తెగితే లింగడు రాయేనన్నట్లు

స్థానబలిమి కాని తన బలిమి కాదు అని అన్నాడు వేమన. తమతమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులవుతారన్నాడు బద్దెన. అట్లాంటిదే ఇది. ఎవరికైనా స్థానం తప్పినప్పుడు, వేరొక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు సర్వసాధారణంగా అక్కడి స్థానికులకు ఆ వచ్చిన వారి గొప్ప తెలియక తక్కువుగా చూస్తుంటారు. ఓ వ్యక్తి తన మెడలో నిత్యం ఓ శివలింగాన్ని కట్టుకొని తిరుగుతూ ఉండేవాడట. ఓ రోజున అది తెగి ఎక్కడో కింద పడిపోయింది. ఆ శివలింగం కట్టుకొన్నవాడి మెడలో ఉన్నంతసేపూ శివుడికి ప్రతీకగా గౌరవాన్ని అందుకొంది. అదే కిందపడి పోయినప్పుడు కిందపడిపోయిన చోట ఉన్న మామూలు రాళ్లలో ఓ మామూలు రాయిగానే మిగిలిపోయింది. ఈ భావన ఆధారంగానే స్థానం తప్పి వేరొక చోటుకు వెళ్లి గుర్తింపు లేకుండా ఉన్నవారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net