ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్ షా దీనిని నిర్మించాడు. కుతుబ్ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది.
భౌగోళిక పరిస్థితులు
దక్కన్ పీఠభూమిలో సముద్ర మట్టానికి 536 మీటర్లు(1607 అడుగుల) ఎత్తులో హైదరాబాద్ నగరం ఉంది. ఎక్కువ శాతం రాతి నేలలే. నగర శివారు ప్రాంతాల్లో వ్యవసాయం ఉంది. మూసీనది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. నగరంలో చాలా భాగం నదికి ఉత్తర భాగంలో కేంద్రీకృతమై ఉంది. హుస్సేన్‌సాగర్‌కు దక్షిణ భాగంలో ఎక్కువ ప్రభుత్వ భవనాలు, కట్టడాలు వెలిశాయి.
వాతావరణం
నగరంలో అరుదైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పొడి, వేడి వాతావరణం ఉంటూ... ఉదయం, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏడాదికి సగటు వర్షపాతం 32 సెంటీమీటర్లు. గరిష్ఠ ఉష్ణోగ్రత 45.5 సెంటిగ్రేడ్(జూన్ 2, 1966). కనిష్ఠ ఉష్ణోగ్రత 6.1 సెంటిగ్రేడ్(జనవరి 8,1946). మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 28 నుంచి 40 సెంట్రిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది.
మతాలు...
80 శాతం హిందువులే. మరో 16.84 శాతం ముస్లిం, 2.13 శాతం క్రిస్టియన్లు, మిగిలిన ఒకశాతం సిక్కులు, బౌద్ధులు, జైన్లు ఇక్కడ నివశిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని మతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. నగరం ఒక మినీ భారతంగా వర్థిల్లితోంది.
భాషలు...
ప్రధాన భాషలు... తెలుగు, హిందీ, ఉర్దూ. గుజరాతీ, మరాఠీ, కన్నడ మాట్లాడే వారు కూడా ఉన్నారు.
2007లో నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా అవతరించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపారు. శివార్లలోని 12 మున్సిపాలిటీలను హైదరాబాద్‌లో కలిపి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్‌ను 150 డివిజన్లగా విభజించారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో కార్పొరేటర్ ఉంటారు. వీరిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మేయర్‌ను మాత్రం పరోక్ష పద్ధతిలో ఎంపిక చేస్తారు. హైదరాబాద్ మున్సిపల్ అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అయిదు జిల్లాల పరిధిలో 54 మండలాల్లో 6,300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కేవలం హైదరాబాద్ జిల్లాలో అయితే 16 రెవెన్యూ మండలాలు ఉన్నాయి..
గ్రేటర్ ముఖచిత్రం
గ్రేటర్‌లో మొత్తం ఐదు జోన్లు ఉన్నాయి. వాటిని 18 సర్కిళ్లు... 150 డివిజన్లు కింద విభజించారు. సౌత్‌జోన్‌లో మూడు సర్కిళ్లు 37 డివిజన్లు, ఈస్ట్‌జోన్‌లో మూడు సర్కిళ్లు 16 డివిజన్లు, నార్త్‌జోన్‌లో నాలుగు సర్కిళ్లు, 16 డివిజన్లు, వెస్ట్‌జోన్‌లో నాలుగు సర్కిళ్లు 31 డివిజన్లు, సెంట్రల్ జోన్‌లో నాలుగు సర్కిళ్లు 50 జోన్లను కేటాయించారు. ఒక్కో డివిజన్‌లో సుమారుగా 37 వేల మంది జనాభా ఉంది.
శివారు మున్సిపాలిటీలు
హైదరాబాద్ కార్పొరేషన్‌లో 12 శివారు మున్సిపాలిటీలు కలిపి గ్రేటర్‌గా మార్చారు. శివారు మున్సిపాలిటీల వివరాలు
రాజేంద్రనగర్, గడ్డిఅన్నారం, ఎల్బీనగర్, ఉప్పల్, కాప్రా, మల్కాజిగిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్,కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్‌చెరు
నగరంలో సర్కిళ్లు-మండలాలు:
* సర్కిల్1- బండ్లగూడ, చార్మినార్, సైదాబాద్, అంబర్‌పేట
* సర్కిల్2- బండ్లగూడ, బహుదూర్‌పురా
* సర్కిల్3- నాంపల్లి, హిమాయత్‌నగర్,అంబర్‌పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్
* సర్కిల్4- షేక్‌పేట, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, నాంపల్లి(కొంతభాగం)
* సర్కిల్5- షేక్‌పేట, ఖైరతాబాద్, అమీర్‌పేట
* సర్కిల్6- నాంపల్లి(కొంతభాగం)
* సర్కిల్7- సికింద్రాబాద్, ముషీరాబాద్, మారేడుపల్లి, బాలానగర్(రంగారెడ్డి)
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 74 లక్షల మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి 32 లక్షలు, మెదక్ జిల్లా నుంచి 1.16 లక్షల జనాభా గ్రేటర్‌లో కలిసింది. నగరలో ప్రతి వేయి మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. హైదరాబాద్ జిల్లా జనాభా 40,10,238 మంది. వీరిలో పురుషులు 20,64,359. మహిళలు 19,45,879. హైదరాబాద్‌లో అక్షరాస్యత శాతం 78.42.
ఆర్థికం
హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక, ఐటీ రంగాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు పన్నులు, ఎక్సైజ్ ద్వారా నగరానికి ఆదాయం సమకూరుతుంది. మేలిమైన ముత్యాలకు భాగ్యనగరం పెట్టింది పేరు. ప్రత్యేకంగా గాజుల కోసం చార్మినార్ వద్ద లాడ్‌బజార్ పేరుతో ఒక మార్కెట్ వెలిసింది. ఫార్మా, బయోటిక్ రంగాలకు కూడా నగరం ప్రసిద్ధిగాంచింది. డా.రెడ్డీస్ ల్యాబ్‌రేటరీ, ఎజిలెంట్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, శాంతా బయోటిక్స్, భారత్ బయోటిక్, జీవీకె బయో, మాట్రిక్స్ లేబరేటరీ, అస్ట్రాజెనికా, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, మార్కో, విమ్టా ల్యాబ్ తదితర ఎన్నో ప్రముఖ కంపెనీలు ఇక్కడ కొలువు దీరాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా రోజుకు రోజుకు విస్తరిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మాల్స్ కూడా ఇక్కడ తమ అవుట్‌లెట్‌లు ప్రారంభించాయి.
సంస్కృతులు...
నగరంలో హిందూముస్లిం మిశ్రమ సంస్కృతి కన్పిస్తుంది. ఉత్తర, దక్షిణ భారతదేశాల్లోని సంస్కృతులు, కళలు, సంప్రదాయాలు ఇక్కడ అబ్బురపరుస్తాయి. ఎవరి సంస్కృతికి తగ్గట్టు వారి వస్త్రధారణ ఉంటుంది. సంప్రదాయ దుస్తులతోపాటు ఇతర ష్యాషన్లకు నగరం పెట్టింది పేరు.
