కోకలు వెయ్యి ఉన్నా కట్టుకొనేది ఒకటే

కొంతమంది తామెంతో భాగ్యవంతులమని విర్రవీగుతుంటారు. అలాంటివారి గర్వాన్ని నిరసిస్తూ చెప్పే జాతీయం ఇది. జాతీయాలు వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపి సంఘటనలను సందర్భాలను సమీక్షిస్తూ విమర్శిస్తుంటాయనటానికి ఇదొక ఉదాహరణ. పెట్టెనిండా కోకలున్నాయని ఒకామె తెగ గర్వపడసాగిందట. అన్ని కోకలుంటే అన్నిటినీ ఒకేసారి కట్టుకో చూద్దామని ఎదుటివారు అన్నారట. అది సాధ్యమయ్యే పనికాదు. అలాగే ఎన్ని సంపదలున్నా పొట్టపట్టినంత వరకు మాత్రమే ఎవరైనా తినగలరు. అవకాశం ఉన్నంతవరకు మాత్రమే ఎవరైనా ఏపనైనా చేయగలరు అనే విషయాన్ని తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.