చెరువు ముందు చలివేంద్రం అన్నట్టు

నిరుపయోగమైన పని అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పూర్వం చెరువులు, బావులులాంటివి మంచినీరు తెచ్చుకోవటానికి స్థానాలుగా ఉండేవి. కావలసినవారు కావలసినంత నీరు చెరువులో నుంచి తెచ్చుకుంటుండేవారు. ఓ వ్యక్తి అలాంటి చెరువు ముందు ఒక చలివేంద్రాన్ని పెట్టాడట. అటువచ్చే వారు తన దగ్గర నీళ్లు తాగాలన్నది అతడి భావన. కానీ పక్కనే ఎంతో సులువుగా చెరువులోకి దిగి స్వేచ్ఛగా నీళ్లు తెచ్చుకొనే వీలున్నందువల్ల ఎవరూ చలివేంద్రం దగ్గరకు వెళ్లి నీళ్లు అడిగి తీసుకోవటం లేదట. ఇలా ఆ చలివేంద్రం పెట్టడం ఎంత వ్యర్థమైన పనో అదే తీరులో కొందరు సమయం సందర్భం లేని పనులను చేసి తమ దగ్గరకెవరూ రావటం లేదని తనకు నష్టం వస్తోందని బాధపడుతుంటారు. అలాంటి వారిని గురించి తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.