జిల్లాలో మండలాలు: 16
1.అమీర్‌పేట 2. తిరుమలగిరి 3. మారేడుపల్లి 4. అంబర్‌పేట 5. హిమాయత్‌నగర్ 6.నాంపల్లి 7. షేక్‌పేట 8. ఖైరతాబాద్ 9.ఆసిఫ్‌నగర్ 10. సైదాబాద్ 11.బహుదూర్‌పురా 12.బండ్లగూడ 13.సికింద్రాబాద్ 14. ముషీరాబాద్ 15.గోల్కొండ 16. చార్మినార్
ఉజ్వల చరితం... ఉత్తేజ భరితం
చర్వితచరణమైనా చరిత్ర అది ఎప్పటికీ శ్రవణానందకరమే. వేల గొంతులతో వీనులవిందుచేసిన రాగాల దర్బారు కూడా ఒకనాటికి వానకారు కోయిలలా మూగబోవచ్చు. కాని బూజుపట్టిన మూగ దర్బారులోనే రాలి పడిన మువ్వ ఒకటి నాటి ఘనమైన జ్ఞాపకాలను ఏర్చికూర్చి పాటలా వినిపిస్తుంటుంది. ఆ పాట వేల రాగాలకు స్వాగతగీతం పాడుతుంది. నేటి తరాన్ని వెన్నంటి ప్రొత్సహిస్తుంది. ఇలాంటి ఘనచరిత గురుతులున్న భాగ్యనగరం నేడు సైబర్ సొబగులతో, డిజిటల్ మోతలతో ఆధునికతతో అలరారుతున్నంత మాత్రాన 'గతం గతః' అనుకుంటే పొరపాటే. మధురస్మృతులు ఒడిన దాచుకుని వడివడిగా పరుగెత్తిన మూసీ నేడు మురికినీటితో మూగబోయింది. అయినా మనసుండాలేకాని ఆ తీరంలో సాగిన నాగరికత జాడలు... ఎందరో నవాబుల, షరాబుల ప్రణయగాధలు... ఇంకెందరో గరీబుల గాయాల గుండెచప్పుళ్లు... మనకిప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. 'కారే రాజులు రాజ్యముల్ గల్గవే, వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే...' అంటారు పోతనామాత్యులు. అలా రాజ్యాలు, రాజులు పోయినా ఈ సుందరనగరపు సుమధుర కథనాలు మాత్రం మనను విడిచిపోలేదు. మతంకన్నా మమతలు మిన్నని మనసుపడి ఓ నేలమగువలను మనువాడిన నవాబులు ఆనాడే అందరూ ఒక్కటేనని నిరూపించారు. ఆ ప్రేమకథలకు గురుతుగా ఈ భాగ్యనగరాన్ని బహుమతిగా మిగిల్చారు. నగరానికే ఓ అందమైన నగగా చార్‌మినార్‌ను నిలబెట్టారు. ముంగిళ్లలో ముత్యాలు రాశులుగా పోసి అమ్మిన ఈ నగరంలో నేడు 'మంచినీరు' కూడా వెలకట్టే విలువైన వస్తువుగా పరిణమించింది. అణువణువు 'ప్రియం'గా మురుతున్నా, ఎందరికో ప్రియమైన ప్రదేశంగానే మారుతోంది. ఎందరో చరిత్రపురుషులు అడుగుజాడల్లో ఈ నగరం తరించిపోయింది. ఈ మట్టివాసనలో ఆనాటి చరిత్ర జ్ఞాపకాలెన్నో పరిమళిస్తాయి. ప్రపంచాన్నే అబ్బురపరిచే విభిన్న సంస్కృతుల సమ్మిశ్రమమం ఒకవైపు, పడుగుపేకల్లా అల్లుకుపోయిన భిన్న సంస్కృతులు మరోవైపు ఈ భాగ్యనగరపు ఉనికికి నిరంతరం నీరాజనాలై వెలుగుతున్నాయి. ఇంతటి మహత్తర గతాన్ని గురుతు చేసుకోవడం మన విద్యుక్త ధర్మం. ఎన్నో సంప్రదాయాల సంగమంగా ఎందరో పాలకులకు ఆలవాలమైన ఈ నగరం ఓ దశాబ్దం తర్వాత, ప్రజాస్వామ్య సౌరభాలను గుబాళించే కీలక ఎన్నికలవైపు అడుగులేస్తోంది. ఈ విలువైన తరుణంలో నగరం నలుమూలలా మూగసాక్ష్యాలుగా మిగిలిన శిథిలాల్ని, చరిత్రపుటల్లో దాగిన ముత్యాలను తడిమిచూసే ప్రయత్నమిది. ఇంతటి ఘనచరితం నగరపౌరులుగా మనకు గర్వకారణంగా నిలవడంతోపాటు ఈ నగర పరిరక్షణకు, సముజ్వల భవితకు పాటుపడే పాలకులెంతటి ఘనతరులు కావాలో ఆలోచించుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఓ ఐదువందల ఏళ్లక్రితంనాటికి... ఈ నగరానికి పునాదులింకా పడనంత వెనక్కి... చరిత్రలోకి తొంగిచూస్తే ఇక్కడేం ఉండేది? అక్కడినుంచి ఒక్కో నీటి పాయనూ కలుపుకొంటూ సువిశాల నదీమతల్లిగా ఎదిగిన ఈ భాగ్యనగర సమున్నత చరితను లీలామాత్రంగా తడిమిచూసే ప్రయత్నమిది...
దేశవిదేశాల్లో తన కీర్తిచంద్రికలను వ్యాపితం చేసుకుంటున్న మన 'భాగ్య' నగరం చరిత్ర క్రీస్తు పూర్వమే ప్రారంభమయిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇది నిజం... ఎందరో వీరులను, శూరులను, కన్న ఈ గడ్డ, ఎన్నో కళలకు, సంస్కృతులకు నిలయం ఈనేల. హైదరాబాద్ నగరానికి 1591లో పునాది పడినప్పటికీ అంతకు పూర్వమే అతి ప్రాచీన కాలంనుంచి కూడా ఈ నగర పరిసర ప్రాంతాలలో జనావాసాలు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి. హస్మత్‌పేట, బేగంపేట, గచ్చిబౌలి, మౌలాలి, బోయినపల్లి, లింగంపల్లి, కూకట్‌పల్లి, గగన్‌పహాడ్, ఉప్పల్, గుర్రంగూడ, మీర్‌ఆలం టాంక్, వంటి స్థలాలలో క్రీస్తుకు పూర్వం 3000-1000సంవత్సరాల మధ్య ఆదిమవాసులు నివసించినట్లు రుజువుచేస్తున్నాయి. వీటన్నిటిలోకి హస్మత్‌పేటలో లభించిన అవశేషాలు మిగతా వాటికంటే ప్రాచీనమైనవని చెప్పవచ్చు. పురావస్తుశాఖ వారు 1934లో మరోసారి ఇక్కడ తవ్వకాలు జరపగా సమాధులలో మానవ శల్యాలు, తదితర వస్తువులు బయటపడ్డాయి. కానీ పాత్రలు కానరాలేదు. దీనిని బట్టి మానవుడు పాత్రలు తయారుచేసే యుగానికి పూర్వమే ఇక్కడ ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. అదే విధంగా బిర్లా పురావస్తుశాలకు చెందిన శాస్త్రజ్ఞులు మౌలాలిలో జరిపిన తవ్వకాలలో కూడా విలువైన సామాగ్రి లభించింది. గచ్చిబౌలిలోని కేంద్ర విశ్వవిద్యాలయం ఆవరణలో బయల్పడిన అవశేషాలు కూడా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల ప్రాచీనతను చాటిచెబుతాయి.
