‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు, కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలనూ సహించాలి. లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి’’
"నీ శక్తే నీ జీవితం... నీ బలహీనతే నీ మరణం..."
ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. ఆయన 1863 జనవరి 12న జన్మించారు. మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు. తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు. అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.
తన గురువు రామకృష్ణుడు నేర్పిన 'జీవుడే దేవుడు' అనేది వివేకానందుని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.
ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు... విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.