వివరణ: ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు. పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.
గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు. తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలుంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగువాడననే అభిమానం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించిపోయేవారాయన.
ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.
విశ్వజన శ్రేయస్సును కాంక్షించిన అరుదైన సంప్రదాయ బద్ధుడైన కవి తుమ్మల సీతారామమూర్తి. భాషాపరంగా ఆయన సంప్రదాయ బద్ధుడైనా భావనాపరంగా ఆధునికుడు. పద్య కవి అయిన ఆయన సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని గాఢంగా విశ్వసించాడు. నైతిక పునర్జీవనం, జాతీయ వికాసం, విశ్వ జనతా శ్రేయస్సు తన కవిత్వ లక్షణాలని చెప్పుకున్నారు. సమాజంలో జరుగుతున్న దోపిడీని, అన్యాయాలను, అక్రమాలను అభ్యుదయ కవుల కంటె ఎంతో ముందుగానే తన కవిత్వం ద్వారా బట్టబయలు చేశారు.
జీవిత విశేషాలు :
తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25 న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య. ఆయనకు విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. 1930 లో అన్నపూర్ణమ్మతో అయనకు పెళ్ళి జరిగింది. వారికి ఒక కుమార్తె నలుగురు కుమారులు కలిగారు. 1930 లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ప్రథమశ్రేణిలో ఉభయభాషాప్రవీణ పట్టాను అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక, తన స్వగ్రామం కావూరు లోని తిలక్ జాతీయ పాఠశాల లో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డునందలి దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1920 - 1930 మధ్య కాలంలో కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1922లో జైలుశిక్ష అనుభవించాడు.
1928లో తుమ్మల ‘ఆత్మార్పణము’ అనే కావ్యాన్ని రచించారు. 1938లో ‘సోదరా లెమ్ము, నీ హక్కులాదుకొమ్ము’ అని ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం తన ‘రాష్ట్ర గానం’ ద్వారా తెలుగువారిని వెన్ను తట్టి లేపారు. తెలుగువారి పూర్వవైభవాన్ని ఎలుగెత్తి చాటి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రబోధించారు. 1840లో ధర్మజ్యోతి అనే ఒక ధర్మవరీ గాథను రచించారు. 1943లో ‘పఱిగి పంట’ రచించారు. 1950లో గాంధీజీ ఆత్మకథకు పద్య అనువాదమైన ‘ఆత్మకథ’ను రచించారు. 1953లో ‘ఉదయగానం’ గావించారు. 1955లో ‘శబిల’ అనే ఖండకావ్యాల సంపుటిని వెలువరించారు.
తెలుగు సాహిత్య సరస్వతికి శిరోభూషణమైన ‘సంక్రాంతి తలపులు’ ఈ సంపుటిలోనివే. 1957లో ‘గీతాధర్మము’ పేరుతో భగవద్గీతకు అనువాదం చేశారు. భర్తృహరి నీతిశతకాన్ని ‘తెలుగు నీతి’ పేరుతో తెనిగించారు. జాతీయోద్యమంలో పాల్గొన్న కవులలో తుమ్మల అగ్రగణ్యులు. ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ‘సర్వోదయ’ సిద్ధాంతాన్ని విశదీకరిస్తూ 1960లో ‘సర్వోదయ గానం’ చేశారు. 1963లో తన అభిరుచులు, ఆదర్శాలు, అనుభవాలు వెల్లడి చేస్తూ ‘నేను’ అనే కావ్యాన్ని రచించారు. 1964లో ‘పైరపంట’ రచించారు. 1967లో ఆదర్శప్రాయులైన కొందరు త్యాగధనుల గుణగణాలను విశదీకరిస్తూ ‘సమదర్శి’ రచించారు.
తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ, ఘన సన్మానం చేసి 'అభినవ తిక్కన' అనే బిరుదును ఇస్తే, వినయపూర్వకంగా, తాను తిక్కన అంత ఘనుణ్ణికాదని, 'తెలుగు భాషకు సేవకుడను' అనే అర్థం వచ్చేలా 'తెనుగు లెంక' అని పేరు పెట్టుకున్న మహాకవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఇరవై నాలుగు వేల పద్యాలు వ్రాసినా, విద్యార్థులకు ఆయన రచనలను పాఠ్యాంశాలుగా నిర్ణయించకపోవడంతో ఆయన సాహిత్యం నిరాదరణకు గురవుతున్నది.
రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి, తెలుగు నుడికారానికి ప్రాణంపోసి, తెనుగుదనానికి నిర్వచనంగా నిలిచిన తుమ్మలను కొంగర జగ్గయ్య 'కళా తపస్వి'గా సంభావించాడు. 'వాస్తవిక జగత్తుకు కాల్పనిక ప్రతిబింబమే కావ్యజగత్తు అన్న నిజాన్ని సీతారామమూర్తిగారు తమ రచనల ద్వారా నిరూపించారు.
పదవుల కోసం కుమ్ములాటను గాంచి కవి మనసు కలత చెందింది. ఇలా అంటాడు.
దొడ్డ తలపులున్న రెడ్డికైనను మాల
బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వగలవటోయీ! వేరు
పరువు పడియె, వాని పరువు సెడియె
'బిచ్చగాడు లేని, మ్రుచ్చులేని, కటారిలేని, దొర తనమ్ములేని కుట్రలేని' దేశపరిస్థితుల కోసం కవి ఎదురుచూశాడు. నిజంగా అటువంటి రోజువస్తే అదే 'క్రొత్త సంక్రాంతి' కవికి. నేటి రచయితలకు 'పునాది తక్కువ' అని వారి నిశ్చితాభిప్రాయం.
ఒక ఇంటర్వ్యూలో తుమ్మల ఇలా అన్నారు. 'నా రచన పద్యము. దీనికి వ్యవహారిక భాష సాయపడదు. గణము కోసమో యతి ప్రాసల కోసమో సలక్షణ భాషనాశ్రయింపక తప్పదు. వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.'
చాలా మంది పలుకులలో ప్రాణం లేదు. పునాది తక్కువ. తనదంతా విప్లవ కవిత్వం అని ఆయన భావన. తమతరం కవుల్లో శృంగారం జోలికి వెళ్లని వారిలో తుమ్మల మొదట నిలుస్తాడు. ఆయన రచన చేయడం ప్రారంభించాక భావ కవిత్వం వచ్చింది. తుమ్మల మనసు దాని మీదకు పోలేదు. తరువాత అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వచ్చాయి. వాటి పద్ధతి తుమ్మల చూశాడు. అప్పటికి తుమ్మల రాసిందంతా విప్లవ కవిత్వమే! కాకపోతే ఒక తేడా ఉంది. తుమ్మల విప్లవం అంతా అహింసాయుతం.
తుమ్మల సీతారామమూర్తి స్వగృహంలోనే 1990 మార్చి 21న పరమపదించారు
సాహితీ కృషి :
సీతారామమూర్తి పలు రచనా రూపాలను స్పృశించాడు. ఆయన రచనలను స్థూలంగా కింది విధాలుగా విభజించవచ్చు.
-
గాంధీకావ్యాలు - ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీగానము, మహాత్మగాంధీ తారావళి.
-
రాష్ట్రకావ్యాలు - రాష్ట్రగానము, ఉదయగానము.
-
ఖండకావ్యాలు - పఱిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్లు, దివ్యజ్యోతి.
-
కథాకావ్యాలు - ఆత్మార్పణము, ధర్మజ్యోతి.
-
సామాజిక కావ్యాలు - ఎక్కట్లు, సందేశసప్తశతి.
-
స్వీయచరిత్ర కావ్యాలు - నేను, నా కథలు, తపస్సిద్ధి.
-
వేదాంతకావ్యాలు - గీతాదర్శము, భజగోవిందం, లక్ష్మీనృసింహ స్తోత్రము, హనుమాన్ చాలీసా.
-
నీతికావ్యాలు - తెనుగు నీతి, నీతికుసుమావళి.
-
స్మృతికావ్యాలు - రామకృష్ణస్మృతి.
-
శతకములు - పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము.
-
జంగం కథలు - బిల్హణీయము.
-
నాటకాలు - గిరికా పరిణయము, హనుమద్విజయము,మహేంద్ర జననము.
-
హరికథలు - అన్నదాన మాహాత్మ్యము, సాత్రాజితీ పరిణయము, నామదేవ చరిత్రము.