ఇక చారిత్రక యుగానికి వస్తే హైదరాబాద్ నగరానికి కొద్ది దూరంలోనే ఉన్న కొండపూర్ వంటి గ్రామాలలో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి ఈ ప్రాంతమంతా తొలుత మౌర్యుల పాలనలోనూ ఆ తర్వాత ఆంధ్ర శాతవాహనుల పాలనలోను ఉన్నట్లు తెలుస్తోంది. శాతవాహన సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఆంధ్రదేశంలో అత్యంత విస్తృతమైన ప్రాంతాలను పరిపాలించిన విష్ణుకుండినులకు హైదరాబాద్ నగర శివారులలో గల కీసరగుట్ట కొంతకాలం రాజధానిగా ఉంది. నగరానికి చెందిన చైతన్యపురిలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద బయల్పడిన శిలాశాసనాన్ని బట్టి ఆ స్థలం విష్ణుకుండినుల కాలంలో బౌద్ధారామంగా ఉండేదని తెలుస్తోంది. విష్ణుకుండినుల తర్వాత బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాష్ట్రకూటుల, కళ్యాణీ చాళుక్యుల శాసనాలు గండిపేట సమీపంలోని చిలుకూరులో లభించాయి. కళ్యాణీ చాళుక్యుల తర్వాత ఆంధ్రదేశాన్ని కాకతీయులు పరిపాలించారు. వీరి రాజధాని ఓరుగల్లు(వరంగల్లు). తెలుగుజాతి నివసించే ప్రాంతాలన్నిటినీ సమైక్యపరిచిన ఘనత వీరికే దక్కుతుంది. ఈ వంశరాజులలో 1116నుంచి 1157వరకు పాలించిన రెండో ప్రోలరాజు కుమారుడూ, యువరాజు అయిన రుద్రదేవుడు నల్లగొండ జిల్లాలోని రాయఘర్, భువనగిరి ప్రాంతాలనేగాక హైదరాబాద్ ప్రాంతాలను కూడా రాజప్రతినిధిగా పరిపాలించినట్లు తెలుస్తోంది. కర్మాన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయ చరిత్రననుసరించి దానిని 1143లో ప్రాంతంలో రుద్రదేవుడే నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖపాత్ర వహించిన గోల్కొండ దుర్గాన్ని కూడా తొలుత ఆయనే నిర్మించడం స్థానిక గాథల వివరిస్తున్నాయి. గొల్లలు (యాదవులు) ఆ కొండపై ఆ కాలంలో నివసించేవారని అందుచేతనే దానికి గొల్లకొండ అని పేరు వచ్చిందని అదే ఆ తర్వాత గోల్కొండగా జనశృతిలోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దేవగిరి రాజుల దండయాత్రలను నిరోధించడానికే రుద్రదేవుడు ఇక్కడ దుర్గం నిర్మించి ఉంటాడు. కర్మాన్‌ఘాట్ దేవాలయాన్ని, గోల్కొండ కోటను నిర్మించిన ఆయన ఈ నగర ప్రాంతంలో కొంత కాలం నివసించాడని విశ్వసించడానికి వీలుంది. ఆ కాలంలో గోల్కొండ గల గ్రామం పేరు మానుగల్లు. కాకతీయ సామ్రాజ్యాన్ని మహమ్మద్ బీన్ తుగ్లక్ 1323లో అంతం చేసి ఆంధ్రదేశంపై ఢిల్లీ సుల్తానుల పాలనను నెలకొల్పాడు. కాని ఆయన కింద పనిచేసిన అల్లాఉద్దీన్ హసన్ బహమనీ అనే అధికారి తిరుగుబాటు జరిపి దౌలాతాబాద్ రాజధానిగా 1347లో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాకతీయుల పతనానంతరం ముసునూరి వంశస్తులైన ప్రోలయ, కాపయ, నాయకులు ఆంధ్రదేశాన్ని ఢిల్లీ పాలన నుంచి విముక్తి చేశారు. బీదర్ నుంచి బంగాళాఖాతం వరకు గల ప్రాంతం వారి ఆధీనంలోకి వచ్చింది. దక్షిణదిశగా తమ ప్రాంతాలను విస్తరింపజెయ్యాలనే తలంపుగల బహమనీ సుల్తానులకు, ముసునూరి నాయకులకు మధ్య ఘర్షణ తప్పలేదు. బహమనీ దండయాత్రలను తట్టుకొనేందుకు కాపయనాయకుడు గోల్కొండ దుర్గాన్ని మరింత పటిష్టం చేశాడు.
కుతుబ్‌షాహీల చరిత్ర
బహమనీ సుల్తానులలో రెండోవాడైన మహమ్మద్ షా (1358-75) గోల్కొండ దుర్గాన్ని ఆక్రమించగలిగాడు. క్రమ క్రమంగా బహమనీ సామ్రాజ్యం తెలంగాణా ప్రాంతాలకేకాక, కోస్తాఆంధ్ర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆ సామ్రాజ్యాన్ని 1482 నుంచి 1518 వరకు పరిపాలించిన మహమూద్ షా బహమనీ 1496లో ''కులీకుతుబ్-ఉల్-ముల్క్'' అనే అనుచరుని తెలంగాణా ప్రాంతానికి గవర్నర్‌గా నియమించాడు. కులీకుతుబ్ గోల్కొండను కేంద్రంగా చేసుకొని తన ఆదీనంలో ఉన్న ప్రాంతాలను పరిపాలించాడు. మహమూద్ షా బహమనీ మరణానంతరం బహమనీ సామ్రాజ్యం బలహీనపడి నామమాత్రమైంది. ఇదే అదనుగా తీసుకొని అహమ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజపూర్ రాష్ట్రాల పాలకులు స్వతంత్రులయ్యారు. ఈ తరుణంలోనే కులీకుతుబ్ 1518లో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించి గోల్కొండ సామ్రాజ్యానికి మూలపురుషుడయ్యాడు
కులీకుతుబ్ షా గోల్కొండకోటను మరమ్మతు చేయించి దానిలోనే రాజభవనాలను నిర్మించాడు. తనను తెలంగాణాకు తరఫ్‌దార్‌గా నియమించిన మహమూద్ బహమనీషా పేరుమీదుగా మానగల్లు పట్టణ పేరును 'మహమూద్ నగర్' గా మార్చాడు. (ఇది ఇప్పుడు అహ్మద్‌నగర్‌గా వాడుకలో వచ్చింది). ఆయన తెలంగాణా ప్రాంతాన్నంతనూ జయించడమేకాక కోస్తా ప్రాంతంలోని కొండపల్లి, ఏలూరు దుర్గాలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఆయన పేరుమీదగానే ఆయన వంశానికి 'కుతుబ్‌షాహి' వంశమని పేరు వచ్చింది. 1543లో కులీకుతుబ్‌ను ఆయన కుమారుడైన జంషీర్ హత్య చేసి అధికారం చేబట్టాడు. ఆయన చర్యను నిరసించిన సోదరుడు ఇబ్రహీం రాజ్యాన్ని వదలి హంపీ విజయనగరంలో అళియరామరాయలిచ్చిన ఆశ్రయంలో ఏడు సంత్సరాలపాటు జీవింవచవలసి వచ్చింది. ఈ తరుణంలోనే ఆయన భగీరథీబాయ్ అనే హిందూ వనితను వివాహం చేసుకున్నాడు. 1550లో జంషీర్ మరణించిన తర్వాత జగదేవ్‌రావ్ వంటి ప్రముఖ సర్కారుల సహాయంతో ఇబ్రహీం కుతుబ్‌షా గోల్కొండ సామ్రాజ్యాధిపతి కాగలిగాడు
ఇబ్రహీం కుతుబ్‌షా (1550-80) తొలుత జంషీర్ అనుకూలవర్గాలు జరిపిన తిరుగుబాట్లను అణచివేశాడు. ఆ తర్వాత రాజమండ్రి దుర్గాన్ని కూడా ఆక్రమించి తూర్పు గోదావరి జిల్లా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అళియరామరాయలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించినా ఆ తర్వాత దక్షిణ తెలంగాణా ప్రాంతాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపిన ఫలితంగా అహమ్మద్‌నగర్, బీజపూర్, బీరార్ సుల్తానులతో కలసి 1565 సంవత్సరంలో జరిగిన 'రాక్షసి-తంగడి'యుద్ధంలో పాల్గొని రామరాయలను ఓడించడంలో తన వంతు పాత్ర తాను పోషించాడు.
