వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు

'వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు' అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పూర్వకాలం పుణ్యం కోసం దేశంలోని ఎక్కడెక్కడో ఉన్న తీర్థక్షేత్రాలను అన్వేషించి అక్కడికి వెళ్లి తీర్థస్నానం చేసి వస్తూఉండేవారు. అలాంటి రోజులలో ఆవిర్భవించిన జాతీయం ఇది. ఓ వ్యక్తి ఒక తీర్థక్షేత్ర మహిమను గురించి విన్నాడట. ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నతంలోనే తన ఎదురుగా ఉన్నది తాను విన్న తీర్థమేనని తెలుసుకొని ఎంతో ఆనందించాడట. ఏ మాత్రం కష్టపడకుండా ఇలా తమకు కావల్సినవి తమ సమీపంలోనే ఉన్నాయని తెలుసుకొన్నప్పుడు లేదా తాము వెతుకున్నవారు తమకు ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. 'వెతకపోయిన తీర్థం ఎదురైనట్టు నీకోసం బయలుదేరుతుంటే నీవే ఎదురొచ్చావు సంతోషం' అనేలాంటి ప్రయోగాలున్నాయి.