హిమాచల్‌ప్రదేశ్‌ లో కాంగ్రెస్ విజయం

తేది : 
Thursday, December 20, 2012
<p>హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠానికి చేరువయ్యింది. మొత్తం 68 స్థానాల్లో 36 స్థానాలను కైవసం చేసుకుంది. 26 స్థానాలకే పరిమితమైన భాజపా.. ఓటమి పాలవడం కమలనాధులను నిరాశపరిచింది. భాజపా ఆవిర్భావం నుంచి బలంగా వున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్‌ ఒకటి. ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ విజయావకాశాలకు గండికొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీరభద్రసింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు తమ విజయావకాశాలను మెరుగుపరుస్తాయని భాజపా నేతలు భావించారు. అయితే రాష్ట్రంలో.. కేంద్ర మాజీ మంత్రి శాంతకుమార్‌, ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ల వర్గాలుగా భాజపా విడిపోయింది. దీంతో ఇరు వర్గాలు పూర్తిస్థాయి ప్రచారం నిర్వహించలేకపోయాయి. దేశంలో ఆపిల్‌పళ్లను ఎక్కువగా పండించే ఈ రాష్ట్రంలో రైతులకు సరైన మద్దతు ధర లభించేలా చూడకపోవడం కూడా రైతులను కాంగ్రెస్‌వైపు మళ్లించిందని చెప్పవచ్చు.</p>