రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయిందిదుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసిందిఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయిందిపాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుందిఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది
మాధవపెద్ది సత్యం (1922 - 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
సత్యం గారు 1922, మార్చి 11న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామములో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య మరియు సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యంను తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు.
మాధవపెద్ది సత్యం గారు షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం గారు ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు "అయ్యయో జేబులో డబ్బులు పోయెనే..." మరియు మాయాబజార్ సినిమాలోని "వివాహ భోజనంబు...." ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం గారు ప్రధానంగా గాయకుడే.
ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు మరియు రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలొ ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.
75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.
ఆయనే కబీర్ పాత్రలో 1946 లో వచ్చిన ' రామదాసు ' తమిళ-హిందీ ద్విభాషా చిత్రంతో నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి గాయకుడిగా స్థిరపడి సుమారు మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షక శ్రోతలను అలరించిన మాధవపెద్ది సత్యం. ఆయన నటుడిగా స్థిరపడిపోతే మనం గర్వంగా చెప్పుకోగలిగే మంచి గాయకుడిని కోల్పోయేవాళ్ళమేమో ! ఆది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. పాత్ర స్వభావాన్ని, పాత్రధారుని సంభాషణా చాతుర్యాన్ని అంత చక్కగా స్వంతం చేసుకుని పాడే గాయకుడు బహుశాః మాధవపెద్ది సత్యం గారొక్కరేనేమో!
ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన కుమారుడు, కూచిపూడి నృత్య కోవిదుడు మాధవపెద్ది మూర్తి గారు తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం ' మాధవపెద్ది సత్యం అవార్డు మరియు మాధవపెద్ది ప్రభావతి అవార్డును ' నెలకొల్పారు. ఆ పురస్కారం అందుకొన్న వారిలో ఎం. ఎస్. విశ్వనాథన్, పి. బి. శ్రీనివాస్ లాంటి ప్రముఖులున్నారు.