హుస్సేన్‌సాగర్ నిర్మించిన ఇబ్రహీం
ఇబ్రహీం గొప్ప నిర్మాత. ఆయన హుస్సేన్ సాగర్‌ను నిర్మింపజేసి ఆ ప్రాంత ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు 2500 అడుగుల పొడుగు కల అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీనికి ఆ రోజులలోనే రెండున్నర లక్షల రూపాయల ఖర్చు చేశారు. ఇది పట్టణ ప్రజలకు మంచి నీరు అందివ్వడమే కాక ఇక్కడి వాతావరణాన్నే చల్లబరచింది. నేటి ప్రమాణాలతో పోల్చి చూస్తే దీనిని గొప్ప ఇంజనీరింగ్ ఘనకార్యంగానే భావించాలి. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీంసాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో నమోదు అయింది. కాని దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలుపర్చడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌షా వలి పేరుమీదగానే ప్రజలు దీనిని హుస్సేన్‌సాగర్ అని పిలిచేవారు. క్రమంగా అదే నిలిచింది. హుస్సేన్‌షా వలి గొప్ప ఇంజనీరే కాక సుఫీ యోగి. ఇబ్రహీంకు బావమరది. ఆయన దర్గా ఇప్పటికి గోల్కొండ ప్రాంతంలో పాతముంబాయ్ రహదారిపై ఉంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం సుల్తాన్ ఇబ్రహీం పేరుమీద వెలసిందే. ఆ పట్టణంలో ఉన్న సరస్సు కూడా ఆయన నిర్మించిందే. ఇబ్రహీం గోల్కొండ కోటకు రెండు ప్రాకారాలను కట్టించి దాన్ని దుర్భేద్యం చేశాడు. లింగంపల్లి భూములను సేరే భూములుగామార్చి వాటి సాగు ద్వారా కోటలోకి ఆహార పదార్ధాలు సరఫరా అయ్యే ఏర్పాటుచేశాడు. లింగంపల్లి చెరువును విస్తృతం చేసి దాని నుంచి గొట్టాల ద్వారా కోటలోకి నేరుగా సరఫరా అయ్యే వీలు కల్పించాడు. పర్షియన్ చక్రాలు, చేదల ద్వారా కింది అంతస్థు బావి నుంచి ఎగువ అంతస్తు బావికి నీరు అందేటట్లు, తద్వారా కోటలోని అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యేలా ఏర్పాటు చేశాడు. ఇది చాలా ప్రయాసతో కూడిన పని అయినందు వలన గోల్కొండ కోటకు అన్ని వేళల నీరు సమృద్ధిగా లభించేది కాదు. అందుచేతనే ఇబ్రహీం మూసీనదికి దక్షిణాన మరో నగరం నిర్మించి యుద్ధ భయం లేనప్పుడు ఆ నగరంలో నివసించాలని నిర్ణయించాడు. దీనికి ప్రాతిపదికగా మూసీనదిపై ఒక వంతెన నిర్మింపజేశాడు. దీనినే ప్రస్తుతం 'పురానాపూల్' అంటున్నారు. (తన కుమారుడైన మహమ్మద్ కులీకుతుబ్ చించలం గ్రామంలో నున్న భాగమతిని కలవడానికి వరదతో ఉన్న మూసీనదిని ఈదుకుంటూ వెళ్లడాన్ని గమనించిన ఇబ్రహీం వెంటనే ఆ నదిపై వంతెన నిర్మించడానికి పూనుకున్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది.) వాస్తవానికి మూసీనదికి దక్షిణంగా ఒక నగరాన్ని నిర్మించాలని నిర్ణయించి దానికవసరమైన పథకాలను తయారుచేయించింది ఇబ్రహీం కుతుబ్‌షాయే. అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో 'బాలా హిస్సార్' అనే పర్వత దుర్గం ఉంది. అది వాస్తుకళకు, చక్కటి వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. తామర్లేన్, బాబర్ వంటి పాలకులు అక్కడ నివసించడానికి ఆసక్తి చూపేవారు. గోల్కొండ కోట శిఖరాగ్రంలో అటువంటి బాలాహిసార్‌నే ఇబ్రహీం తీర్చిదిద్దాడు. ఆయన నిర్మించిన పురానాపూల్ పారిస్ నగరంలోని 'పోంటో న్యూఫు' (నూతన వంతెన)కు దీటైనదని రాశాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా మరణానంతరం ఆయన కుమారుడు మహమ్మద్ కులీకుతుబ్‌షా (1580-1611) అధికారంలోకి వచ్చాడు. ఈయన ఉత్తరాంధ్ర ప్రాంతాలను, రాయలసీమ ప్రాంతాలను జయించి కాకతీయుల తర్వాత మరొక మారు తెలుగు జాతిని సమైక్యం చేశాడు. తన సర్దారులను ఆయా ప్రాంతాలలో సామంతులుగా నియమించి తన పరిపాలనను సుస్థిరం చేశాడు. బొబ్బిలి, అనకాపల్లి , పిఠాపురం, పెద్దాపురం, మొగలితుర్రు, నూజివీడు మొదలైన సంస్థానాలు ఆ సందర్భంలో వెలిసినవే. ఆయన మొగల్ చక్రవర్తి అయిన అక్బర్‌కు సమకాలీనుడు. అక్బర్ ఉత్తర భారతదేశమంతా జయించి దక్కన్‌పై దృష్టి సారించాడు. అహ్మద్‌నగర్ పతనమైతే గోల్కొండ సామ్రాజ్యానికి కూడా ముప్పు తప్పదనే దృష్టితో మహమ్మద్ కులీకుతుబ్‌షా మొగలులకు వ్యతిరేకంగా పోరాడిన చాంద్‌బీబీ, మాలిక్ యాంబర్‌వలకు సహాయంగా సైన్యాలను పంపి అహమ్మద్‌నగర్ స్వతంత్రాన్ని పరిరక్షించడానికి కృషి చేశాడు. పర్షియా (ఇరాన్) చక్రవర్తి అయిన అబ్బాస్‌తో స్నేహసంబంధాలను కొనసాగించి ఆయన ద్వారా దక్కన్ ప్రాంతంపై దండయాత్రలు చేయకుండా మొగలులపై వత్తిడి తెచ్చేవాడు.
హైదరాబాద్ నగర నిర్మాణం మహమ్మద్ కులీకుతుబ్ చేపట్టిన కార్యాలన్నిటిలోకి అత్యంత చిరస్మరణీయమైనది తన తండ్రి రూపొందించిన పథకం ప్రకారం మూసీకి దక్షిణదిశగా ఈ నగరాన్ని నిర్మించడం. దీనికాయన 1591లో పునాది వేశాడు. హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి దీనికి ముహుర్తం పెట్టించాడని ప్రతీతి. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగింది. దీనికి ఇరాన్‌లోని సుప్రసిద్ధ నగరమైన 'ఇస్ఫహాన్' రూపకల్పనననుసరించి 'అలీం' అనే వాస్తుశిల్పి రూపకల్పన చేశాడని చరిత్రకారుల అభిప్రాయం. అందువల్లనే ఈ నగర నిర్మాణంలో సముచిత పాత్ర వహించిన మహమ్మద్ కులీకుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ మొమిన్ ఈ నగరాన్ని 'నూతన ఇస్ఫహాన్'గావర్ణించాడు.
