ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే అన్నట్టు అన్నది జాతీయం. కొన్ని జీవన సత్యాలు ఇలా జాతీయాలుగా అవతరించాయి. వైరాగ్య సంబంధమైన భావనలను ప్రకటించేటప్పుడు ఇలాంటి జాతీయాలను వాడుతుంటారు. పంట ఎంత గొప్పగా పండినా, ఎంత ఎక్కువగా పండినా దాన్ని అలా కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే. అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన ఈ జాతీయంలో కనిపిస్తుంది.