కృతులు (ప్రచురించిన సంవత్సరము క్రమములో)
-
గిరికా పరిణయము, 1911-1918
-
మధ్య హనుమద్విజయము, 1911-1918 మధ్య
-
అన్నదాన మాహాత్మ్యము, 1911-1918 మధ్య
-
సాత్రాజితీ పరిణయము, 1911-1918 మధ్య
-
పురాంతక శతకము, 1911-1918 మధ్య
-
రామశతకము, 1919
-
రామలింగేశ్వర శతకము, 1919
-
బిల్హణీయము, 1920
-
మహాత్మగాంధీ తారావళి, 1921
-
నామదేవ చరిత్రము, 1922
-
రామకృష్ణస్మృతి, 1923
-
భజగోవిందం, 1923
-
లక్ష్మీనృసింహ స్తోత్రము, 1925
-
మహేంద్ర జననము, 1924
-
ఆత్మార్పణము (4 ముద్రణలు), 1932-1953
-
ఆత్మకథ (ప్రథమ భాగము), 1936
-
నీతికుసుమావళి, 1937
-
రాష్ట్రగానము (7 ముద్రణలు), 1938-1973
-
ధర్మజ్యోతి (5 ముద్రణలు), 1943-1985
-
పఱిగపంట (2 ముద్రణలు), 1943-1952
-
పెద్దకాపు, 1948
-
అమరజ్యోతి, 1948
-
తపస్సిద్ధి, 1949
-
ఆత్మకథ (మొత్తం అయిదు భాగములు), 1951
-
ఉదయగానము (2 ముద్రణలు), 1955-1973
-
శబల, 1955
-
సర్వోదయగానము, 1961
-
తెనుగు నీతి, 1961
-
నేను, 1963
-
గీతాదర్శము, 1963
-
పైరపంట, 1964
-
సమదర్శి, 1967
-
మహాత్మకథ, 1968
-
నా కథలు, 1973
-
ఎక్కట్లు, 1976
-
హనుమాన్ చాలీసా, 1978
-
సందేశసప్తశతి, 1981
-
కదంబకైత, 1983
-
గాంధీగానము, 1987
-
చక్కట్లు, 1993
-
దివ్యజ్యోతి, 1994
-
తెనుఁగులెంక తుమ్మల సమగ్ర సాహిత్యము, తుమ్మల శతజయంతి ఉత్సవ సంఘ ప్రచురణ, గుంటూరు, 2001
-
మొదటి భాగము - బాపూజీ ఆత్మకథ
-
రెండవ భాగము - మహాత్మకథ
-
మూడవ భాగము - ఖండకావ్యములు - రామశతకము, రామలింగేశ్వర శతకము, మహాత్మగాంధీ తారావళి, మహేంద్ర జననము, రామకృష్ణస్మృతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ధర్మజ్యోతి, పఱిగపంట, శబల, ఉదయగానము, సర్వోదయగానము, తెనుగు నీతి, నేను, గీతాదర్శము
-
నాల్గవ భాగము - ఖండకావ్యములు - పైరపంట, సమదర్శి, నా కథలు, హనుమాన్ చాలీసా, సందేశసప్తశతి, కదంబకైత, గాంధీగానము, చక్కట్లు, దివ్యజ్యోతి
తుమ్మల కవితా సంకలన గ్రంథములు
-
యుగకవిత, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1984
-
రంగా - భారతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1986
-
సంక్రాంతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1988
-
రైతుజీవనము, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
-
సత్యం శివం సుందరం, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
-
తుమ్మల వాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1992
-
తుమ్మల యుగవాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1996
-
తుమ్మల సుభాషితములు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2000
-
తుమ్మల వాణి, తుమ్మల శతజయంతి ఉత్సవ కమిటి, 2001
-
ఆంధ్రప్రశస్తి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2004
-
పండుగ కవితలు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
-
తెనుఁగుతీపి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
సన్మానములు
-
1949 నిడుబ్రోలులో - గజారోహణము, గండ పెండేరము, కనకాభిషేకము, సువర్ణకంకణము.
-
1960 లో అఖిల భారత తెలుగురచయితల మహాసభ సత్కారము.
-
1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్టసభ్యత్వ ప్రదానము.
-
1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానము
-
1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయము "కళాప్రపూర్ణ" బిరుదుతో సత్కారము.
-
1984 మద్రాసులో శ్రీ ఎల్. వి. రామయ్య చారిటీస్ జాతీయకవి అవార్డు.
-
1985లో నాగార్జున విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయము "డాక్టర్ ఆఫ్ లెటర్స్"(డి.లిట్) బిరుదుతో సత్కారము
-
1985 విశాఖపట్నంలో సహస్ర చంద్రదర్శన మహోత్సవము.
-
నెల్లూరు, అప్పికట్ల, ముక్త్యాల, తెనాలి, గుడివాడ, మద్రాసు, గుంటూరు, విజయవాడ చీమకుర్తి మొదలగు తావులలో సన్మానాలు జరిగాయి.
-
జయంతి మహోత్సవములు: 1952 నుండి పెక్కుచోట్ల జరిగాయి.
బిరుదులు
-
ఇతరుల దృష్టిలో "అభినవతిక్కన"
-
తన దృష్టిలో "తెనుఁగులెంక".
తుమ్మల జీవితము, కవిత్వము, వ్యక్తిత్వము పై ఇతరులు వ్రాసిన గ్రంథములు
-
తెనుఁగులెంక తుమ్మల, గొల్లపూడి ప్రకాశరావు, 1975
-
యుగకవి తెనుఁగులెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి, తుమ్మల శ్రీనివాస మూర్తి, 1989
-
తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
-
తుమ్మల సీతారామమూర్తి (భారతీయ సాహిత్య నిర్మాతలు), నాగళ్ల గురుప్రసాదరావు, సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 2000
-
అజరామరవాఙ్మయమూర్తి తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర రవికుమార్, 2002
ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు. పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.
గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు. తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలుంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగువాడననే అభిమానం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించిపోయేవారాయన.
Post date: Tue, 12/25/2012 - 22:50
Path: /content/%E0%B0%A4%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B2%E0%B1%86%E0%B0%82%E0%B0%95-%E0%B0%A4%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2-%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF |
వివరణ: "మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.
భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.
జీవిత విశేషాలు :
1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.
1939 సంవత్సరంలో తొలిసారిగా "వర విక్రయం" అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన "కృష్ణప్రేమ", "స్వర్గసీమ" చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.
1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.
ఆమెకు జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి బయటి వారికి కొద్ది మందికే తెలుసు.1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రందాల మీద పరిశోధన చేసారంటే ఈనాడు చాలామంది నమ్మలేరు. కానీ అది సత్యం. ఎమ్జీ ఆర్ కు రాజపరిపాలనాయోగం ఉందని ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్ విరామ సమయంలో చేతిరేఖలు చూచి చెప్పిన సాముద్రిక వేత్త భానుమతి గారు. ఆ సంగతి ఆమె మరచి పోయినా, తాను ముఖ్యమంత్రి అయినసమయంలో ఎమ్జీ ఆర్ ఆమెకు గుర్తు చేసారట.
అంతేకాదు ఆమె శ్రీ విద్యోపాసకురాలనీ బాలా, నవాక్షరీ మంత్రాలను శృంగేరి శంకరాచార్యులూ మహా తపస్వులూ అయిన అభినవవిద్యాతీర్థస్వామివారి నుంచి ఉపదేశం పొంది నిత్యమూ లలితా సహస్ర నామాలతో శ్రీ చక్రాన్ని అర్చించేవారనీ , సప్తశతీ పారాయణ చేసేవారనీ కొద్దిమందికే తెలుసు. అటువంటి ఉపాసకురాలికి జ్యోతిష్య జ్ఞానం పట్టుబడటం వింతేముంది ?

సినిమాలలో :
రమారమి అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే అనుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నాడు. ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది.
"చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు" - ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో "తెలుగు వెలుగులు" శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.
కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో.
భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్దవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నది.
2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించారు.
అవార్డులు
-
1956నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారము
-
మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
-
అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
-
తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
-
1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
-
ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
-
1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
-
1984 కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
-
బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
-
1984లో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
-
1986లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
-
1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
భానుమతి రచనలు
భానుమతీ రామకృష్ణ.. నవంబరు 1947 చందమామ పత్రికలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం…
ఫిలింకు పాట
పిల్లలకు ఆట
రాజుకు కోట
ఉండాలోయ్ ఉండాలి
అత్తకు నోరు
దేవుడికి తేరు
స్టారుకు కారు
ఉండాలోయ్ ఉండాలి
స్టేజీకి తెర
కత్తికి ఒర
చేపకు ఎర
ఉండాలోయ్ ఉండాలి
యింటికి అమ్మ
నిమ్మకి చెమ్మ
కొలువుకి బొమ్మ
ఉండాలోయ్ ఉండాలి
తలుపుకి గడి
దేవుడికి గుడి
అవ్వకు మడి
ఉండాలోయ్ ఉండాలి
జూదరికి పేక
గొడ్లకి పాక
గాంధీకి మేక
ఉండాలోయ్ ఉండాలి
అరవలకు పొగాకు
ఆంధ్రులకు గోగాకు
మళయాళులకు తేయాకు
ఉండాలోయ్ ఉండాలి
"మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.
భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.
Post date: Sun, 12/23/2012 - 22:30
Path: /content/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3 |
వివరణ: ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు భాషా కోవిదుడు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి కీ.శే. పి.వి.నరసింహారావు. గొప్ప పండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు.
భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
తొలి జీవితం
ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.
రాష్ట్ర రాజకీయాల్లో పీవీ
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.
ముఖ్యమంత్రిగా
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నారు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన .
కేంద్ర రాజకీయాల్లో పీవీ
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం
మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.
ప్రధానమంత్రిగా పీవీ
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.
పీవీ విజయాలు
-
పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
-
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
-
కాశ్మీరు తివ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
-
ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
-
1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు .
పీవీపై విమర్శ
పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.
-
1994 లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
-
1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
-
ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
-
సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ( ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరినే దగ్గిరికి దరిచేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని లబ్దిపొందుతారని ఆయన భయం. అయితే ఎవరిని నొప్పించే స్వభావం కానందువల్ల ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది)
అవినీతి ఆరోపణలు
ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలని పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయన్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. ఆయన ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు:
-
జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు: పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబర్ 29 న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి పూర్వ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
-
సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీ తో విభేధించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి.సింగ్ ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎకౌంటు తెరిచిన కేసది.
-
లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.
పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి . ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.
సాహితీ కృషి
రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. ఆయన రచనలు:
-
సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీ కి లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
-
అబల జీవితం: పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
-
ఇన్‌సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమయింది.
-
ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు
ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.
తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
పీవీ విశిష్టత
-
బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
-
పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన. పీవీ చివరిరోజుల్లో ఒకసారి ఆయన్ను కలిశాను. మాటలమధ్య... 'మీ మీద పుస్తకం రాయబోతున్నాను' అని చెస్తే 'నువ్వన్నా రాయవయ్యా, నా గురించి జనానికి నిజం తెలుస్తుంది' అన్నారు నీరసంగా నవ్వి. ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధవేసింది.--కె.విజయరామారావు (ఈనాడు8.11.2009)
-
పి.వి. వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని వాడటం విశేషం. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
-
తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావు కు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
-
పి.వి. ని గ్రామాలలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్ . ఎన్నో ఎకరాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది
-
తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని ఆయనపై నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు పోటీ పెట్టలేదు.
