ఎంత కరవొచ్చినా పులి గడ్డి మేయదన్నట్టు

పులి క్రూరజంతువే అయినా రాజసం, నీతినిజాయతీల లాంటివాటికి ప్రతీకగా చెప్పుకోవటం అలవాటుగా వస్తోంది. ఆయన పులి లాంటివాడు అనంటే క్రూరస్వభావం కన్నా గాంభీర్యం ఎక్కువగా ఉన్నవాడు అనే అర్థమే స్ఫురిస్తుంది. కరవు వచ్చిన సందర్భాల్లో మిగతా ప్రాణులైతే ఏ గడ్డి అయినా తిని సరిపెట్టుకుంటాయి. కానీ పులి మాత్రం అలాకాదు. అది వేటాడి మాంసాన్నే తింటుంది కానీ గడ్డిని తినదు. గడ్డితినటం, గడ్డికరవటం అనే మాటలు అవినీతి, అక్రమాలకు పాల్పడటమనే అర్థాల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. నీతిమంతుడిని పులి లాంటివాడు అని అనుకొంటే అతడు ఎంత కరవుకాలం, కష్టకాలం వచ్చినా అవినీతికి మాత్రం పాల్పడడని, నీతినిజాయతీలతోనే ఉంటాడని చెప్పాల్సివచ్చిన సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.