దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన: “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి!”

తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది
ప్రకృతి ప్రేమలోనూ, దేశప్రేమలోనూ ఆయన భావుకత్వం ఎంత స్వేచ్ఛగా, హృదయంగమంగా పరవళ్లు తొక్కేదో చూడాలంటే ఆయన రాసిన దేశభక్తి గీతం తప్పక వినాలి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి!
జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి  //జయ జయ//

(మాకు ప్రియమైన భారతమాతా, దేవభూమీ, నీకు జయమగు గాక ! లక్షలాది స్త్రీపురుషుల హృదయాలకు కనులవంటి దానా, నీకు జయమగు గాక !)
 

జయ జయ సస్యామల సుశ్యామచలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా [[ జయ జయ ]]

(శ్యామలవర్ణా, కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు గల దానా, నీకు జయమగు గాక ! వసంతకాలములో విరిసిన పూలను తురిమిన అందమైన వెండ్రుకలు గల దానా నీకు జయమగు గాక ! (నా మనసునందలి అభిలాషల ఎర్రని లత్తుకతో అలంకరించబడిన పాదములు గలదానా నీకు జయము !)

జయ దిశాంత గతశకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా [[ జయ జయ ]]

 

{దిశాంతములకు వెళ్ళిన పక్షుల అమరగానముతో తృప్తి బొందిన దానా, జయము! గాయకుల, కవుల కంఠములలో వెలువడు పాటలలో విహరించుదానా, జయము ! నా మధురగానముతో ముద్దుపెట్టబాదిన చుంబించిన } అందమైన చరణము గల దాన, (ఇక్కడ పాట చరణము, తల్లి పాదాలు రెంటికి వర్తిస్తుంది) నీకు జయమగు గాక !