పీవీ నిర్వహించిన పదవులు
-
1951 అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యత్వం
-
1957-77 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యత్వం
-
1962-64 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
-
1964-67 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
-
1967 ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
-
1968-71 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
-
1971-73 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
-
1977 లోక్‌సభ సభ్యత్వం
-
1980 లోక్‌సభ సభ్యత్వం
-
జనవరి 1980-జూలై 1984 కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి
-
జూలై 1984-డిసెంబర్ 1984 కేంద్ర హోం శాఖమంత్రి
-
1984 లోక్‌సభ సభ్యత్వం (మూడో సారి)
-
నవంబర్ 1984-ఫిబ్రవరి 1985 భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
-
జనవరి 1985-సెప్టెంబర్ 1985 కేంద్ర రక్షణ శాఖమంత్రి
-
సెప్టెంబర్ 1985-జూన్, 1988 కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
-
జూలై 1986- ఫిబ్రవరి 1988 కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి
-
జూన్ 1988-డిసెంబర్ 1989 విదేశ వ్యవహారాల శాఖ మంత్రి
-
1989 లోక్‌సభ సభ్యత్వం (నాలుగోసారి)
-
29 మే, 1991 - 1996 కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
-
జూన్ 1991 – మే 10 1996 ప్రధానమంత్రి
-
నవంబర్ 1991 ఉప ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదవసారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు భాషా కోవిదుడు, దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి కీ.శే. పి.వి.నరసింహారావు. గొప్ప పండితుడు. వేయిపడగల్ని హిందీలోకి అనువదించాడు.
భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
Post date: Sun, 12/23/2012 - 13:25
Path: /content/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 |
వివరణ: 1817, ఆగస్ట్ 13. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!
ఒక్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
బ్రౌన్ తండ్రి డేవిడ్ బ్రౌన్ కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ నడిపిన ధర్మపాఠశాలల నిర్వాహకుడు. క్రైస్తవ మతప్రచారకుడే అయినా భారతీయతపై మక్కువ పెంచుకున్నవాడు. తన ముగ్గురు పిల్లలకు చిన్నప్పుడు పారసీ, హిందూస్థానీతోబాటు.. సంస్కృతం నేర్పించాడు డేవిడ్ బ్రౌన్. ఆ ముగ్గురిలో నడిపివాడు చార్లెస్ ఫిలిప్. భారతదేశంలో తొలిసారి తెలుగు పుస్తకాలను ప్రచురించిన శ్రీరాంపురం బాప్టిస్ట్ మిషన్.. అప్పట్లో వాళ్లింటికి దగ్గరే. డేవిడ్ బ్రౌన్ ప్రాచీన సంస్కృత గ్రంథాల మేలిప్రతులు తీసి.. ప్రచురించారు. ఆ పనిలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కూడా పాలుపంచుకున్నాడు. ఈ బహుభాషా పరిచయం, ప్రచురణ అనుభవం.. తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యానికి ఎంతో ఉపయోగపడింది. కానీ.. అందుకు తెలుగు సాహిత్యం మరో ఆరేళ్లపాటు వేచి ఉండాల్సి వచ్చింది!
ఇంగ్లండు నుంచి..: డేవిడ్ బ్రౌన్ అకాల మరణం తర్వాత ఆ కుటుంబం లండన్ వెళ్లింది. బ్రౌన్‌కు 18 ఏళ్లు నిండగానే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్‌ను కుంఫినీ తన ఉద్యోగంలోకి ఆహ్వానించింది. 'రైటర్'గా మద్రాసుకు పంపింది. మద్రాసులో మరో మూడేళ్లు శిక్షణ తీసుకోవాలని సూచించింది. ఆ మూడేళ్ల శిక్షణలో భాగంగానే బ్రౌన్ తెలుగు, మరాఠీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. వెలగపూడి వెంకటరమణయ్య బ్రౌన్ చేత తెలుగు అక్షరాలు దిద్దించారు. ఎంతో కృషి చేసిన బ్రౌన్ తెలుగులో అత్తెసరు మార్కులతోనే పాస్ కాగలిగాడు!
'మన్రోలప్ప' స్ఫూర్తి!
అది కాలేజీలో చివరి రోజు. బ్రౌన్‌ను కడప కలెక్టర్ సహాయకునిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు.. 'సివిల్' విద్యార్థులను ఉద్దేశించి నాటి గవర్నర్ థామస్ మన్రో ప్రసంగించారు. 'ప్రజల భాష నేర్చుకుని, ఆ భాషలో పాలన సాగిస్తేనే వారి ప్రేమానురాగాలు పొందవచ్చు...' అంటూ ఆయన చెప్పిన మాటలు కుర్ర బ్రౌన్ మనసులో నాటుకుపోయాయి. థామస్ మన్రో కడప కలెక్టర్‌గా పాలెగాళ్ల అధికారాల్ని తోసిరాజని రైత్వారి పద్ధతితో విప్లవం సృషించినవాడు. అంతటి మహానుభావుడు పనిచేసిన అదే ప్రాంతంలో తనకు తొలి పోస్టింగ్ రావడం కుర్రవయసు బ్రౌన్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చింది. కడప థామస్ మన్రో పేరును రైతులు తమ పిల్లలకు 'మన్రోలప్ప'గా పెట్టుకోవడం బ్రౌన్ గమనించాడు కూడా! ఇదంతా తెలుగు ప్రాంతంపై బ్రౌన్‌లో మక్కువ పెంచింది. అతితక్కువకాలంలోనే తెలుగు మాట్లాడటంలో కడప కలెక్టర్ హేన్‌బరీని సునాయాసంగా మించిపోయాడు.
వేమనతోనే మొదలు..
రెండేళ్లలోనే కుంఫినీ కడప నుంచి మచిలీపట్నానికి బ్రౌన్‌ను బదిలీచేసింది. అక్కడే 'అబే దుబాయ్' అనే ఫ్రెంచి మతబోధకుడు భారతదేశ ఆచారవ్యవహారాలపై రాసిన పుస్తకం బ్రౌన్ చేతికి చిక్కింది. అందులోనే తొలిసారి 'కడపకు చెందిన వేమన' గురించి తెలుసుకున్నాడు బ్రౌన్. విభిన్న పాఠాంతరాలు, తాళపత్ర ప్రతులతో వేమన పద్యాలు సేకరించాడం మొదలుపెట్టాడు. పండితుల సహాయంతో వాటిలో నిక్కమైనవాటిని ఏర్చికూర్చాడు. రాతప్రతులు రాయించాడు. తన వ్యాఖ్యానాలతో ఆంగ్లంలో అనువదించడం మొదలుపెట్టాడు. అలా అనువదించేటప్పుడే.. తెలుగు ఛందస్సుపై దృష్టిసారించాడు. తెలుగు ఛందోరీతుల్ని అర్థంచేసుకుంటూ.. తెలుగు, సంస్కృతంపై పుస్తకం రాశాడు. మళ్లీ రాజమండ్రికి బదిలీపై వెళ్లినప్పుడే తెలుగు సాహిత్యం ఓ ఉన్మాదంలా అతని బుర్రకు ఎక్కడం ప్రారంభించింది. బ్రౌన్ తెలుగు కావ్యాలకు పూర్తిగా దాసుడైపోయాడు. నాలుగువేలకు పైగా తాళపత్ర గ్రంథాలు సేకరించాడు. 1826లో మళ్లీ కడపకు రావడంతోనే.. అక్కడ సొంత డబ్బులతో బంగళా ఏర్పాటుచేశాడు. దానికి కాలేజా అని పేరుపెట్టాడు. తెలుగు పండితులు, రాయసగాళ్లను నియమించుకుని ప్రాచీన తెలుగు గ్రంథాల పరిష్కరణకు నడుంబిగించాడు. ఇదంతా సొంత ఖర్చుతోనే!
-
పనిలో పనిగా అది వరకు ఎ.డి.క్యాంప్‌బెల్ రాసిన తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువుకు అదనంగా సరళభాషలో నాలుగువేల పదాలు జతచేశాడు. తర్వాతి కాలంలో తెలుగు-ఇంగ్లిష్(బ్రౌణ్యం), ఇంగ్లిష్-తెలుగు నిఘంటువుల నిర్మాణానికి ఇది ఉపయోగపడింది.
-
బ్రౌన్ తయారుచేసిన మిశ్రమ భాషా నిఘంటువు... అప్పటికీ, ఇప్పటికీ ఓ 'క్లాసిక్'. బ్రౌన్ తర్వాత వందేళ్లకు గానీ మనం ఇటువంటి గ్రంథం తీసుకురాలేకపోయాం.
-
బ్రౌన్ ఎంత సాహితీప్రియుడో అంతగా ముక్కుసూటిదనం ఉన్నవాడు. అవినీతిని చూస్తే ఉడుకురక్తంతో ఉప్పొంగేవాడు. బ్రౌన్ క్రిమినల్ జడ్జిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు వేసిన కఠిన శిక్ష వివాదాస్పదమైంది. కుంఫినీ ప్రభుత్వం ఆయన్ని తొలగించింది. మూడేళ్లపాటు ఆయన ఇంగ్లండులో ఖాళీగా ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికిగానీ తెలుగు కావ్యాల ప్రచురణకు తానువెచ్చించిన ఖర్చు రాసుకునే తీరిక బ్రౌన్‌కు దొరకలేదట! అప్పట్లోనే ఆ ఖర్చు రూ.30 వేలని తేలింది. ఇంగ్లండు నుంచి మరోసారి కుంఫినీ ఉద్యోగిగా వచ్చినప్పుడూ ఆయన తెలుగు ప్రచురణ మానలేదు..మళ్లీ సొంత ఖర్చుతోనే!
