాయణ రెడ్డి దగ్గిరకు నడిచారు డాంగే. ‘కామ్రేడ్ ఆరెన్! మీరు నా గౌరవార్థం లేచి నిలబడడం తగదు! లక్షలాది మంది జనాన్ని ఒక్కమాటతో నియంత్రించిన సేనాని మీరు- మీ ముందు మేమెంతవాళ్లం?’ అంటూ వినయపూర్వకంగా అన్నారు. డాంగే ‘మాటతీరు’ తెలిసినవారికి, ఆయన వినయం చూసి మతిపోయింది.

తెలంగాణ రైతాంగ సాయుధపోరాట సారథిగా చరిత్ర సృష్టించారు ఆర్ ఎన్. రజాకార్ రాక్షస రాజ్యాన్ని మట్టికరిపించిన చరితార్థుడు ఆయన. దాదాపు నాలుగేళ్లు సాగిన సాయుధ పోరాటం నిజామ్ పాలనలోని వేలాది గ్రామాలను ఫ్యూడల్ బంధనాలనుంచి విముక్తి చేసింది.

జాతీయోద్యమం బలంగా వేళ్లూను కున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియా శీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవారు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.

దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే 1948 ఫిబ్రవరిలో పార్టీ పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి.

మూలం / సేకరణ: 
వికీపీడియా