గడ్డపార తినేవాడికి...

గడ్డపార తినేవాడికి శొంఠి కషాయం ఏం పన్చేస్తుంది అన్నది జాతీయం. దుర్మార్గాలలోనూ, దురలవాట్లలోనూ మితిమీరిన వారికి కొద్దిపాటి శిక్షవల్ల ఏ ప్రయోజనమూ ఉండదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇనుముతో చేసిన గడ్డపారను నమిలి తినేవాడి జీర్ణశక్తి ఎలాంటిదో ఊహించవచ్చు. అలాంటి వాడికి ఎప్పుడైనా అజీర్ణం చేసినప్పుడు అందరికీ ఇచ్చినట్టుగా శొంఠి కషాయం ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది భావన. ఈ భావన ఆధారంగానే దుర్మార్గాలలో శక్తివంతులైన వారికి చిన్నచిన్న శిక్షలవల్ల ఉపయోగం ఉండదని తెలియచెప్పే ఈ జాతీయం వెలుగులోకి వచ్చింది. 'అవినీతి మార్గంలో ఎన్నో ఏళ్లుగా అక్రమార్జన చేస్తున్న వాడిని మందలించి వదిలేయటం చూస్తే గడ్డపార తినేవాడికి శొంఠి కషాయం ఏం పన్చేస్తుంది అన్నట్టుంది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.