ఎండిన మోడుకు ఎర్రని పూలు తగిలించినట్టు..

అసంబద్ధమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఏ పనిచేసినా అతికినట్లుండాలని అంటారు. ఆ అతికింది సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపింపజేయటంలోనే నైపుణ్యం అంతా ఇమిడి ఉంటుంది. అలాగాక పని చేతకాకపోతే మాసికలు వేసినట్లు అతుకులు అతుకులుగా ఉంటుంది. అలా ఉండటం చూడటానికి బాగుండదని, ఆ పని అసంబద్ధంగా ఉంటుందని తెలియజెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. జీవంతో ఉన్న చెట్టు మీద పచ్చని ఆకుల నడుమ ఎర్రని పువ్వులను ఉంచితే ఒకవేళ ఆ చెట్టు పువ్వులు కాకపోయినా దూరం నుంచి చూసిన వారికి అవి ఆ చెట్టు పువ్వులే అన్న భావం కలుగుతుంది. అలాకాక జీవం కోల్పోయి ఎండిపోయిన మోడులా ఉన్న చెట్టుకు ఎర్రగా కళకళలాడుతుండే పువ్వులను అలంకరిస్తే అది చూడటానికి ఏ మాత్రమూ బాగుండదు. అలాగే తగిన విధంగా సందర్భశుద్ధితో ఎవరైనా పనిచేయాల్సి ఉంటుందని, అందుకు భిన్నంగా జరిగితే బాగుండదని తెలియజెప్పడం ఈ జాతీయం లక్ష్యం.

మూలం/సేకరణ: 
eenadu.net