ఉద్యానవనాల, ప్రాచీన కట్టడాల సమాహారం హైదరాబాద్
కుతుబ్‌షాహీలు షియా మతస్థులు. అందుకే నూతన నగరానికి కేంద్రమైన చార్‌మినార్‌ను షియా మతస్థుల ఎనిమిదో ఇమామ్ 'హజ్రత్ అలి రాజా' స్మారక సమాధి రూపంలో నిర్మించారు. ఇమామ్ హుస్సేనీ కర్బలా యుద్ధానికి తీసుకువెళ్లిన అలం (పతాకం) ప్రతిరూపం కూడా ఈ నిర్మాణంపై కనపడుతుంది. నగరంలో వ్యాపించిన ఒక జాడ్యాన్ని నివారించినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతూ మహమ్మద్ కులీకుతుబ్ షా చార్మినార్‌ను నిర్మించాడనే గాథ వాడుకలో ఉన్న మరో కథ. చార్మినార్‌ను నాలుగు రహదారుల కూడలిలో నిర్మించారు. దీనినుంచి తూర్పు వైపు వెళ్లే దారి మచిలీపట్టణానికి చేరుతుంది. దక్షిణ దిశగా వెళ్లే దారి కృష్ణానది వరకు విస్తరించి ఉండేది. ఉత్తరదిశకు వెళ్లే దారి మూసీనదిని తాకేది. పశ్చిమ దిశనున్న దారి గోల్కొండ దుర్గానికి చేరేది. మహమ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్‌కు ఈశాన్య దిశన జామా మసీదును, వాయవ్య దిశన అనేక భవంతులను నిర్మింపజేశాడు. ఉత్తర దిశన 'చార్‌కమాన్' అనే నాలుగువైపులా ద్వారాలున్న మధ్య విశాలమైన ప్రదేశం, జలయంత్రం ఉండే కట్టడాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన భవనాలలో చార్మినార్ , జామామసీదు కాక లాల్‌మహల్, దార్‌మహల్, జినాన్‌మహల్, కుతుబ్ మందిర్, సాజన్‌మహల్, ఖుదత్‌మహల్ ముఖ్యమైనవి. దార్‌మహల్‌ను ఆయన తన దర్బార్‌కు ఉపయోగించేవాడు. పరిపాలనా నిర్వహణ ఇక్కడ నుంచే జరిగేది. ఫిర్యాదులపై ఇక్కడ ఆసీనుడయ్యే తీర్పులు చెప్పేవాడు. కుతుబ్‌మందిర్ ఆయన నివాస భవనం. మహమ్మద్ కులీకుతుబ్‌షా తాను రచించిన గీతాలలో ఖుదత్ మహల్, సాజనత్ మహల్, హైదర్ మహల్, కుతుబ్ మందిర్‌లను కొహితూర్ మహల్, నదీమహల్‌లను ప్రశంసిస్తాడు. ఖుదత్ మహల్ ఎనిమిది అంతస్తుల భవనం. కొహితూర్ మహల్ చార్మినార్‌కు దక్షిణ దిశగా వెళ్లే రహదారిపై కొద్ది దూరంలో నిర్మించిన భవనం. దాని చుట్టూ చక్కటి ఉద్యానవనం కూడా ఉండేది. అది ఇప్పుడు కనుమరుగైంది. అది ఉండే ప్రదేశంలోనే ఫలక్‌నూమా భవంతి నిర్మితమైనదని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. నదీమహల్ మూసీ నది తీరాన నిర్మితమైన విశ్రాంతి మందిరం. మహమ్మద్ కులీ కుతుబ్ షా హుస్సేన్‌సాగర్‌కు ఆగ్నేయదిశగా ఉన్న కొండపైన చక్కటి భవనం నిర్మించాడు. దీనిచుట్టూ విస్తృతమైన ఉద్యానవనం ఉండేది. ఆ వనం నేటి బషీర్‌బాగ్, ఫతేమైదాన్, పబ్లిక్ గార్డెన్స్, సైఫాబాద్ ప్రాంతాలదాకా విస్తరించి ఉండేది. అందుకే ఆ కొండను అప్పట్లో నబత్ ఘాట్ (వన పర్వతశిఖరం) అనేవారు. దాని చిహ్నంగా ప్రస్తుతం పబ్లిక్ గార్డెన్స్ మాత్రం మిగిలింది. అసఫ్‌జాహీ పరిపాలన కాలంలో నబత్ ఘాట్‌పై నొబత్ (ఢంకా)ను మోగించేవారు. అందుచేత దానికి ఆనాటి నుంచి 'నౌబత్ పహాడ్' అనే పేరు వచ్చింది. హైదరాబాద్ నగరంలో దాని పరిసరాల్లో ఇంకా అనేక ఉద్యానవనాలుండేవి. మహమ్మద్ కులీకుతుబ్ షా బార్షాహి అషుర్ ఖానా, దౌలత్‌ఖాన్-ఇ-అల్లాఖి, దారుల్-ఐ-షిఫాలను 1595లో నిర్మించాడు. అఘర్‌ఖానాను ఇప్పటికీ షత్తర్‌ఘట్టీలో చూడవచ్చు. దారుల్-ఐ-షిఫా విద్యాలయంగానూ, వైద్యశాలగానూ ఉపయోగపడేది. ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది. చార్మినార్ రెండో అంతస్తులో కూడా ఒక విద్యాలయాన్ని నిర్వహించేవారు. హైదరాబాద్ నగర నిర్మాణం తర్వాత సుల్తానులు ఆ నగరంలోనే నివసించడం ప్రారంభమైంది. యుద్ధ సమయాలలో మాత్రం గోల్కొండ కోటలోకి తరలిపోయేవారు. రాజ్యంపేరు మాత్రం గోల్కొండ రాజ్యంగానే చలామణీ అయింది.
మహమ్మద్ కులీకుతుబ్‌షా తాను నూతనంగా నిర్మించిన నగరానికి భాగ్యనగర్ అని నామకరణం చేశాడని చారిత్రక ఆధారాలు తెలుపుతాయి. ఆయన భార్యలలో అత్యంత ప్రీతిపాత్రురాలైన భాగమతి పేరు నగరానికి పెట్టాడని అత్యధిక సంఖ్యాక చరిత్రకారుల అభిప్రాయం. హైదరాబాద్ దర్శించిన ఫెరిష్టా, టెవెర్నియర్, ధెవమో, మనుక్కే వంటి విదేశ యాత్రీకుల రాతలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తాయి. ఇప్పటికీ 'భాగ్యనగరపు వారు' అను ఇంటి పేరు కలవారున్నారు. ఆ పేరుతో ఒక గ్రామమో పట్టణమో లేకపోతే ఆ ఇంటిపేరు రాదు. భాగ్యనగరం మరెక్కడా లేదు. హైదరాబాద్ గురించి ప్రస్తావించిన తొలి రచనలలో బాగ్‌నగర్ అనే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ అనే పేరు కనిపిస్తుంది. భాగమతికి మహమ్మద్ కులీకుతుబ్ షా హైదర్ మహల్ అనే బిరుదు ఇచ్చి భాగ్యనగర్ పేరును హైదరాబాద్‌గా మార్చాడని చరిత్రకారుల అభిప్రాయం. ఆయన నిర్మిచిన హైదర్ మహల్ భాగమతి కోసం నిర్మించిందే అయి ఉంటుంది. భాగమతి వర్ణ చిత్రాలున్నాయి. మహమ్మద్ కులీకుతుబ్ షాయే కాదు ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన మహమ్మద్ కుతుబ్‌షా ప్రియురాలు అయిన తారామతి పేర తారానగర్, అబ్దుల్లా కుతుబ్ షా ప్రేయసి ప్రేమావతిపేర ప్రేమావతి పేట వెలిశాయి. కుతుబ్‌షాహీ సమాధులలోనే వారి సమాధులూ ఉన్నాయి. గోల్కొండకు కొంచెం దూరంలో వారు నాట్యం చేసిన మందిరం ఉంది. అటువంటప్పుడు మహమ్మద్ కులీకుతుబ్‌షా తాను నిర్మించిన నగరానికి తాను అత్యంత గాఢంగా ప్రేమించిన భాగమతి పేరు పెట్టాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భాగమతి సమాధి కుతుబ్‌షాహీ సమాధులలోని కుల్సుంబేగం సమాధి వద్ద ఉందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
మొగలుల దండయాత్ర
మహమ్మద్ కులీకుతుబ్‌షాకు కుమారులు లేరు. హయత్‌బక్షీ బేగం అనే కుమార్తె ఉంది. ఆమెను తన సోదరుని కుమారుడైన మహమ్మద్ కుమారుడైన మహమ్మద్ కుతుబ్‌షాకు ఇచ్చి వివాహం చేశాడు. మొహ్మద్ కులీకుతుబ్ షా మరణానంతరం మహమ్మద్‌షా (1611-26) అధికారంలోకి వచ్చాడు. ఆయన పరిపాలనాకాలంలోనే హైదరాబాద్ తొలిసారిగా మొగల్ దండయాత్రకు గురయింది. మొగల్ చక్రవర్తి జహంగీర్ (1605-27) పరిపాలనాకాలంలో ఆయన కుమారుడు ఖుర్రమ్ (తర్వాత షాజహాన్) హైదరాబాద్‌పై దాడి చేసి మహమ్మద్ కుతుబ్‌షానుంచి పెద్దమొత్తంలో పేష్కస్ (కప్పం) వసూలు చేశాడు. గోల్కొండ రాజ్యం విదేశ దండయాత్రను నిలువరించలేకపోవడం ఇదే ప్రథమం. ముహమ్మద్ కుతుబ్‌షా 1617లో మక్కామసీదు నిర్మాణం ప్రారంభించాడు. నగరానికి తూర్పు దిశగా 'సుల్తాన్‌నగర్' అనే మరొక నగరాన్ని నిర్మించడానికి పథకాలు తయారుచేయించాడు. కాని ఈ రెండు నిర్మాణాలు ఆయన పరిపాలనా కాలంలో పూర్తి కాలేదు. మొహమ్మద్ మహల్, దాద్ మహల్ నిర్మాణాలు మాత్రం పూర్తయ్యాయి. నగరానికి ఉత్తరదిశన ఇరాకీ వాస్తుశైలిలో చార్‌బజార్ అనే వాణిజ్యకేంద్రాన్ని నిర్మించాడు. తన తల్లి పేర మాసాబ్‌ట్యాంక్‌ను నిర్మించాడు.