-
తెలుగులో నలరాజ కథ, రంగనాథ రామాయణం, మహాభారతంలో కొన్ని పర్వాలు, భాగవత స్కంధాలు, తారాశశాంకీయం, వసుచరిత్ర, మనుచరిత్ర, దశావతార చరిత్ర, ముద్దుపళని రాధికాసాంత్వనం గ్రంథాలను సేకరించి.. శుద్ధప్రతులు తయారుచేశారు. ఆ తర్వాత పదవి విరమణ పొంది ఇంగ్లండు వెళ్లారు.
-
అలా వెళుతూ వెళుతూ... తాతాచారి కథల్ని సంకలనం చేశారు. తెలుగుజాతికి బ్రౌన్ ఇచ్చిన చివరి బహుకృతి అది. ఆధునిక కథానికలకు దగ్గరగా వచ్చే కథనశైలి ఈ సంకలనంలో కనిపిస్తుంది. ఆ రకంగా అప్పట్లోనే వ్యవహారిక భాషపై బ్రౌన్ దృష్టిసారించాడని చెప్పొచ్చు.
-
'తెలుగు సాహిత్యం మరణశయ్యపై ఉండేది. 1825 నాటికి ఆ దీపం మిణుకుమిణుకు మంటోంది. అయితే 30ఏళ్లలో దాన్ని తిరిగి బతికించగలిగాను..' అని చెప్పుకున్నాడు బ్రౌన్.
ఆ 'కాలేజా' ఇది...!
కడపలో బ్రౌన్ ఉపయోగించిన కాలేజా బంగళా... తర్వాతి కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో పడింది. ఓ కోర్టు వేలంతో ఆడిటర్ సీఆర్ కృష్ణస్వామి చేతికి వచ్చింది. చాలా కాలం తర్వాత ప్రముఖ సాహితీవేత్త జానుమద్ది హనుమచ్ఛాస్త్రి దాన్ని బ్రౌన్ బంగళాగా గుర్తించారు. ఆరుద్ర, బంగోరెలాంటి సాహితీ ప్రముఖులు ఆయనకు సహకరించారు. బంగళా యజమాని కృష్ణస్వామి నుంచి దానంగా పొంది 1987లో బ్రౌన్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. బ్రౌన్ స్ఫూర్తిగా ఎన్నో తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాలు కొలువుదీరాయి. 2006లో జానుమద్ది హనుమచ్ఛాస్త్రి దాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు.
1817, ఆగస్ట్ 13. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!
ఒక్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
Post date: Thu, 12/20/2012 - 13:50
Path: /content/%E0%B0%9B%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AB%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C |
వివరణ: "మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
పరాయి పీడనకు, పాలనకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి స్వేచ్ఛ, విముక్తి కోసం కలం పట్టి, గళమెత్తిన వీరసైనికుడాయన. 29 ఏళ్ళకే గేయాలు, రచనలు చేశారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో గరిమెళ్ళ గేయాలు బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ప్రజా హృదయంలోకి శరవేగంగా చొచ్చుకుపోయాయి. స్వరాజ్య గీతాలు, గేయాలు, వ్యాసాలు పదునైన ఛలోక్తులకు ఆయనకు ఆయనే సాటి.
తొలి జీవితం:
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా, గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ... విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు చదివారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. ఆ తరువాత... జాతీయోద్యమ స్ఫూర్తితో 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ "మా కొద్దీ తెల్లదొరతనం" పాటను రాశారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట.
ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ "మాకొద్దీ తెల్లదొరతనం- దేవ, మాకొద్దీ తెల్లదొరతనం" అంటూ ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట. ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో, గాంధీజీ ఈ పాటకు అనువాదము చేయించమని పురమాయించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి "స్వరాజ్యం" పత్రికలో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు. N.G..రంగా, గరిమెళ్ళను "ప్రజా పాటల త్యాగయ్య" అని ప్రశంసించారు
గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. అయితే, ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడుతూ, ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగారు.
"మా కొద్దీ తెల్ల దొర తనము..." అనే స్వాతంత్ర్య గీతము దశ దిశలా మార్మ్రో గింది. G.T.H. బేకన్(1921) గరిమెళ్ళ చేత ఈ పాటను పాడించాడు. "భాష రాని నాకే ఇంత గగుర్పాటును కలిగించింది. స్వదేశీయులలో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో అర్ధమైంది" అంటూ ఆ పాటను నిషేధించాడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారికి రాజద్రోహం నేరం కింద ఏడాది కఠిన కారాగార శిక్షను విధించాడు.
అది తెలుగు సాహిత్య చరిత్రలోనూ విస్మరించరాని రోజు. 1922 ఫిబ్రవరి 9న ఒక పాట వల్ల ఒక తెలుగు కవి కారాగారానికి వెళ్ళినరోజది! విచారణ పేరిట కొంతకాలం జైలులోనే ఉన్నారు. మళ్ళీ విచారణ 1922 జులై నెల చివరిలో జరిగి గరిమెళ్ళకు రెండేళ్లు శిక్ష విధించారు. అందుకు నిరసనగా గరిమెళ్ళ గళం నుంచి అద్భుత గేయం ఆశువుగా వెలువడింది. కూలిపోతున్నది 'కూలిపోతున్నది -మూల మట్టముతోటి కూలిపోతున్నది ప్రభుత్వం -కూకటివేళ్ళతో కూలిపోతున్నది పర ప్రభుత్వం' అని గరిమెళ్ళ అన్నారు. రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ మరొక గేయాన్ని వ్రాశారు. ''దండాలండోయ్ మేముండలేమండోయ్ బాబు సైతాను ప్రభుత్వాన్ని సాగనీయమండోయ్ బాబు'' అంటూ 113 చరణాల దీర్ఘగేయం సంతరించారు.
ఈయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసిన బ్రిటీష్ ప్రభుత్వం, ఇతను బయట ఉండటంకంటే.. జైల్లో ఉండటమే మంచిదని భావించి అరెస్టు చేసి, కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రెండు సంవత్సరాల జైలు శిక్షపడటంతో జైల్లో ఉండగా 1923లో ఆయన తండ్రి మరణించారు. అయితే గరిమెళ్ళ క్షమాపణ చెబితే, తండ్రిని చూసేందుకు వదిలిపెడతామని అన్నారట బ్రిటీష్ అధికారులు. అయితే దేశభక్తి జీర్ణించుకుపోయిన గరిమెళ్ళ క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు. జైలునుంచి విడుదలయ్యాక చాలాచోట్ల ప్రజల సన్మానాలందుకున్న గరిమెళ్ళ, వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. భార్య మరణంతో రెండో వివాహం, అప్పులు, ఆస్తుల అమ్మకం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆపై ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేస్తూ, శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి 18 పుస్తకాలు అచ్చు వేయించారు.
రచనలు:
1921లో గరిమెళ్ళ "స్వరాజ్య గీతములు" పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నా ఆయన తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో కూడా కొన్ని రచనలు చేశారు. జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్న గరిమెళ్ళ , గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా చేరారు కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో, ఆనందవాణిలో, మరికొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు. ఆంధ్రప్రభ, ఆనందవాణి పత్రికల్లో ఆయన రచనలు తరచూ వస్తూండేవి. మద్రాస్ ఆకాశవాణి (ఆలిండియా రేడియో)లో కూడా ఆయన సాహిత్యం ప్రసారమవు తుండేది.
భారతదేశంలో వలస పాలకుల తీరును పరిపాలించడానికి బ్రిటిష్ యువరాజు వెల్స్ వచ్చినప్పుడు గరిమెళ్ళ 'ఏమయ్యా యువరాజా ఎందుకొచ్చావు', అంటూ దొరల దోపిడీ పాలనను తీవ్రంగా నిరసించే గేయాన్ని రాశాడు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను శాశ్వతంగా హరించే పత్రికా ప్రభుత్వ ధిక్కారణ బిల్లులను, ప్రశ్నించే హక్కులను లేకుండా చేయాలని ప్రయత్నించిన పాలకుల తీరుపై పోరు సాగించిన యోధుడుగా గరిమెళ్ళ చరిత్రలో మిగిలిపోయారు.
స్వరాజ్య గీతాలే కాక 'అభ్యుదయ రాజ్యాంగ విధానం, జవహర్లు మతం, పూర్వపు బానిసత్వం నేటి ధన బానిసత్వం, ధర్మమేవ జయతే, మాణిక్యం విచికము విరుగుడు, పాత కాంగ్రెస్ వర్కర్లు లోక సేవకులు కావాలి, తెల్లవాడు తొలగందె పండగేమిటి మనకి? కాంగ్రెస్‌కు పట్టిన పిచ్చి ఆవేశం' మొదలైన వ్యాసాలు ఢంకా, ఆనందవాణి పత్రికల్లో రాశారు. గృహలక్ష్మి, త్రిలింగ పత్రిక, వాహిని, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో ఆయన పనిచేశారు. స్వగ్రామం ప్రియాగ్రహారంలో శారదా గ్రంథమాలను స్థాపించారు. భాష నేర్చుకొని ప్రసిద్ధ తమిళ రచన కురళ్‌ను తెనిగించారు. 'హర్ట్ ఆఫ్ ది నేషన్, మదర్ ఇండియా' మొదలైన ఇంగ్లీషు పద్యకావ్యాలను రచించారు. నాలడియార్ వంటి ప్రసిద్ధ తమిళ పద్యాలను తెనిగించారు. తళ్ళికోట మొదలైన కన్నడ నాటకాన్ని గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి సాహిత్యసేవ చేశారు. ఆయన వ్రాసిన హరిజనోద్యమ గీతాలు, స్వర్జాయపు గీతాలు తెలుగునాట ప్రతిధ్వనించాయి.
