దేవీ నవరాత్రులు

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి ? అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?

దేవీ నవరాత్రులుప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు.  శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది.  ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక  ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి : దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

3. చంద్రఘంట : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

4. కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

5. స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

6. కాత్యాయని : దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7. కాళరాత్రి : దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి : ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9. సిద్ధిధాత్రి : దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
 

నవరాత్రులు

  • 1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి - శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
  • 2వ రోజు - ఆశ్వయుజ విదియ - శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
  • 3వ రోజు - ఆశ్వయుజ తదియ - శ్రీ గాయత్రి దేవి
  • 4వ రోజు - ఆశ్వయుజ చవితి - శ్రీ అన్నపూర్ణా దేవి
  • 5వ రోజు - ఆశ్వయుజ పంచమి - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి - లలిథ పంచమి
  • 6వ రోజు - ఆశ్వయుజ షష్టి - శ్రీ మహా లక్ష్మీ దేవి - మహాషష్టి
  • 7వ రోజు - ఆశ్వయుజ సప్తమి - శ్రీ మహా సరస్వతీ దేవి - మహా సప్తమి
  • 8వ రోజు - ఆశ్వయుజ అష్టమి - శ్రీ దుర్గా దేవి - దుర్గాష్టమి
  • 9వ రోజు - ఆశ్వయుజ మహానవమి - శ్రీ మహిషాసురమర్దిని - మహార్ణవమి
  • 10వ రోజు - ఆశ్వయుజ దసమి - శ్రీ రాజరాజేశ్వరి - విజయదసమి

ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే 'దేవీనవరాత్రులు ' అని పిలవ బడుచున్నవి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.

పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను.

ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.

ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను.

ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదసమి నాడు వారి అగ్నాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాదు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబదుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.

అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం
అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి:
 

మధ్యే అపరాజితాయై నమః ఇత్యవరాజితామావాహ్య
తద్దక్షిణే క్రియా శ్క్యైనమః ఇతి జయాం నామతః
ఉమాయైనమః ఇతి విజయామా వాహ్మ అపరాజితా
యైనమః జయాయైనమః విజయాయై నమహ్