మహమ్మద్ కుతుబ్‌షా తర్వాత ఆయన కుమారుడైన అబ్దుల్లా కుతుబ్‌షా (1626-72) అధికారంలోకి వచ్చాడు. ఈ దశలో మహమ్మద్ కులీకుతుబ్‌షా కుమార్తె, మహమ్మద్ కుతుబ్‌షా భార్య , అబ్దుల్లాకుతుబ్‌షాకు తల్లి అయిన హయత్ బక్షీ బేగం (ఆమె పేరునే హయత్‌నగర్ వెలిసింది.) రాజ్యపాలనలో ప్రముఖపాత్ర వహించింది. అబ్దుల్లా పరిపాలనా కాలంలో మొగల్ దండయాత్రలు ఉధృతమయ్యాయి. షాజహాన్ పరిపాలనా కాలంలో (1627-58) జరిగిన మొదటి దండయాత్రను (1626) ప్రతిఘటించలేక అబ్దుల్లా భారీమొత్తంలో కప్పం చెల్లించి మొగలులకు లోబడి ఉండడానికి అంగీకరించాడు. ఆనాటినుంచి గోల్కొండ రాజ్య అంతరంగిక పరిపాలనలో మొగలుల జోక్యం తీవ్రమైంది. దానిని నిరసించినందుకు ఆగ్రహించిన ఆనాటి దక్కన్ రాజప్రతినిధి ఔరంగజేబ్ తన కుమారుని ఆధ్వర్యంలో 1656లో మరోసారి దండయాత్ర జరిపించాడు. అబ్దుల్లా తలవంచి మళ్లీ భారీమొత్తంలో నష్టపరిహారం, కప్పం చెల్లించి తన ప్రథమ కుమార్తెను ఔరంగజేబు పెద్దకుమారుడైన మహమ్మద్‌కిచ్చి వివాహం చేశాడు.
అబ్దుల్లా కుతుబ్‌షా తర్వాత ఆయన మూడో అల్లుడైన అబుల్ హసన్ (తానాషా) (1672-87) అధికారం చేపట్టాడు. ఆయన చార్మినార్ సమీపంలో చార్‌మహల్‌ను నిర్మించాడు. మొగలుల అడుగులకు మడుగులొత్తలేక, మాదన్నను ప్రధానమంత్రిగాను, అక్కన్నను సైనికాధికారిగాను నియమించి ఆనాటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (1658-1707) ఆగ్రహానికి గురయ్యాడు. దీనికితోడు మహారాష్ట్ర రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీతో ఆయన చేసుకున్న సంధి మరింత ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో తిరిగి మొగలుల దండయాత్ర మొదలైంది. అబుల్ హసన్ గోల్కొండ ముట్టడి 1627 జనవరి 28న ప్రారంభమై సెప్టెంబరు 21వరకు సాగింది. చివరకు దుర్గ రక్షణకు నియమితుడైన అబ్దుల్లాఖాన్ ఔరంగజేబు ఇచ్చిన లంచానికి ఆశపడి దుర్గం ద్వారాన్ని తెరవడంతో గోల్కొండ కోట మొగలుల వశమైంది. అబుల్ హసన్ దౌలతాబాద్ దుర్గంలో 13 సంవత్సరాలపాటు బందీగా జీవించి 1700లో అక్కడే మరణించాడు. ఇలా వైభవోపేతమైన కుతుబ్‌షాహీల చరిత్ర ముగిసింది
మొగల్ దండయాత్రా కాలంలో హైదరాబాద్ అనేక ఇబ్బందులకు గురయింది. కుతుబ్ షాహీలు అనుసరించిన మత సహన వైఖరి అంతమైంది. కాని దీనికొక మినహాయింపు ఉంది. 1687లోనే ఔరంగజేబు కర్మాన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయానికి లాతూర్ జిల్లాలోని కొన్ని భూములను, మహబూబ్‌నగర్ జిల్లాలోని ధారూర్‌లో 72 ఎకరాల భూమిని దానం చేశాడు. మత దురభిమానంతో అనేక దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు ఇటువంటి దానాలు చేశాడంటే హైదరాబాద్ ఉదార సంస్కృతీ ప్రభావం ఆయనను కూడా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మక్కామసీద్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది 1794 నాటికి పూర్తయింది. ఔరంగజేబు హైదరాబాద్ నగరం పేరును 'దారుల్‌జిహాద్'గా మార్చాడు. అయితే గోల్కొండ -హైదరాబాద్ ఒక స్వతంత్ర రాజ్యరాజధానిగా అంతమై తన ప్రాభవాన్ని కోల్పోయింది. రాజ్యం అరాచకం పాలయింది. 'సవాయ్ పాపన్న' అనే సామాన్య వ్యక్తి తిరుగుబాటు చేసి విచ్చలవిడిగా దోపిడీలకు పూనుకోగలిగాడంటే ఆనాటి పరిస్థితులెంత అధ్వానంగా ఉన్నాయో అర్థమవుతుంది. మొగల్ సామ్రాజ్యం కూడా ఔరంగజేబు మరణానంతరం (1707) క్షీణదశలో పడింది. పరిస్థితులను అదుపులో పెట్టగల పరిపాలనా దక్షులు కరవయ్యారు.
నిజాంల పాలన ప్రారంభం...