మా కొద్దీ తెల్లదొరతనము దేవ
మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించె ||మాకొద్దీ||
పన్నెండు దేశాలు పండుచున్నగాని
పట్టెడన్నము లోపమండి ఉప్పు ముట్టుకుంటె దోషమండి
నోట మట్టి కొట్టి పోతాడండి
అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి ||మాకొద్దీ||
చూడి యావుల కడుపు వేడివేడి మాంసం-వాడికి బహు ఇష్టమంట
మాదు పాడి పశువుల కోస్తాడంట, మా మతము
పాడుచేస్తాడంట
మా చూడియావుల మంద సురిగి ఇంటికిరాదు. ||మాకొద్దీ||
చివరిదశ:
చివరిదశలో పేదరికం బారిన పడ్డ గరిమెళ్ళకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డారు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి.
ఒక కన్ను పోగొట్టుకుని, పక్షపాతం బారిన పడ్డ ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలం యాచన మీద కూడా బ్రతికారు. స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా ఆయనకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి గరిమెళ్ళ చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవిస్తూ... 1952 డిసెంబర్ 18వ తేదీన పరమపదించారు.
"మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
Post date: Tue, 12/18/2012 - 11:19
Path: /node/1192 |
వివరణ: రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది
దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది
ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది
పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది
ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది
మాధవపెద్ది సత్యం (1922 - 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
సత్యం గారు 1922, మార్చి 11న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామములో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య మరియు సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యంను తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు.
మాధవపెద్ది సత్యం గారు షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం గారు ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు "అయ్యయో జేబులో డబ్బులు పోయెనే..." మరియు మాయాబజార్ సినిమాలోని "వివాహ భోజనంబు...." ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం గారు ప్రధానంగా గాయకుడే.
ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు మరియు రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలొ ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.
75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.
ఆయనే కబీర్ పాత్రలో 1946 లో వచ్చిన ' రామదాసు ' తమిళ-హిందీ ద్విభాషా చిత్రంతో నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి గాయకుడిగా స్థిరపడి సుమారు మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షక శ్రోతలను అలరించిన మాధవపెద్ది సత్యం. ఆయన నటుడిగా స్థిరపడిపోతే మనం గర్వంగా చెప్పుకోగలిగే మంచి గాయకుడిని కోల్పోయేవాళ్ళమేమో ! ఆది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. పాత్ర స్వభావాన్ని, పాత్రధారుని సంభాషణా చాతుర్యాన్ని అంత చక్కగా స్వంతం చేసుకుని పాడే గాయకుడు బహుశాః మాధవపెద్ది సత్యం గారొక్కరేనేమో!
ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన కుమారుడు, కూచిపూడి నృత్య కోవిదుడు మాధవపెద్ది మూర్తి గారు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం ' మాధవపెద్ది సత్యం అవార్డు మరియు మాధవపెద్ది ప్రభావతి అవార్డును ' నెలకొల్పారు. ఆ పురస్కారం అందుకొన్న వారిలో ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ లాంటి ప్రముఖులున్నారు.
రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది
దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది
ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది
పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది
ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది
మాధవపెద్ది సత్యం (1922 - 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
Post date: Tue, 12/18/2012 - 10:34
Path: /node/1188 |
వివరణ: సూర్యకాంతం, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు.
సూర్యకాంతం, ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.
ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు - "నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. 'సూర్యకాంతం' అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు"
ఏ చిత్రంలోనైనా ఆడ రౌడీ పాత్రలు కావాల్సివస్తే, కత్తులు, తుపాకులు అవసరంలేని మాటల తూటాలతో పాత్రకున్యాయం చేకూర్చగల ప్రతిభావంతురాలు. ఎవరినా, “ధధిగిణ ధోం” అని ఆమె ధోరణులకు వంతు పాడవలసినదే. ఏ దర్శకుడు, నిర్మాత అయినా సరే, సూర్యకాంతం పద్ధతికి అంగీకరించవలసినదే. మాటలు సూదుల్లా గుచ్చుకునేలా వున్నా, మనసులోమాత్రం వాటికి వెన్న, తేనె పూసింది అన్నది కొందరికే తెలిసిన విషయం. అందం అంటే కేవలం భౌతికం కాదు, మనసు, మాట, హృదయం ఎలా ప్రవర్తిస్తుందో దాన్నిబట్టి అందాన్ని అంచనా వేయాలి అంటే, సూర్యకాంతం వ్యక్తిత్వాన్ని ప్రప్రధమంగా చెప్పాలి. దరికిరానీయని గర్వం, అహంకారం కేవలం పాత్రలకే పరిమితం చేస్తూ న్యాయం చేకూర్చడం, ఏ రకమైన పాత్రనైనా చాకచక్యంతో అవలీలగా అర్ధం చేసుకుని నటించగలిగే సామర్ధ్యంగల తారాకాంతం, సూర్యకాంతం.
బాల్యం:
సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురం లో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.
సినీ జీవితం:
మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.
ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
అవి దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చిన రోజులు. దాసరి రాసిన ఒక డైలాగ్ సూర్యాకాంతంకు నచ్చలేదు. ఆ డైలాగ్ మార్చమని సూర్యాకాంతం అడిగితే దాసరి ఒప్పుకోలేదు. దీంతో ఆమె అదే డైలాగ్ ను చెప్పి షాట్ ఒకే చేశారు. అయితే, ఈ సంఘటనతో దాసరి బాధపడ్డారు. కాగా, తరువాత మరో షూటింగ్ లో పాల్గొన్న సూర్యాకాంతం అక్కడ కూడా డైలాగ్ మార్చమనిఅడిగారు. వెంటనే ఆ రైటర్ ‘సరే’ అన్నాడు. దానికి సూర్యాకాంతం ’నువ్వేం. రైటర్ వయ్యా.. ఏది మార్చమంటే అది మారుస్తానంటున్నావు.. నవ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం లేదా.. దాసరి చూసి నేర్చుకో‘ అని మందలించారు. ఈ సంగతి తెలిసిన దాసరి ఎంతగానో సంతోషించారు.
“పాత్ర తిట్టిందమ్మా! నువ్వు ఎందుకు బాధపడతావు” అని ఓ పాత్రద్వారా నాగయ్య పాత్రను తిట్టినందుకు అపరాధం క్షమించండీ అని ఆయన కాళ్ళమీద పడి మన్నించండి అని వేడుకోవడం లోనే, ఎప్పుడూ నాన్నగారూ అని నాగయ్యను పిలిచే, ఆమె మనసుచల్లదనం బయటపడుతుంది.
అత్తగారుగా వెలిగిన ఆమెను, అక్కగారు, దొడ్డమ్మగారు, పెద్దవారు “కాంతమ్మా౧” అని పిలవడంపట్ల సూర్యకాంతం అందరి వయసువారికి దగ్గరిబంధువు.
న్యాయంగా ఆమె వేసే పాత్రల్ని బట్టి “అత్తగారూ” అని పిలవడం ధర్మం; “ఆమ్మో! బయటకూడా అలా పిలిస్తే ఈ కోడళ్ళం బతికినట్లే! – అని మహానటి సావిత్రి చమత్కారవ్యాఖ్యానం.
ఓసారి 'శ్రీమంతుడు' సినిమా షూటింగులో జరిగింది. స్క్రిప్ట్ ప్రకారం తాను చెప్పవలసిన డైలాగులు అయిపోయినప్పటికీ ఆమె ఇంకా ఏవో డైలాగులు చెబుతూనే ఉందట. దర్శకుడు ప్రత్యగాత్మ కట్ చెప్పకుండా అలానే చూస్తుండిపోవడంతో, ''అదేంటి నాయనా... నా మటుకు నేను ఏదో చెప్పుకుపోతుంటే కట్ చెప్పడంలేదు'' అన్నారు. ''మీరు అదనంగా చెబుతోన్న డైలాగులు బాగానే ఉన్నాయి కదా... అని ఊరుకున్నాను'' అన్నారాయన. ''అలాగా ... అయితే అదనంగా చెప్పిన డైలాగులకి కాస్త అదనంగా ఏదైనా ఇప్పించు నాయనా'' అంటూ ఆమె అందర్నీ నవ్వించారు.
నటనా శైలి :
సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. హాస్యనటుల పక్కన వేసింది గనక - హాస్యనటి అనిపించుకోవచ్చు. ఐతే ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
వ్యక్తిత్వం:
వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!
షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్! అవుట్‌సైడ్’ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్ అవుట్ సైడ్ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్య ను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.
మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.
చివరిగా సూర్యకాంతం నిర్వచనం:
నటనద్వారా అందాన్ని, ఆనందాన్ని ప్రసాదించిన విదుషీమణి. ఓరచూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసురుతూ, కుడిచెయ్యిని నడుంమీద నిలబెట్టి విసరిన సంభాషణాచాతుర్యాల్లో వెక్కిరింపులు, కల్లబొల్లికబుర్లు చోటుచేసుకున్నా, ప్రతీమాట, ప్రతీసన్నివేశం సజీవశిల్పం. అల్పంలో అనల్పం, సూక్ష్మంలో మోక్షం – వెరసి పెద్దిభొట్ల సూర్యకాంతం. గయ్యాళి అత్తకు మరోపేరు. మనసున్న అమ్మకు సమానార్ధ్ం. అందుకే – తెరపైన “అత్త”, తెరవెనుక “అమ్మ” అన్న నిర్వచనం సరిసములులేని భావన. చిత్రాల్లో సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు, సహనటీనటులకు యింటినుంచి షడ్రసోపేతమైన ఆహారభోజనాల్ని తెచ్చిపెట్టడం, ఆ రుచులతో గయ్యాళితనాన్ని మరచిపోయి, మనసున్న మహామనీషిగా గుర్తింపు అలవోకగా తెచ్చుకుంది. పులిలా కనిపించే ఈమె హస్తవాసితనం పులిహోర తయారీలో సిద్ధహస్తురాలు, గోలచేయని గోంగూరపచ్చడి, మాయామర్మంలేని ఆవకాయ, అధ్బుతాల్ని అందించే అల్లంపచ్చడి, కన్నులవిందైన కందిపొడితోపాటు బిగుతైన డబ్బాతో ఘుమఘుమలాడే నేతిసరుకుని కూడ యింటినుంచి దిగుమతిచేసుకునివచ్చి, వివాహభోజనసమానమైన బలేపసందుల విందును అనుభవించేవారు
“సూర్యకాంతం” వ్యక్తిత్వం, నటన, ఈ ధరణిపై సూర్యకాంతి, చంద్రునిచల్లదనం ఉన్నంతవరకూ, సూర్యకాంతమ్మ సూరజముఖిలా వికసిస్తూ, నిత్యం కాంతినిస్తూ తెలుగుప్రజను నిండుగా అలరిస్తూనే వుంటుంది అన్నదాంట్లో ఆశ్చర్యం, విడ్డూరం లేని పరమసత్యాలు.
