జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అన్నట్టు

కోపంతో, కసితో దుర్మార్గులు అనుకొన్నవారిని, వారి సంతానాన్ని దూషించే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. జిల్లేడు చెట్టుకు జిల్లేడు పూలే పూయటం ప్రకృతిసిద్ధంగా సహజంగా జరిగే పని. జిల్లేడు పూలను మల్లెపువ్వుల్లాగా ఎవరూ అంతగా ప్రేమించరు. మల్లెపువ్వును స్వచ్ఛతకు మారుపేరుగా కూడా చెబుతుంటారు. జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా అనంటే అది జరిగేపని కాదు. ఈ జాతీయంలో జిల్లేళ్లను దుర్మార్గులుగా, మల్లెపువ్వులను మంచితనానికి ప్రతీకలుగా భావించటం కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఈ జాతీయం అవతరించింది. 'జిల్లేళ్లకు మల్లెలు పూస్తాయా చెప్పండి. వాళ్ల నాన్న కూడా దుర్మార్గ ప్రవర్తనతోనే ఉండేవాడు. అందుకే ఆ లక్షణాలన్నీ ఇతడికొచ్చాయి. మంచి లక్షణాలు ఎందుకొస్తాయి?' అనే లాంటి ప్రయోగాలున్నాయి.