ఆనాటి మొగల్ చక్రవర్తులు గోల్కొండ, బీజపూర్, తమిళనాడు, గుల్బర్గా, బీదర్, బీరార్ ప్రాంతాలను ఒక సుభాగా ఏకం చేసి దాని పరిపాలనకు ఒక సుభాదారుడిని నియమించేవారు. ఈ దక్కన్ సుభాదార్ ఔరంగాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఈ ప్రాంతాలను పరిపాలించేవాడు. 1713లో ఆనాటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్ మీర్ కమ్రుద్దీన్ చింక్ లిచ్‌ఖాన్ అనే సర్దార్‌ను దక్కన్ సుబేదారుగా నియమించారు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన స్థానంలో సయ్యద్ హుస్సేన్ ఆలీఖాన్‌ను ఆ పదవిలో నియమించారు. మీర్ కమ్రుద్దీన్ కేంద్రమంత్రులలో ఒకడిగా నియమితుడయ్యాడు. 1720లో సయ్యద్ సోదరుల తిరుగుబాటును అణచివేయడంలో ఆనాటి మొగల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (1719-1748)కు సాయపడి ఆయన నుంచి 'నిజాం-ఉల్-ముల్క్' అనే బిరుదు పొందారు. కాని ఆయన దృష్టి దక్కన్‌పైనే ఉండేది. 1920లో దక్కన్ సుబేదార్‌గా నియమితుడయ్యాడు. కాని అప్పటికే ఆ పదవిలో ఉన్న ముబారిజోఖాన్ సుబేదారీ పదవిని వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిరువురి మధ్య 1724లో అక్టోబరు 11వ తేదీన షక్కర్‌గెడ్డ యుద్ధం జరిగింది. ఇందులో జయించిన నిజామ్ -ఉల్-ముల్క్ దక్కన్ సుబేదారుగా స్థిరపడ్డాడు. హైదరాబాద్ రాజ్యస్థాపన ఈ తేదీ నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహమ్మద్ ఆయనకు 'అసఫ్‌జా' అనే బిరుదు కూడా ఇచ్చాడు. నిజామ్-ఉల్-ముల్క్ వారసులు ఆ బిరుదునే తమ వంశ నామంగా ఉపయోగించారు. ఒకపక్క దక్కన్ సుబేదారుగా వ్యవహరిస్తూనే అసఫ్‌జా మొగల్ సామ్రాజ్య ప్రధాన మంత్రులలో ఒకడిగా కూడా వ్యవహరించేవాడు. 1739లో నాదిర్షా దండయాత్ర జరిగిన తర్వాత ఆయన ఢిల్లీని సందర్శించనేలేదు. ఢిల్లీ చక్రవర్తులు కూడా నామావశిష్టులైపోవడంతో నిజాం స్వతంత్రుడయ్యాడు. అలా దక్కన్ సుబేదారు ఆచరణలో స్వతంత్ర ప్రతిపత్తిని సాధించింది.
నిజామ్-ఉల్-ముల్క్ క్రీ.శ. 1748లో మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు ఘాజీ ఉద్దీన్ ఖాన్ ఢిల్లీలో మంత్రిగా ఉండేవాడు. అందుచేత ఆసఫ్‌జా రెండో కుమారుడైన నాజర్‌జంగ్, మనవడైన ముజిఫర్ జంగ్‌లు అధికారం కోసం అంతర్యుద్ధం ప్రారంభించారు. ఇది అవకాశంగా తీసుకొని ఇంగ్లిష్, ఫ్రెంచి తూర్పు ఇండియా కంపెనీలు తమ ప్రాబల్యాన్ని విస్తరింపజేసుకొనేందుకు ప్రయత్నించాయి. ఆంగ్లేయులు నాజర్ జంగ్‌ను, ఫ్రెంచివారు ముజఫర్ జంగ్‌ను బలపరిచారు. వీరి కుట్రలలో వారిద్దరూ హతమయ్యారు. చివరకు ఫ్రెంచివారి మద్దతుతో ఆసఫ్ జా కుమారులలో ఒకడైన సలాబత్‌జంగ్ ఔరంగాబాద్ గద్దెనెక్కాడు. దీనికి కృతజ్ఞతగా ఆయన కృష్ణానది నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న కోస్తా ప్రాంతాలను 1753లో ఫ్రెంచ్ వారికి ధారాదత్తం చేశాడు. కాని కొద్దికాలంలోనే ఫ్రెంచి సేనాధిపతి కర్నల్ బుస్సీ తలబిరుసు వైఖరిని ఆయన సహించలేక తన రాజ్యం వదిలిపొమ్మని ఆజ్ఞాపించాడు. అయితే బుస్సీ హైదరాబాద్‌లోని చార్‌మహల్‌లో మకాం పెట్టి సలాబత్ సైన్యాలను, ఆయనకు సహాయంగా వచ్చిన మహారాష్ట్ర సైన్యాలను ఎదుర్కొన్నాడు. 1755లో జరిగిన ఈ చార్ మహల్ యుద్ధంలో హైదరాబాద్ నగరంలోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. చివరకు గత్యంతరం లేక సలాబత్ జంగ్ ఫ్రెంచివారితో రాజీపడి వారికి గతంలో తానిచ్చిన ప్రాంతాలను మళ్లీ ఇచ్చేశాడు. అయితే 1756లో ఫ్రెంచివారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి రంగంనుంచి నిష్క్రమించడంతో సలాబత్ జంగ్ ఫ్రెంచివారికి గతంలో తానిచ్చిన ప్రాంతాలను ఆంగ్లేయులకు బదిలీ చేసి వారితో స్నేహసంబంధాలను ఏర్పరచుకున్నాడు. దీని ఫలితంగా కాకతీయులు, కుతుబ్‌షాహీలు సాధించిన తెలుగుజాతి సమైక్యత విచ్ఛిన్నమైంది. కోస్తా జిల్లాల ప్రజలు తోటి తెలుగు ప్రజలకు దూరమై ఆంగ్లేయుల ప్రత్యక్ష బానిసత్వంలోకి వెళ్లిపోయారు. 1762లో సలాబత్ జంగ్‌ను హతమార్చి అధికారంలోకి వచ్చిన ఆయన సోదరుడు నిజాంఆలీ ఆంగ్లేయులతో సంబంధాలను ధృఢతరం చేసుకున్నాడు. సలాబత్‌జంగ్ ఆంగ్లేయులతో చేసుకున్న సంధిని 1767లో ధ్రువపరిచాడు. 1780 నుంచి 1784వరకు జరిగిన మూడో మైసూరు యుద్ధంలోనూ, 1799లో జరిగిన నాలుగో మైసూరు యుద్ధంలోనూ ఆంగ్లేయులతోనూ, మహారాష్ట్రులతోను చేతులు కలిపి, టిప్పు సుల్తాన్ పతనానికి కారణభూతుడయ్యాడు. (శ్రీరంగపట్టణం కోటలో నుంచి నిజాం ఆలీ అనుచరులు తీసుకువచ్చిన కొన్ని అమూల్య వస్తువులను ఈనాటికీ సాలార్‌జంగ్ మ్యూజియంలోను, ప్రభుత్వం మ్యూజియంలోనూచూడవచ్చు.) 1798లో సైన్య సహకారసంధులపై సంతకం చేసి దక్కన్ సుబేదారీపై ఇంగ్లిష్ వారి పరోక్ష ప్రాబల్యం ఏర్పడడానికి కారణభూతుడయ్యాడు. దీని ఫలితంగా నవాబు సైనిక శక్తి కోల్పోయి తన మనుగడకు ఇంగ్లిష్ సైన్యాలపై ఆధారపడవలసివచ్చింది. తన రాజ్యంలో తిష్టవేసిన ఇంగ్లిష్ సైన్యాల వ్యయభారాన్ని తానే మోయవలసి వచ్చింది. దీనివలన ప్రభుత్వ ఖజానా గుల్లయింది. గత్యంతరం లేక నిజాం ఆలీ ఇంగ్లిష్ సైన్యాల ఖర్చు నిమిత్తం రాయలసీమ జిల్లాలను వారికి ధారాదత్తం చేశాడు. ఫలితంగా తెలుగు జాతి మరొకమారు విచ్ఛిన్నమైంది. నిజాంఆలీ దక్కన్ సుభా రాజధానిని ఔరంగాబాద్‌నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. 1687లో కుతుబ్‌షాహీ సామ్రాజ్యం పతనమైన అనంతరం దాదాపు హైదరాబాద్ తిరిగి ఒక ప్రముఖ రాజ్యానికి రాజధాని అయ్యింది. ఆనాటి నుంచి దక్కన్ సుభాకు హైదరాబాద్ రాజ్యం అనే పేరు వచ్చింది. అదేవిధంగా నిజాం ఆలీ పేరు మీదుగానే హైదరాబాద్ నవాబులకు నిజాం నవాబులనే పేరు వచ్చింది.