నటించిన సినిమాలు:
ధర్మాంగద (1949)
సంసారం (1950)
పెళ్ళిచేసి చూడు (1952)
బ్రతుకుతెరువు (1953)
కన్యాశుల్కం (1955) (మీనాక్షి)
దొంగరాముడు (1955)
చరణదాసి (1956)
శ్రీ గౌరీ మహత్యం (1956)
భాగ్యరేఖ (1957)
మాయాబజార్ (1957)
తోడికోడళ్ళు (1957)
దొంగల్లో దొర (1957)
అప్పుచేసి పప్పుకూడు (1959)
మాంగల్యబలం (1959)
కృష్ణలీలలు (1959)
భాగ్యదేవత (1959)
జయభేరి (1959)
శాంతినివాసం (1960)
ఇద్దరు మిత్రులు (1961)
పెళ్లికాని పిల్లలు (1961)
భార్యా భర్తలు (1961)
వాగ్దానం (1961)
వెలుగునీడలు (1961)
శభాష్ రాజా (1961
కలసి ఉంటే కలదు సుఖం (1961)
మంచిమనసులు (1962)
రక్తసంబంధం (1962)
సిరిసంపదలు (1962)
గుండమ్మకథ (1962)
తిరుపతమ్మకథ (1963)
నర్తనశాల (1963) (అథిది పాత్ర)
పరువు ప్రతిష్ఠ (1963
చదువుకున్న అమ్మాయిలు (1963
మురళీకృష్ణ (1964)
మూగమనసులు (1964)
డాక్టర్ చక్రవర్తి (1964)
ఉయ్యాల జంపాల (1965)
నవరాత్రి (1966)
సంగీతలక్ష్మి (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెమనసులు (1966)
బ్రహ్మచారి (1967)
సుఖ దు:ఖాలు (1967)
ఉమ్మడికుటుంబం (1967)
అత్తగారు-కొత్తకోడలు (1968)
బుద్ధిమంతుడు (1969)
ఆత్మీయులు (1969)
బాలరాజు కథ (1970)
దసరాబుల్లోడు (1971)
అమాయకురాలు (1971)
కాలం మారింది (1972)
కొడుకు కోడలు (1972)
అందాల రాముడు (1973)
ముత్యాల ముగ్గు (1975)
సెక్రటరి (1976)
గోరంతదీపం (1978)
రాధాకృష్ణ (1978)
కార్తీక దీపం (1979) (శారదా తల్లి)
వియ్యాలవారి కయ్యాలు (1979)
చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
పెళ్ళిచూపులు (1983
బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989)
వన్ బయ్ టూ (1993)
సూర్యకాంతం, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు.
సూర్యకాంతం, ఈ పేరు వింటేనే ఆంధ్రా కోడళ్ళకు హడల్. తల్లిదండ్రులు తమ కూతురికి సూర్యకాంతం పేరు పెట్టడానికి ఈ నాటికీ సాహసించరు. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే ‘అమ్మో - ఆవిడా? సూర్యకాంతమే!’ అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించింది సహజనట కళా శిరోమణి సూర్యకాంతం. విశేషం ఏమిటంటే, అత్తగారి పాత్రలో ఆమెకనిపించినా, అమెగయ్యాళే అని తెలిసినా - ఎన్ని సినిమాల్లో చూసినా ఏ మాత్రం విసుగు అనిపించకపోవడమే! ఒకే రకం పాత్రల్ని పోషించి - అంతకాలంపాటు, అన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణం ఆమె సహజ నటన.
Post date: Mon, 12/17/2012 - 10:17
Path: /node/1187 |
వివరణ: రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.
అ తెలుగువారి ప్రాంతంలోకి అడుగుపెట్టకుండా ముస్లింలతో పోరాడిన ధీరవనిత రాణి రుద్రమ దేవి. కాకతీయ వంశంలో పేర్గాంచిన రాజు గణపతి దేవుడు కుమార్తె రాణి రుద్రమ దేవి. రుద్రమ దేవి కాలంలో కాకతీయ రాజుల పాలన ప్రజల మన్ననలను పొందింది. రాజు గణపతి దేవుడు ఏకైక కుమార్తె రుద్రమాంబ. గణపతిదేవుడికి కుమారులు లేకపోవడంతో రుద్రమాంబను రుద్రదేవగా ముద్దుగా పిలుచుకునేవాడు. 14ఏళ్ల లేత ప్రాయంలేనే అధికారాన్ని చేపట్టింది రాణి రుద్రమ.
కాకతీయ వంశం కింద పనిచేసే సామంతులు రుద్రమదేవిని రాజ్యానికి రాణిగా పట్టాభిషేకం చేయటాన్ని వ్యతిరేకించారు. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణి రుద్రమ వారి అసూయను అణచివేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్ధవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణి రుద్రమ.
రాణి రుద్రమ 1261 సంవత్సరం నుంచి 1296 వరకూ దాదాపు 35 ఏళ్లపాటు కాకతీయ రాజ్యాన్ని పాలించింది. పొరుగు ప్రాంత రాజ్యాలు కాకతీయ రాజ్యంపై కన్నెత్తి చూడకుండా కంటికి రెప్పలా కాపాడిన ధీరవనిత రాణి రుద్రమ.
తండ్రి గణపతి దేవుడికి లాగానే రాణి రుద్రమ దేవికి కళలు, సాహిత్యం అంటే ఎనలేని ఆసక్తి. ఏకాశిలా నగరంగా పిలిచే ప్రస్తుత వరంగల్ కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించింది. ఒంటిరాతి కొండపై కోట నిర్మాణాన్ని తండ్రి గణపతి దేవుడు ప్రారంభిస్తే దానిని పూర్తిచేసిన ఘతన రుద్రమ దేవిది.
కాకతీయ కాలంలో శిల్పకళకు ప్రత్యేక అందాలను అద్దేలా చర్యలు చేపట్టింది రుద్రమ. వరంగల్ కోట 7 బురుజులు, లోతైన కందకాలతో నిర్మించారు. వరంగల్ కోట విస్తీర్ణం 32 చదరపు మైళ్లు. వరంగల్ కోట పూర్తి సమాచారం ఇప్పటివరకూ భారత పురావస్తు శాఖ పరిశోధనలలో సైతం వెలుగులోకి రాలేదు. వాస్తు పరంగా వరంగల్ కోటను మించినది లేదని విదేశీ యాత్రీకులు తమ గ్రంధాలలో వివరించారు.
రాణి రుద్రమ పరిపాలనా కాలంలో మచిలీపట్నం (కృష్ణా జిల్లా), మోటుపల్లి (ప్రకాశం జిల్లా) లు ప్రధాన నౌకాశ్రయాలుగా రూపుదిద్దుకున్నాయి. అలాగే ప్రజలు అవసరాలతో పాటుగా, పంటల కోసం అనేక చెరువులు. కాల్వలు తవ్వించి కాకతీయ రాజ్యాన్ని సుభిక్షం చేసింది రాణి రుద్రమ.
ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడ వివరముగా వ్రాశాడు.
రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.
Post date: Thu, 12/13/2012 - 21:08
Path: /node/1172 |
వివరణ: సావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరిచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. జగతి మరువలేని నటిసావిత్రి. అమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. ఆమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు. అందుకే నటీ శిరోమణి అయింది.
సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే. ఒక్క రోజులోనో, సిఫార్సులతోనో ఆమెకు వేషాలు రాలేదు. అతి ప్రయాసతో, ప్రతిభతో సినిమాల్లో వేషాలు సంపాదించుకున్నారు. స్డూడియోల చుట్టూ తిరిగి, నిర్మాతల కార్యాలయాల మెట్లు ఎక్కిదిగుతూ పడరాని పాట్లు పడ్డారు. విజయవాడ నుంచి రెండు సంవత్సరాల పాటు మద్రాసుకు వ స్తూపోతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఒకవైపు నాటకాలు వేస్తూ, కాస్తోకూస్తో డబ్బు సంపాదించుకుని, ఆ డబ్బుతో మద్రాసుకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించారు.
1948 ఆగస్టులో మద్రాసుకు తొలిసారిగా వచ్చి 1950లో చిన్నాచితకా వేషాలు వేశారు. తర్వాత మెల్లగా నిలదొక్కుకున్నారు. మహానటి అయ్యారు. పుట్టిన కొద్ది రోజుల్లోనే తండ్రి మరణించడంతో కష్టాలను ఎదుర్కొని, పెద్దనాన్నతో విజయవాడ చేరుకున్నారు. అక్కడే నాట్యం నేర్చుకుని, నాటకాలు వేస్తూ సినీ రంగ ప్రవేశం చేశారు. సావిత్రి శోక పాత్రలకు ప్రసిద్ధిగా చెప్పవచ్చు. దేవదాసు చిత్రంలో పార్వతిగా సావిత్రి కాక మరొకరు వేసి ఉంటే అంత హిట్టయ్యేది కాదేమో.
