గారాబాల బిడ్డకు...

గారాబాల బిడ్డకు గడ్డపారతో చెవులు కుట్టి చెవులకు పారలు తగిలించినట్టు అన్నది జాతీయం. కొంతమంది తమ పిల్లల విషయంలో అతి గారాబాన్ని చూపిస్తూ వారికి మేలు చేయటానికి బదులు కీడు కలిగించే పనులు చేస్తుంటారు. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెవులు కుట్టటానికి సన్నటి సూదులను వాడటం, చెవులకు తగుమాత్రంగా ఉండే ఆభరణాలను పెట్టడం సర్వసాధారణంగా చేసే పని. కానీ ఓ తల్లి తన బిడ్డమీదున్న అతిగారాబంతో సన్న సూదులతో చెవులు కుట్టించటమేమిటి, నా స్థాయికి తగ్గట్టు పెద్ద గడ్డపారతో కుట్టించి పెద్ద పారలంత ఆభరణాలనే తగిలిస్తానందట. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించినా విమర్శనాత్మక ధోరణిలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net