మహానటి సావిత్రి

savithriసావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరిచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. జగతి మరువలేని నటిసావిత్రి. అమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. ఆమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు. అందుకే నటీ శిరోమణి అయింది.

సావిత్రి వచ్చే వరకు మహానటి అనే పేరు మరే నటికి లేదేమో. ఆమె తర్వాత కూడా మరో మహానటి రాలేదని చెప్పవచ్చు. 20వ శతాబ్దానికి మహానటి సావిత్రి ఒక్కరే. ఒక్క రోజులోనో, సిఫార్సులతోనో ఆమెకు వేషాలు రాలేదు. అతి ప్రయాసతో, ప్రతిభతో సినిమాల్లో వేషాలు సంపాదించుకున్నారు. స్డూడియోల చుట్టూ తిరిగి, నిర్మాతల కార్యాలయాల మెట్లు ఎక్కిదిగుతూ పడరాని పాట్లు పడ్డారు. విజయవాడ నుంచి రెండు సంవత్సరాల పాటు మద్రాసుకు వ స్తూపోతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఒకవైపు నాటకాలు వేస్తూ, కాస్తోకూస్తో డబ్బు సంపాదించుకుని, ఆ డబ్బుతో మద్రాసుకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించారు.

1948 ఆగస్టులో మద్రాసుకు తొలిసారిగా వచ్చి 1950లో చిన్నాచితకా వేషాలు వేశారు. తర్వాత మెల్లగా నిలదొక్కుకున్నారు. మహానటి అయ్యారు. పుట్టిన కొద్ది రోజుల్లోనే తండ్రి మరణించడంతో కష్టాలను ఎదుర్కొని, పెద్దనాన్నతో విజయవాడ చేరుకున్నారు. అక్కడే నాట్యం నేర్చుకుని, నాటకాలు వేస్తూ సినీ రంగ ప్రవేశం చేశారు. సావిత్రి శోక పాత్రలకు ప్రసిద్ధిగా చెప్పవచ్చు. దేవదాసు చిత్రంలో పార్వతిగా సావిత్రి కాక మరొకరు వేసి ఉంటే అంత హిట్టయ్యేది కాదేమో.

చిన్నప్పుడు ఆమె దేవదాసు నవలను చదువుతూ ఏడుస్తూ ఉండేట. తల్లి సుభద్రమ్మ కేకలు వేసినా అదే పుస్తకం చదువుతూ ఏడుస్తూ కాలం గడిపేది. ఆ కథలోని ఘట్టాలు, పాత్రలు నన్ను అలా కదిలించేవని సావిత్రి చేప్పేవారు. అందుకేనేమో పార్వతి పాత్రలో సావిత్రి పూర్తిగా లీనమయ్యారు. సినిమా ప్రవేశానికి ముందు నుంచి ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టం తనదిగా భావించి అనేక మందికి సహాయం చేశారు.

దుఃఖ రస సన్నివేశాల్లో నటించేటప్పుడు ఆమె ఎవరితోనూ మాట్లాడరు. సినిమా షూటింగ్‌లో పనిచేసే వాళ్లనూ, చూసేందుకువచ్చే వాళ్లనూ ఆమె పట్టించుకోరు. షాట్‌కు షాట్‌కు మధ్య గ్యాప్ వచ్చినా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. అదే మూడ్ మళ్లీ తెచ్చుకోవాలంటే కష్టమని ఆమె అభిప్రాయం. నటిస్తున్నపుడు ఆమె పాత్ర ల్లో లీనమైపోయేవారు. దేవదాసు చిత్రంలో కొద్ది సేపు తప్పితే, తరువాత అంతా ఏడుపు దృశ్యాలే. ఒక సన్నివేశంలో నాగేశ్వరరావుతో నటిస్తూ తలుపుకేసి తల బాదుకుని ఏడ్వాల్సిన సన్నివేశం. ఆ సన్నివేశంలో ఆమె పూర్తిగా లీనమయ్యారు. డెరైక్టర్ కట్ చెప్పినా, ఆమె తల బాదుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత నాగేశ్వరరావు, దర్శకుడు రాఘవయ్య ఆమె ను సముదాయించాల్సి వచ్చింది.

ఇటువంటి సన్నివేశాల్లో నటించినపుడు ఇంటికి వెళ్లి భోజనం కూడా చేయకుండా నిస్తేజంగా పడుకునేవారట. రక్త సంబంధం, కళత్తూరు కన్నమ్మ చిత్రాల్లో నటించినపుడు ఇదే అనుభూతినిపొంది, ఆ భ్రమలోనే మూడు రోజులు ఉన్నట్లు సావిత్రి అప్పట్లో చెప్పేవారు. సావిత్రి అసలు పేరు కూడా అదే, కొమ్మారెడ్డి సావిత్రి సినిమాల్లో రాకముందు తన ఎనిమిదేళ్ల వయసులో శిష్ట్లా పూర్ణయ్య చౌదరి వద్ద నాట్యం నేర్చుకున్నారు. ప్రదర్శనలు ఇచ్చేవారు. తర్వాత తన పెద్దనాన్న వెంకట్రామయ్య చౌదరి ప్రోద్బ్రలం, ప్రోత్సాహంతో అరుణోదయ నాట్య మండలి, ఎన్‌టి.రామారావు స్థాపించిన నవభారత నాట్య మండలిలో నాట కాలు వేశారు. సినిమా రంగంలో చిన్నచిన్న వేషాలు వేశారు. పాతాళ భైరవిలోనూ ఒక పాత్రలో నటించారు. ఎల్‌వి ప్రసాద్ దర్శకత్వంలోని పెళ్లి చేసి చూడులో సెకండ్ హీరోయిన్ పాత్ర వేశారు.

