వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..

కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవో కారణాలను చూపుతుంటారు. అలాంటి వారిని గురించి లేదా అటువంటి పరిస్థితులను గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఒక వ్యక్తికి అన్నం వండే పని అప్పగించారట. అన్నం వండుతానని ఒప్పుకొన్న మనిషి వంట అయిందా అని అడిగితే అయింది అని చెప్పాడు. తీరా ఏది అని అడిగినప్పుడు ఎండబెట్టిన వడ్లు సరిగా ఆరలేదని అందుకే వాటిని దంచలేదని, ఆ కారణం చేతనే కావాల్సిన బియ్యం రాలేదని వంట సమయానికి కాకపోవటానికి కారణం అదేనని తన తప్పేమీ లేదని చెప్పాడట. ఈ ఘటన ఆధారంగానే పని చెయ్యకుండా చేసామని చెప్పి తిరుగుతూ అడిగినప్పుడు వంకలు చెబుతున్నప్పుడు వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు అని అనడం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net