త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.
'ఎందరో మహానుభావులు'' అనే పదం తెలుగునాటనే కాక, దక్షిణ ప్రాంతంలో వాడుకలో వినిపించే నానుడియైన చరణం. అలానే 'చక్కని రాజమార్గం ఉండగా, సందుల దూరనేల ఓ మనసా!' 'దొరకునా ఇటువంటి సేవ', 'ఏమని పొగడదురా?' వంటి చరణాలు తెలుగు ప్రజల మదిలో నిలిచిపోయాయి. దాదాపు రెండు వందల ఏళ్లకు పూర్వం త్యాగబ్రహ్మం రచించిన కృతులలోని చరణాలు స్థిరంగా నిలిచిపోవటానికి కారణం.. ఆయన సాహిత్యంలోని నిర్ధిష్టత, సంగీతంలో సారస్వత. భారతీయ సంగీతాల్లో ఉత్తరదేశానికి చెందిన హిందుస్థానీ, దక్షిణానికి కర్నాటక సంగీతం ప్రాచుర్యం పొందాయి. త్యాగబ్రహ్మకు పూర్వం కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చెందిన సాహిత్యం సంగీత ప్రాచుర్యం గురించి వినికిడిలో లేదు.
అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా తిరువమారులో 1767 మే 4వ తేదీన కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు త్యాగబ్రహ్మ జన్మించారు. చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ కలిగి, రాగాలాపనలో కాలం గడిపారు. శొంఠి వెంకట రమణయ్య శిష్యరీకంలో సంగీత స్వరరాజుగా ఎదిగారు. కృతులకు స్వయంగా గురువు తంజావూరులో కచేరీని ఏర్పాటు చేయగా అప్పుడు ఆవిర్భవించిన కృతే' ఎందరో మహానుభావులు' . స్వయంగా కృతిని రచించి, స్వరపరిచి, సంగీత బద్ధంగా గానంచేసే వారినే వాగ్గేయకారులంటారు.
త్యాగబ్రహ్మ వాగ్గేయకారునిగా స్వర రారాజుయై త్యాగరాజుగా నాటినుంచే పిలువబడ్డారు. ఆ సందర్భంలోనే తంజావూరు మహారాజు త్యాగరాజును రాజాస్థానంలో సంగీత కళాకారునిగా నియమించటం కోసం ధన, మణిహారములతో భటులను పంపించాడు. ఆ ఆహ్వానాన్ని త్యాగరాజు తిరస్కరించి 'నిధి చాలా సుఖమా? నా రాముని సన్నిధి చాలా సుఖమా?' అనే కృతిని పాడి స్వేచ్ఛా గానాన్ని కోరుకున్నారు. త్యాగరాజు దాదాపు 24 వేల కీర్తనలు రచించి, స్వర కల్పన చేశారు. అవి అన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధికభాగం 'రాముని' భక్తితో స్తుతించినవే, కాగా కొన్ని ప్రాపంచిక, సామాజిక చింతనలో కూర్చినవీ ఉన్నాయి.
'త్యాగరాజు' కర్నాటక శాస్త్రీయ సంగీతంలో పలు రాగాలు, స్వరాల సృష్టికర్త కావటంతో పాటు స్వయంగా కృతికర్త కూడా. అందువల్ల ఆయన కృతులు పాడేందుకు ఒక నిర్దిష్టత, స్పష్టత ఏర్పడింది. అనుశ్రుతంగా, అదే బాణీలో అదే శైలిలో ఏ సంగీత విధ్వాంసుడైనా పాడవలసిందే. కాగా సంపాదన లేక సంగీతమే పరమావధిగా ఉన్న త్యాగరాజుతో సోదరుడు విసిగి ఆయన ఆరాధించే రాముని విగ్రహాన్ని యమునా నదిలో పడవేశాడు. త్యాగరాజు తీర్ధయాత్రలు చేస్తూ దక్షణభారతం పర్యటించారు. భార్య కమలాంబ, కుమార్తె సీతాలక్ష్మిలను కూడా వదలి రామభక్తి సామ్రాజ్యమే ఆనందంగా భవించారు. త్యాగరాజు తెలుగువాడైనా, తెలుగులోనే కీర్తనలు రచించినా, పుట్టినది తమిళనాడులో అయినందున తమిళులు తమ ఆరాధ్య సంగీత దైవంగా భావించేవారు.
ఆయన చేసిన సంగీత మార్గాన్ని తమిళులు అనుసరిస్తూ కీర్తనల పదవ్యాప్తికి దోహదపడుతున్నారు. త్యాగరాజ కీర్తనలతో పంచరత్న కీర్తనలుగా పేర్కొనబడేవి. 'దుడుకుగల నన్నేదొర - కొటకు బ్రోచురా?' సాధించెనే మనసా', కనకన రుచిరా' ఎందరో మహానుభావులు' జగదానందకారక' త్యాగరాజు కీర్తనల్లో సాహిత్యం పాలు తక్కువ కాగా, సంగీతం పాలు ఎక్కువ. అందువల్లనే తమిళనాట సంగీతాభిమానులు ఆయన కీర్తనలను ఆదరించిన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఎనభై ఏళ్లు నాదమే యోగంగా, సంగీతమే శ్వాసగా జీవించిన నారబ్రహ్మ త్యాగరాజు 1847 జనవరిలో మృతి చెందారు. ఆయన స్మృత్యర్థం నివాళ్లర్పిస్తూ ప్రతిఏటా ఆయన జన్మించిన తిరువాయురులో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో త్యాగరాజు ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విధ్వాంసులు అందరూ పాల్గొని కచేరీ చేస్తారు. అదే విధంగా దేశంలోనే కాక విదేశాల్లోనూ పలుచోట్ల ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. మన హైదరాబాద్‌లో సైతం శ్రీత్యాగరాయ గానసభ, నల్లకుంటలోని రామాలయంలో శ్రీరామగానసభ, మారేడ్‌పల్లి, రాంకోఠిలో ఉన్న ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లోనూ త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు.