పండిట్‌ రవిశంకర్‌ కన్నుమూత

తేది : 
Wednesday, December 12, 2012

రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్‌ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది.
రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్‌ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు.
1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు.తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ అల్బమ్‌ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.