అక్కడి నుంచి హీరోయిన్‌గానే వేషాలు వేశారు. సంసారం, దేవదాసు, అర్ధాంగి, మిస్స మ్మ, తోడి కోడళ్లు, మాంగల్య బలం, అప్పు చేసి పప్పుకూడు, కన్యాశుల్కం, నాదీ ఆడజన్మే, దేవత, గోరింటాకు ఇలా ఎన్నో తెలుగు సినిమాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు. దాదాపు 247 చిత్రాలు చేశారు. వీటిలో తెలుగు చిత్రాలే 143 ఉన్నాయి. ఆమె కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం లాంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి. 1955లో జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నారు.

మూడేళ్ల తర్వాత వివాహం చేసుకున్న విషయాన్ని బహిర్గతం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. సావిత్రి 46 ఏళ్ల వయసులో అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె లేకున్నా ఆమె చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ మహానటి తర్వాత మరో మహానటి ఎక్కడా కనిపించలేదని సినీ వర్గాలు అంటుంటాయి. వజ్రోత్సవ వేళ అభిమానులు ఆమెకు కళానీరాజనాలు సమర్పిస్తున్నారు.

ఆమె సినిమాలు
నటిగా
 

  1.     సంసారం (1950)
  2.     అగ్నిపరీక్ష (1951)
  3.     పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
  4.     పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
  5.     పల్లెటూరు (1952)లో సుగుణ
  6.     ప్రతిజ్ఞ (1953)
  7.     దేవదాసు (1953)లో పార్వతి
  8.     బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
  9.     మేనరికం (1954)
  10.     చంద్రహారం (1954)లో చంచల
  11.     బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
  12.     పరివర్తన (1954)లో సుందరమ్మ
  13.     వదిన (1955)
  14.     మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
  15.     మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
  16.     అర్ధాంగి (1955)
  17.     సంతానం (1955)లో శారద
  18.     కన్యాశుల్కం (1955)లో మధురవాణి
  19.     దొంగరాముడు (1955)లో సీత
  20.     చరణదాసి (1956)లో లక్ష్మి
  21.     భలేరాముడు (1956)
  22.     అమరదీపం (1956)లో అరుణ
  23.     వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
  24.     తోడికోడళ్ళు (1957)లో సుశీల
  25.     ఎమ్మెల్యే (M.L.A.) (1957)లో నిర్మల
  26.     భలే అమ్మాయిలు (1957)
  27.     మాయాబజార్ (1957)లో శశిరేఖ
  28.     మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
  29.     కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
  30.     మాంగల్యబలం (1958)
  31.     అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
  32.     భాగ్యదేవత (1959)
  33.     నమ్మిన బంటు (1959)
  34.     విమల (1960)
  35.     శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
  36.     శాంతినివాసం (1960)
  37.     దీపావళి (1960)
  38.     చివరకు మిగిలేది (1960)లో పద్మ
  39.     పాపపరిహారం (1961)
  40.     పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
  41.     పాండవవనవాసం (1961)లో ద్రౌపది
  42.     కలసివుంటే కలదుసుఖం (1961)
  43.     సిరిసంపదలు (1962)
  44.     పవిత్రప్రేమ (1962)
  45.     మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
  46.     మంచిమనసులు (1962)
  47.     ఆరాధన (1962)లో అనూరాధ
  48.     గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
  49.     రక్తసంబంధం (1962)
  50.     ఆత్మబంధువు (1962)
  51.     రక్తతిలకం (1963)లో కమల
  52.     మూగ మనసులు (1963)లో రాధ
  53.     కర్ణలో (1963) భానుమతి
  54.     కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
  55.     ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
  56.     చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
  57.     నర్తనశాల (1963)లో ద్రౌపది
  58.     వెలుగునీడలు (1964)లో సుగుణ
  59.     పూజాఫలం (1964)లో సీత
  60.     నవరాత్రి (1964)
  61.     కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
  62.     గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
  63.     డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
  64.     దేవత (1964)
  65.     సుమంగళి (1965)
  66.     తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
  67.     నాదీ ఆడజన్మే (1965)
  68.     మనుషులు మమతలు (1965)
  69.     నవరాత్రి (1966)
  70.     భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
  71.     ప్రాణమిత్రులు (1967)
  72.     వరకట్నం (1968)
  73.     తల్లితండ్రులు (1970)లో కౌసల్య
  74.     మరోప్రపంచం (1970)
  75.     అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
  76.     జగన్మోహిని (1978)
  77.     అందరికంటే మొనగాడు (1985)
  78.     దేవదాసు మళ్లీ పుట్టాడు
  79.     గోరింటాకు (చివరి సినిమా)

నిర్మాతగా
 

  1.     ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)

దర్శకురాలిగా
 

  1.     చిన్నారి పాపలు (1968)
  2.     కుళందై ఉళ్ళం (1969) ... తమిళ చిత్రం
  3.     మాతృదేవత (1969)
  4.     చిరంజీవి (1969)
  5.     వింత సంసారం (1971)
  6.     ప్రాప్తం (1971) ... తమిళ చిత్రం
     
మూలం / సేకరణ: 
sakshi