ప్రజా పాటల త్యాగయ్య "గరిమెళ్ళ సత్యనారాయణ"

గరిమెళ్ళ సత్యనారాయణ"మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.

 పరాయి పీడనకు, పాలనకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడి స్వేచ్ఛ, విముక్తి కోసం కలం పట్టి, గళమెత్తిన వీరసైనికుడాయన. 29 ఏళ్ళకే గేయాలు, రచనలు చేశారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో గరిమెళ్ళ గేయాలు బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ప్రజా హృదయంలోకి శరవేగంగా చొచ్చుకుపోయాయి. స్వరాజ్య గీతాలు, గేయాలు, వ్యాసాలు పదునైన ఛలోక్తులకు ఆయనకు ఆయనే సాటి.
 
తొలి జీవితం:
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా, గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ... విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు చదివారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు.  ఆ తరువాత... జాతీయోద్యమ స్ఫూర్తితో 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ "మా కొద్దీ తెల్లదొరతనం" పాటను రాశారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట.

ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి, గాంధీటోపి పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ "మాకొద్దీ తెల్లదొరతనం- దేవ, మాకొద్దీ తెల్లదొరతనం" అంటూ ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.  ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో, గాంధీజీ ఈ పాటకు అనువాదము చేయించమని పురమాయించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి "స్వరాజ్యం" పత్రికలో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించారు. N.G..రంగా, గరిమెళ్ళను "ప్రజా పాటల త్యాగయ్య" అని ప్రశంసించారు

గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. అయితే, ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఆయన మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడుతూ, ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగారు.

"మా కొద్దీ తెల్ల దొర తనము..." అనే స్వాతంత్ర్య గీతము దశ దిశలా మార్మ్రో గింది. G.T.H. బేకన్(1921) గరిమెళ్ళ చేత ఈ పాటను పాడించాడు. "భాష రాని నాకే ఇంత గగుర్పాటును కలిగించింది. స్వదేశీయులలో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో అర్ధమైంది" అంటూ ఆ పాటను నిషేధించాడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారికి రాజద్రోహం నేరం కింద ఏడాది కఠిన కారాగార శిక్షను విధించాడు.  

అది తెలుగు సాహిత్య చరిత్రలోనూ విస్మరించరాని రోజు. 1922 ఫిబ్రవరి 9న ఒక పాట వల్ల ఒక తెలుగు కవి కారాగారానికి వెళ్ళినరోజది! విచారణ పేరిట కొంతకాలం జైలులోనే ఉన్నారు. మళ్ళీ విచారణ 1922 జులై నెల చివరిలో జరిగి గరిమెళ్ళకు రెండేళ్లు శిక్ష విధించారు. అందుకు నిరసనగా గరిమెళ్ళ గళం నుంచి అద్భుత గేయం ఆశువుగా వెలువడింది. కూలిపోతున్నది 'కూలిపోతున్నది -మూల మట్టముతోటి కూలిపోతున్నది ప్రభుత్వం -కూకటివేళ్ళతో కూలిపోతున్నది పర ప్రభుత్వం' అని గరిమెళ్ళ అన్నారు. రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ మరొక గేయాన్ని వ్రాశారు. ''దండాలండోయ్‌ మేముండలేమండోయ్‌ బాబు సైతాను ప్రభుత్వాన్ని సాగనీయమండోయ్‌ బాబు'' అంటూ 113 చరణాల దీర్ఘగేయం సంతరించారు.

ఈయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసిన బ్రిటీష్ ప్రభుత్వం, ఇతను బయట ఉండటంకంటే.. జైల్లో ఉండటమే మంచిదని భావించి అరెస్టు చేసి, కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రెండు సంవత్సరాల జైలు శిక్షపడటంతో జైల్లో ఉండగా 1923లో ఆయన తండ్రి మరణించారు. అయితే గరిమెళ్ళ క్షమాపణ చెబితే, తండ్రిని చూసేందుకు వదిలిపెడతామని అన్నారట బ్రిటీష్ అధికారులు. అయితే దేశభక్తి జీర్ణించుకుపోయిన గరిమెళ్ళ క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు.  జైలునుంచి విడుదలయ్యాక చాలాచోట్ల ప్రజల సన్మానాలందుకున్న గరిమెళ్ళ, వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారు. భార్య మరణంతో రెండో వివాహం, అప్పులు, ఆస్తుల అమ్మకం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆపై ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేస్తూ, శ్రీ శారదా గ్రంథమాల స్థాపించి 18 పుస్తకాలు అచ్చు వేయించారు.

