చెప్పి చెప్పి...

'చెప్పి చెప్పి చెప్పుతో తన్నించుకో, మళ్లీ వచ్చి మాతో తన్నించుకో' అన్నది జాతీయం. ఓ మంచి విషయాన్ని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోని సందర్భంలో విసిగివేసారిన వారు ఉపయోగించే జాతీయమిది. ఇరుపక్షాల నడుమ రాజీ కుదర్చాలని ఓ వ్యక్తి తెగ ప్రయత్నం చేశాడట. అందులో ఓ పక్షం వారు అసలు మాట వినకపోగా అవమానించి పంపారట. పోనీ రెండోపక్షం వారైనా మాటవింటారేమోనని వారి దగ్గరకు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైందట. ఈ భావన ఆధారంగా ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. 'వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదర్చటం నావల్ల కాలేకపోయింది. చెప్పిచెప్పి చెప్పుతో తన్నించుకో, మళ్లీ వచ్చి మాతో తన్నించుకో అన్న చందంగా ఆ ఇద్దరి ప్రవర్తన ఉంది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.