కోడికి గజ్జెలు కడితే...

కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించదా అన్నది జాతీయం. కసువు కుప్పలను కుళ్లగించి పొట్టపోసుకోవటం కోడి జీవలక్షణం. ఒకాయన ఓ కోడిని ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడట. అలా తన పెంపుడుకోడి కసువు కుప్పలను కుళ్లగించటం ఆయనకు బాగాలేదనిపించింది. దాన్ని చక్కగా అలంకరించి కాళ్ళకు గజ్జెలు కడితే ఆ అలంకరణల చక్కదనాన్ని, గజ్జెల గొప్పదనాన్ని చూసుకొంటూ అసహ్యకరమైన కసువు కుప్పలకు కుళ్లగించకుండా ఉంటుందనుకొని ఆ కోడి కాళ్లకు గజ్జెలు కట్టాడట ఆ వ్యక్తి. కానీ కోడి తన సహజమైన జీవలక్షణాన్ని వదులుకోక కుప్పలను కుళ్లగిస్తూనే ఉందట. ఇదే తీరులో చెడు ప్రవర్తన బాగా అలవాటుపడ్డవారు ఎన్ని మంచి బుద్ధులు చెప్పినా తమ బుద్ధిని మార్చుకోరు అని పెద్దలు చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.