చిన్నప్పుడు ఆమె దేవదాసు నవలను చదువుతూ ఏడుస్తూ ఉండేట. తల్లి సుభద్రమ్మ కేకలు వేసినా అదే పుస్తకం చదువుతూ ఏడుస్తూ కాలం గడిపేది. ఆ కథలోని ఘట్టాలు, పాత్రలు నన్ను అలా కదిలించేవని సావిత్రి చేప్పేవారు. అందుకేనేమో పార్వతి పాత్రలో సావిత్రి పూర్తిగా లీనమయ్యారు. సినిమా ప్రవేశానికి ముందు నుంచి ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టం తనదిగా భావించి అనేక మందికి సహాయం చేశారు.
దుఃఖ రస సన్నివేశాల్లో నటించేటప్పుడు ఆమె ఎవరితోనూ మాట్లాడరు. సినిమా షూటింగ్‌లో పనిచేసే వాళ్లనూ, చూసేందుకువచ్చే వాళ్లనూ ఆమె పట్టించుకోరు. షాట్‌కు షాట్‌కు మధ్య గ్యాప్ వచ్చినా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. అదే మూడ్ మళ్లీ తెచ్చుకోవాలంటే కష్టమని ఆమె అభిప్రాయం. నటిస్తున్నపుడు ఆమె పాత్ర ల్లో లీనమైపోయేవారు. దేవదాసు చిత్రంలో కొద్ది సేపు తప్పితే, తరువాత అంతా ఏడుపు దృశ్యాలే. ఒక సన్నివేశంలో నాగేశ్వరరావుతో నటిస్తూ తలుపుకేసి తల బాదుకుని ఏడ్వాల్సిన సన్నివేశం. ఆ సన్నివేశంలో ఆమె పూర్తిగా లీనమయ్యారు. డెరైక్టర్ కట్ చెప్పినా, ఆమె తల బాదుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత నాగేశ్వరరావు, దర్శకుడు రాఘవయ్య ఆమె ను సముదాయించాల్సి వచ్చింది.
ఇటువంటి సన్నివేశాల్లో నటించినపుడు ఇంటికి వెళ్లి భోజనం కూడా చేయకుండా నిస్తేజంగా పడుకునేవారట. రక్త సంబంధం, కళత్తూరు కన్నమ్మ చిత్రాల్లో నటించినపుడు ఇదే అనుభూతినిపొంది, ఆ భ్రమలోనే మూడు రోజులు ఉన్నట్లు సావిత్రి అప్పట్లో చెప్పేవారు. సావిత్రి అసలు పేరు కూడా అదే, కొమ్మారెడ్డి సావిత్రి సినిమాల్లో రాకముందు తన ఎనిమిదేళ్ల వయసులో శిష్ట్లా పూర్ణయ్య చౌదరి వద్ద నాట్యం నేర్చుకున్నారు. ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత తన పెద్దనాన్న వెంకట్రామయ్య చౌదరి ప్రోద్బ్రలం, ప్రోత్సాహంతో అరుణోదయ నాట్య మండలి, ఎన్‌టి.రామారావు స్థాపించిన నవభారత నాట్య మండలిలో నాట కాలు వేశారు. సినిమా రంగంలో చిన్నచిన్న వేషాలు వేశారు. పాతాళ భైరవిలోనూ ఒక పాత్రలో నటించారు. ఎల్‌వి ప్రసాద్ దర్శకత్వంలోని పెళ్లి చేసి చూడులో సెకండ్ హీరోయిన్ పాత్ర వేశారు.
అక్కడి నుంచి హీరోయిన్‌గానే వేషాలు వేశారు. సంసారం, దేవదాసు, అర్ధాంగి, మిస్స మ్మ, తోడి కోడళ్లు, మాంగల్య బలం, అప్పు చేసి పప్పుకూడు, కన్యాశుల్కం, నాదీ ఆడజన్మే, దేవత, గోరింటాకు ఇలా ఎన్నో తెలుగు సినిమాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. దాదాపు 247 చిత్రాలు చేశారు. వీటిలో తెలుగు చిత్రాలే 143 ఉన్నాయి. ఆమె కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం లాంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి. 1955లో జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నారు.
మూడేళ్ల తర్వాత వివాహం చేసుకున్న విషయాన్ని బహిర్గతం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. సావిత్రి 46 ఏళ్ల వయసులో అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె లేకున్నా ఆమె చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ మహానటి తర్వాత మరో మహానటి ఎక్కడా కనిపించలేదని సినీ వర్గాలు అంటుంటాయి. వజ్రోత్సవ వేళ అభిమానులు ఆమెకు కళానీరాజనాలు సమర్పిస్తున్నారు.
ఆమె సినిమాలు
నటిగా
-
సంసారం (1950)
-
అగ్నిపరీక్ష (1951)
-
పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
-
పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
-
పల్లెటూరు (1952)లో సుగుణ
-
ప్రతిజ్ఞ (1953)
-
దేవదాసు (1953)లో పార్వతి
-
బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
-
మేనరికం (1954)
-
చంద్రహారం (1954)లో చంచల
-
బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
-
పరివర్తన (1954)లో సుందరమ్మ
-
వదిన (1955)
-
మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
-
మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
-
అర్ధాంగి (1955)
-
సంతానం (1955)లో శారద
-
కన్యాశుల్కం (1955)లో మధురవాణి
-
దొంగరాముడు (1955)లో సీత
-
చరణదాసి (1956)లో లక్ష్మి
-
భలేరాముడు (1956)
-
అమరదీపం (1956)లో అరుణ
-
వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
-
తోడికోడళ్ళు (1957)లో సుశీల
-
ఎమ్మెల్యే (M.L.A.) (1957)లో నిర్మల
-
భలే అమ్మాయిలు (1957)
-
మాయాబజార్ (1957)లో శశిరేఖ
-
మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
-
కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
-
మాంగల్యబలం (1958)
-
అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
-
భాగ్యదేవత (1959)
-
నమ్మిన బంటు (1959)
-
విమల (1960)
-
శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
-
శాంతినివాసం (1960)
-
దీపావళి (1960)
-
చివరకు మిగిలేది (1960)లో పద్మ
-
పాపపరిహారం (1961)
-
పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
-
పాండవవనవాసం (1961)లో ద్రౌపది
-
కలసివుంటే కలదుసుఖం (1961)
-
సిరిసంపదలు (1962)
-
పవిత్రప్రేమ (1962)
-
మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
-
మంచిమనసులు (1962)
-
ఆరాధన (1962)లో అనూరాధ
-
గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
-
రక్తసంబంధం (1962)
-
ఆత్మబంధువు (1962)
-
రక్తతిలకం (1963)లో కమల
-
మూగ మనసులు (1963)లో రాధ
-
కర్ణలో (1963) భానుమతి
-
కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
-
ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
-
చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
-
నర్తనశాల (1963)లో ద్రౌపది
-
వెలుగునీడలు (1964)లో సుగుణ
-
పూజాఫలం (1964)లో సీత
-
నవరాత్రి (1964)
-
కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
-
గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
-
డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
-
దేవత (1964)
-
సుమంగళి (1965)
-
తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
-
నాదీ ఆడజన్మే (1965)
-
మనుషులు మమతలు (1965)
-
నవరాత్రి (1966)
-
భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
-
ప్రాణమిత్రులు (1967)
-
వరకట్నం (1968)
-
తల్లితండ్రులు (1970)లో కౌసల్య
-
మరోప్రపంచం (1970)
-
అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
-
జగన్మోహిని (1978)
-
అందరికంటే మొనగాడు (1985)
-
దేవదాసు మళ్లీ పుట్టాడు
-
గోరింటాకు (చివరి సినిమా)
నిర్మాతగా
-
ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
-
చిన్నారి పాపలు (1968)
-
కుళందై ఉళ్ళం (1969) ... తమిళ చిత్రం
-
మాతృదేవత (1969)
-
చిరంజీవి (1969)
-
వింత సంసారం (1971)
-
ప్రాప్తం (1971) ... తమిళ చిత్రం
సావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరిచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. జగతి మరువలేని నటిసావిత్రి. అమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. ఆమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు. అందుకే నటీ శిరోమణి అయింది.
సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే. ఒక్క రోజులోనో, సిఫార్సులతోనో ఆమెకు వేషాలు రాలేదు. అతి ప్రయాసతో, ప్రతిభతో సినిమాల్లో వేషాలు సంపాదించుకున్నారు. స్డూడియోల చుట్టూ తిరిగి, నిర్మాతల కార్యాలయాల మెట్లు ఎక్కిదిగుతూ పడరాని పాట్లు పడ్డారు. విజయవాడ నుంచి రెండు సంవత్సరాల పాటు మద్రాసుకు వ స్తూపోతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఒకవైపు నాటకాలు వేస్తూ, కాస్తోకూస్తో డబ్బు సంపాదించుకుని, ఆ డబ్బుతో మద్రాసుకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించారు.
Post date: Thu, 12/06/2012 - 12:30
Path: /node/1105 |
వివరణ: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శ్రుతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.
ఆ తరవాత కొన్నాళ్ళు కచేరీలూ, హరికథలూ, రేడియో కార్యక్రమాలతో గడిచాయి. స్టేజినాటకాల్లో నటించే అవకాశాలు కూడా కలిగాయి. పెద్దలంతా మెచ్చుకున్నారు కాని ఆదాయం మాత్రం పెరగలేదు. ఇంతలో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంవల్ల ప్రభావితుడైన ఘంటసాల దేశభక్తి గేయాలను గానం చేస్తూ కొన్నాళ్ళు జెయిలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ పాటల రికార్డులు విశేష జనాదరణ పొందాయి. ఆ రోజుల్లోనే ఆయనకు వివాహం జరగడం, అత్తవారి ఊరిలో సినీ రచయిత సముద్రాల సీనియర్‌తో పరిచయం కలిగాయి. సముద్రాల ద్వారా 1944లో ఘంటసాల సినీ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు పాటలతోనూ, ఘంటసాల నటనతోనూ ఒకేసారి కుస్తీ పడుతూండేవారు. ప్లేబాక్ పద్ధతి రావడం తో ఎవరి పాత్ర వారికి లభించినట్టయింది. సినీ నేపథ్య గాయకుడిగా త్వరలోనే ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది.