గరిమెళ్ళ సత్యనారాయణరచనలు:
1921లో గరిమెళ్ళ "స్వరాజ్య గీతములు" పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నా ఆయన తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో కూడా కొన్ని రచనలు చేశారు.  జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్న గరిమెళ్ళ , గృహలక్ష్మి పత్రిక సంపాదకుడిగా చేరారు కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా, వాహిని పత్రికలలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్రప్రభలో, ఆనందవాణిలో, మరికొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా జీవనం సాగించారు. ఆంధ్రప్రభ, ఆనందవాణి పత్రికల్లో ఆయన రచనలు తరచూ వస్తూండేవి. మద్రాస్‌ ఆకాశవాణి (ఆలిండియా రేడియో)లో కూడా ఆయన సాహిత్యం ప్రసారమవు తుండేది.

భారతదేశంలో వలస పాలకుల తీరును పరిపాలించడానికి బ్రిటిష్‌ యువరాజు వెల్స్‌ వచ్చినప్పుడు గరిమెళ్ళ 'ఏమయ్యా యువరాజా ఎందుకొచ్చావు', అంటూ దొరల దోపిడీ పాలనను తీవ్రంగా నిరసించే గేయాన్ని రాశాడు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలను శాశ్వతంగా హరించే పత్రికా ప్రభుత్వ ధిక్కారణ బిల్లులను, ప్రశ్నించే హక్కులను లేకుండా చేయాలని ప్రయత్నించిన పాలకుల తీరుపై పోరు సాగించిన యోధుడుగా గరిమెళ్ళ చరిత్రలో మిగిలిపోయారు.

స్వరాజ్య గీతాలే కాక 'అభ్యుదయ రాజ్యాంగ విధానం, జవహర్లు మతం, పూర్వపు బానిసత్వం నేటి ధన బానిసత్వం, ధర్మమేవ జయతే, మాణిక్యం విచికము విరుగుడు, పాత కాంగ్రెస్‌ వర్కర్లు లోక సేవకులు కావాలి, తెల్లవాడు తొలగందె పండగేమిటి మనకి? కాంగ్రెస్‌కు పట్టిన పిచ్చి ఆవేశం' మొదలైన వ్యాసాలు ఢంకా, ఆనందవాణి పత్రికల్లో రాశారు. గృహలక్ష్మి, త్రిలింగ పత్రిక, వాహిని, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో ఆయన పనిచేశారు. స్వగ్రామం ప్రియాగ్రహారంలో శారదా గ్రంథమాలను స్థాపించారు. భాష నేర్చుకొని ప్రసిద్ధ తమిళ రచన కురళ్‌ను తెనిగించారు. 'హర్ట్‌ ఆఫ్‌ ది నేషన్‌, మదర్‌ ఇండియా' మొదలైన ఇంగ్లీషు పద్యకావ్యాలను రచించారు. నాలడియార్‌ వంటి ప్రసిద్ధ తమిళ పద్యాలను తెనిగించారు. తళ్ళికోట మొదలైన కన్నడ నాటకాన్ని గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి సాహిత్యసేవ చేశారు. ఆయన వ్రాసిన హరిజనోద్యమ గీతాలు, స్వర్జాయపు గీతాలు తెలుగునాట ప్రతిధ్వనించాయి.

మా కొద్దీ తెల్లదొరతనము  దేవ
మా  ప్రాణాలపై పొంచి మానాలు హరియించె     ||మాకొద్దీ||

పన్నెండు దేశాలు పండుచున్నగాని
పట్టెడన్నము లోపమండి  ఉప్పు ముట్టుకుంటె దోషమండి

నోట మట్టి కొట్టి పోతాడండి
అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి   ||మాకొద్దీ||

చూడి యావుల కడుపు వేడివేడి మాంసం-వాడికి బహు ఇష్టమంట
మాదు పాడి పశువుల కోస్తాడంట, మా మతము
పాడుచేస్తాడంట
మా చూడియావుల మంద సురిగి ఇంటికిరాదు.   ||మాకొద్దీ||

చివరిదశ:
చివరిదశలో పేదరికం బారిన పడ్డ గరిమెళ్ళకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డారు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి.

ఒక కన్ను పోగొట్టుకుని, పక్షపాతం బారిన పడ్డ ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలం యాచన మీద కూడా బ్రతికారు. స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా ఆయనకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి గరిమెళ్ళ చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవిస్తూ... 1952 డిసెంబర్ 18వ తేదీన పరమపదించారు.

మూలం / సేకరణ: 
wikipedia