గురజాడ అప్పారావు గారి రచన “దేశమును ప్రేమించుమన్నా”

గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌

పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌

ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి

వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి

పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్

పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్

దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్

ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్