పాటలో నటించడం ఆయనకు సహజంగా అబ్బిన విద్య. ఆయన గాత్రంలో ఉన్న లాలిత్యం, దానితో బాటు గాంభీర్యం; మూడు స్థాయిలలోనూ అవలీలగా పలికే రాగ భావం, శబ్దోచ్చారణలోని స్పష్టత, రాగాల గురించిన నిర్దుష్టమైన అవగాహన ఇలా ఎన్నో ఉత్తమ లక్షణలు ఆయన పాటలను తీర్చి దిద్దాయి. వివిధ సన్నివేశాలలో పాడిన విషాద గీతాలు, ప్రేమ గీతాలు, యుగళ గీతాలే కాక హరి కథలు, బుర్ర కథలు, జానపద గీతాలు, హాస్యగీతాలు, శాస్త్రీయ గీతాలు ఆయన గానంలోని విస్తృత పరిధికి అద్దం పడతాయి. పాటలే కాదు, పద్యాలను కూడా అతిగా రాగం తియ్యకుండా అర్థం, రాగభావం సమపాళ్ళలో మేళవించి పాడే పద్ధతి ఆయనకే చెల్లింది.
ఆయన పాడిన శకంలో ఉద్దండులైన సంగీత దర్శకులుండేవారు. రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్, పెండ్యాల, ఆదినారాయణరావు, సుసర్ల దక్షిణామూర్తి వంటివారి గొప్పదనం ఘంటసాల పాటలకు ఎక్కువ దోహదం చేసిందో, ఆయన వల్ల వారంతా రాణించారో చెప్పడం కష్టం. స్వరకర్తలూ గాయకులే కాక పాటల రచయితలూ, బి.ఎన్.రెడ్డి వంటి సినీ దర్శకులూ పాటల పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు కనుకనే అటువంటి సంగీతం తయారయింది. ఈ నాటి సంగీతంలో లోపాలున్నాయంటే అందుకు కారణం “రాగాల్లోనూ, బాణీల్లోనూ వెయ్యవలసినవీ, వెయ్యకూడనివీ గమకాలూ, సున్నితమైన అనుస్వరాలూ ఉంటాయి” అనేది పాడేవారికీ పాటలు కట్టేవారికీ కూడా తెలియకపోవడం అనుకుంటాను.
ఘంటసాల పాడడం మొదలెట్టిన రోజుల్లో అప్పటికే పేరు పొందిన ఎం.ఎస్. రామారావు, ఎస్.రాజేశ్వర రావు వంటి గాయకులలో వినిపించని నిండుదనం, తెలుగుదనం (నేటివిటీ) మొదటిసారిగా ఘంటసాల పాటలలో వినిపించి శ్రోతలను ఆకట్టుకున్నాయి. లైలా మజ్నూలో సుసర్ల దక్షిణామూర్తి, మాధవపెద్ది సత్యం, ఘంటసాల కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” అనే పాటలో హీరో ఎవరో గుర్తు పట్టడం చాలా తేలిక. అది 1949నాటి సినిమా. అప్పటికి స్టార్ సిస్టం అమలులోకి రాలేదు. బాగా పాడేవారినే హీరోకు ఎన్నుకునేవారు. ఘంటసాల తరవాత సినిమాల్లో పాడడానికి వచ్చిన మాధవపెద్ది సత్యం, ఏ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్ తదితరులు ఈనాటి గాయకుల కన్న ఎంతో ప్రతిభావంతులే. అయినప్పటికీ వారు ఘంటసాలకు సమకాలికులు కావడంతో ఆయనకు సరితూగలేక పోయారు. అంతేకాదు. ఎన్నో దశాబ్దాలపాటు సినీ హీరోలుగా అగ్రస్థానంలో ఉన్న, రామారావు, నాగేశ్వరరావులు ఘంటసాల పాడందే నటించేవారు కాదు.
ఒకప్పుడు విజయావారు తమ నిర్మాణ సంస్థలో ఇతర కళాకారులతోబాటు ఘంటసాలను నెల జీతం మీద నియమించారు. అందులో ఇతర సంస్థలకు పని చెయ్యరాదనే నిబంధన ఉండడం వల్ల ఘంటసాల వంటి ఉత్తమ కళాకారులకు అది కుదరని పరిస్థితి అయింది. మిస్సమ్మ సినిమాకు సంగీత దర్శకుడుగా కాని, గాయకుడుగా కాని ఆయన పని చెయ్యక పోవడానికి కారణం ఇదేనంటారు. కారణాలు ఏవైనా ఘంటసాల పాడినంత కాలమూ ఆయనకు పోటీ లేకుండా పోయింది. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదని అనిపిస్తూండేది. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు.
ఘంటసాల సంగీత దర్శకుడుగా కనబరిచిన ప్రతిభ ఆయన గాయకుడుగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడింది. 1950 ప్రాంతాల తీసిన పెళ్ళిచేసిచూడు లోనే ఆయన చక్రవాకం (ఏడుకొండలవాడ), చారుకేశి (ఎవరో ఎవరో) వంటి కర్ణాటక రాగాలను అతి సమర్థవంతంగా సినీగీతాలకు వాడుకున్నాడు. హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఆయనకు సరదా అనిపిస్తుంది. రాగేశ్రీ వంటి హిందూస్తానీ రాగాలను కూడా ఆయన “ఇది నాచెలి” (చంద్రహారం), “అన్నానా భామిని” (సారంగధర) వగైరా పాటల్లో ఉపయోగించాడు. కుంతీకుమారి పద్యాల్లో కర్ణాటక రాగాలైన హేమావతి, బిలహరి, మాయామాళవగౌళ, అమృతవర్షిణి, హిందూస్తానీ రాగాలైన లలిత్ వంటివి అనేకం వినిపిస్తాయి. లలితసంగీతానికి పనికిరావనిపించే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను ఆయన తన కరుణశ్రీ పద్యాల్లో అద్భుతంగా ఉపయోగించాడు. ఇది విద్వాంసులు సైతం గుర్తించవలసిన విషయం. ఏ రాగం ఎక్కడ వాడినా రాగభావాన్ని చెడనివ్వలేదు. మాటల్లోని అర్థమూ కనుమరుగవలేదు. రహస్యం సినిమాలో సందర్భాన్ని బట్టి సరస్వతి, లలిత వంటి దేవతల పేర్లున్న రాగాలలో ఆయన స్వరరచన చేశాడు. రాజేశ్వర రావు, పెండ్యాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాలకు ఉండిన అధికారం వారికన్నా ఎక్కువేమో.
ఘంటసాల స్వయంగా తాను సంగీతదర్శకుడు అయినప్పటికీ ఆర్కెస్ట్రాలో దిట్ట అయిన సి.ఆర్.సుబ్బరామన్ వద్ద అసిస్టెంటుగా పనిచేసి ఎంతో అనుభవం గడించాడు.
మాయాబజార్‌లోని నాలుగు యుగళగీతాలూ మొదట రాజేశ్వరరావు స్వరపరచారట. తక్కినవన్నీ నిస్సందేహంగా ఘంటసాలవే. చారుకేశిలో సత్యంచేత “భళిభళిదేవా” పాడించి ఘటోత్కచుడికి “వివాహ భోజనంబు” కూడా పాడించిన ఘనత ఆయనదే. ఇది Laughing policeman అనే పాత ఇంగ్లీషు పాటకు అనుకరణ. ఒరిజినల్ పాట చతురశ్రంలో సాగితే తెలుగు పాట స్వింగ్ రిధంలో వినబడుతుంది. పోలీసువాడి నవ్వుని రాక్షసుడి వికటాట్టహాసంగా మార్చిన ఘనత ఘంటసాలదీ, పింగళిదీ, కె.వి.రెడ్డిిదీ కావచ్చు.
మొదట్లో ప్రతి సినిమాలోనూ అందరు గాయకులకూ తలో పాటా పాడే అవకాశం వచ్చేది. రాను రాను అన్ని పాటలనూ ఘంటసాల చేతనే పాడించే ధోరణి బలపడింది. (అందుకు నిర్మాతలు కూడా బాధ్యులేమో!) కొందరు కొత్త హీరోలకు మాత్రం కె.వి.మహాదేవన్, కోదండపాణి వంటివారు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చేత పాడించసాగారు.
వ్యక్తిగతంగా ఘంటసాల ఎంతో మంచివాడనీ వినయసంపన్నుడనీ ఆయన సమకాలికులకు తెలిసినదే. మద్రాసుకు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్‌గారు వచ్చినప్పుడు ఆయనను ఘంటసాల కోరి తమ ఇంటో అతిథిగా ఉంచుకున్నాడు. ఉస్తాద్‌గారంటే ఆయనకు అంత అభిమానం.
మద్రాసులోని ఒక తెలుగు సభలో ఆయన ఉండగానే ఆయనకు పద్మశ్రీ వచ్చిన వార్త విన్న ముదిగొండ లింగమూర్తిగారు, చాలా ఆర్భాటంగా ఆ సంగతి ప్రేక్షకులకు ప్రకటించారు. ఘంటసాలగారు లేచి అతివినయంగా అందరికీ నమస్కరించారు. అక్కడి సభలో ఆయన “నీ కొండకు నీవే రప్పించుకో” అని ఎంతో భావోద్వేగంతో పాడాడు.
చివరిదశ:
1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.
అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు. యావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారు.
Post date: Mon, 12/03/2012 - 21:33
Path: /node/1104 |