నిజాం ఆలీ మరణానంతరం ఆయన కుమారుడు సికిందర్ జా (1803-29) నవాబయ్యాడు. 1806లో సైన్యసహకార పద్ధతిననుసరించి కర్నల్ లాంగ్ నాయకత్వాన హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన సందర్భంలో సికిందర్ జా తన పేర వారి నివాసం కోసం సికింద్రాబాద్‌ను నిర్మించాడు. ఆ నగరంలోనే బ్రిటిష్ రెసిడెంట్ నివసించేందుకు బొల్లారంలో ఒక పెద్ద భవంతిని నిర్మించారు. దానినే రెసిడెన్సీ అనేవారు. సామాన్య ప్రజలు సికింద్రాబాద్‌ను లష్కర్ (సైనిక శిబిరం) అనేవఖీతి
అనేక భాషలతో అలరారుతున్న భాగ్యనగరంలో సందడిగా ఉండే ఏ ప్రధాన కూడలిలో నుంచున్నా... ఒక్కసారిగా లెక్కలేనన్ని భాషలు మన చెవిని తాకుతాయి.... ఏదో కొత్త రాగం మనసుని తట్టిన అనుభూతి హైదరాబాద్ అన్నింటా తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఉపాధి కోసం కొందరు, వ్యాపారం కోసం కొందరు, ఇక్కడి వాతావరణం నచ్చి మరికొందరు భారత ఉపఖండంలో నెలకొన్న సాంఘిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇంకొందరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. దీంతో హైదరాబాద్ విభిన్న భాషలు, సంస్కృతుల నిలయంగా మారింది. భినత్వంలో ఏకత్వానికి దర్పణంగా విలసిల్లుతోంది. దేశంలోని మరే నగరంలోనూ ఇన్ని భాషలు, సంస్కృతులు కనిపించవంటే అతిశయోక్తి కాదు. తెలుగు, ఉర్దూ భాషలతో పాటు కన్నడం, మరాఠీ, గుజరాతి, రాజస్థానీ (మార్వాడీ), పంజాబీ, బెంగాలీ, హిందీ, ఒరియా భాషలు నగరంలో వినిపిస్తాయి. విదేశీ భాషలైన అరబిక్, ఇరానీ (పార్సీ), పష్తు, సింధీ మాట్లాడే ప్రజలు సైతం నగరంలో గణనీయంగా ఉన్నారు. స్వల్ప సంఖ్యలో నేపాలీ, చైనీస్ మాట్లాడేవారు ఉన్నారు. కుతుబ్ షాహీల పాలనలో ధనధాన్యాలతో అలరారిన నగరానికి దేశం లోని అనేక ప్రాంతాల ప్రజలు వలస వచ్చారు. నగర నిర్మాణానికి ఇరాన్ నుంచి నిపుణులను రప్పించారు. కుతుబ్‌షాహీ వంశానికి ఇరాన్‌లో మూలాలున్నాయని చరిత్రకారులఅభిప్రాయం. కుతుబ్‌షాహీలు పార్సీని అధికార భాషగా ప్రకటించారు. దీని ప్రభావం వల్ల 400ఏళ్ల క్రితమే అనేక మంది ఇరానీలు నగరానికి వచ్చి స్థిరపడ్డారు. అనేకమంది స్థానికులు సైతం పార్సీ భాషను నేర్చుకొన్నారు. ఆరో నిజాం మీర్ మహమూబ్ ఆలీఖాన్ పాలనాకాలంలో (1869-1911)అనేక ప్రాంతాలు, భాషల ప్రజలు నగరంలో స్థిరపడ్డారు. పాలనా సౌలభ్యం కోసం మహబూబ్ ఆలీఖాన్ వివిధ ప్రాంతాలనుంచి భిన్నరంగాల్లో నిపుణులను హైదరాబాద్ రప్పించారు. అరబ్బు దేశాల నుంచి యువకులను, ఉత్తరాది నుంచి పఠాన్లను, సిక్కులను రప్పించి సైన్యంలో చేర్చుకొన్నారు. వ్యాపారంలో నిష్ణాతులైన మార్వాడిలను ఆహ్వానించి వాణిజ్య రంగంలో నిలదొక్కుకొనేలా చర్యలు తీసుకొన్నారు. నాటి నిజాం సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాలనుంచి కన్నడం మాట్లాడేవారు, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నాందేడ్ జిల్లాల నుంచి మరాఠీ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగల నిమిత్తం, ఉపాధి కోసం హైదరాబాద్ ఆచార వ్యవహారాల ప్రజలు అధిక సంఖ్యలో సహజీవనం చేస్తున్న హైదరాబాద్‌ను పలువురు 'మినీ భారతదేశం' గా వ్యవహరిస్తారు. పాతనగరంలోని అనేక బస్తీలను చుట్టివస్తే భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో పర్యటించిన అనుభూతి కలుగుతుందని సందర్శకులు అంటుంటారు. పాతనగరంలోని శాలిబండ, సుల్తాన్ షాహి, బీబీకా చష్మ, కాలాపత్తర్, ఛత్రినాక, ఉర్దూ, తెలుగుతోబాటు మరాఠీ, కన్నడం, తమిళం మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. షంషీర్‌గంజ్, కబూతర్‌ఖానా, హుసేనిఆలం, చేలాపురా, ఘాంసీ మియాబజార్, బస్తీల్లో గుజరాతి, మార్వాడి, బెంగాలి, హిందీ మాట్లాడేవారి సంఖ్య అధికంగా ఉంది. కిషన్‌బాగ్, సిఖ్ చవునీ ప్రాంతాల్లో పంజాబీ, సింధీ మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తారు. దారుల్‌షిఫా, యాకుత్‌పురా, నూర్‌ఖాన్ బజార్ బస్తీలలో ఇరాని, ఫష్తు భాషలు మాట్లాడే వారి సంఖ్య అధికం. బార్కాస్, గోల్కొండ, మొఘల్‌పురాతోబాటు కొత్తనగరంలోని కింగ్‌కోఠి బస్తీలలో అరబ్బి మాట్లాడేవారి సంఖ్య అధికం. స్వాతంత్య్రానికి ముందే వలస వచ్చిన చైనీయులు చాదర్‌ఘాట్ ప్రాంతంలో స్వల్ప సంఖ్యలో కనిపిస్తారు. పళ్లతోటలు, పరిశ్రమల్లో పనిచేసేందుకు వలస వచ్చిన ఒరియా మాట్లాడే ప్రజలు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బెంగాలీలైన స్వర్ణకారులు పాతనగరంలోని గుల్జార్‌హౌజ్, పురానాపూల్‌డివిజన్‌లలో అధిక సంఖ్యలో ఉన్నారు.
చార్మినార్‌లోని 'చార్'ల అద్భుతం
నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.
ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్ ఒకటి. చార్మినార్ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ , మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్ అందమైన డోమ్ ఆకారంలో ఉంటుంది. చార్మినార్ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్ రూపొందిందో!
భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్‌షా
1500వ శతాబ్దంలో కుతుబ్‌షాహీ వంశస్థుడు సుల్తాన్ ఇబ్రహీం గోల్కొండ కోటని రాజధానిగా చేసుకొని మధ్య భారతంలోని సువిశాల దక్కన్ పీఠభూమిని పాలించాడు. అప్పటికే కోట కిక్కిరిసిపోవడంతో మరో నూతన నగరాన్ని నిర్మించాలని సుల్తాన్ ఇబ్రహీం కలలు కన్నాడు. కానీ తన స్వప్నం ఫలించకముందే అతను దివంగతుడయ్యాడు (జూన్ 5, 1580). దాంతో ఒక సుందర మహానగరాన్ని నిర్మించాల్సిన బాధ్యత అతని వారసులపై పడింది.
కానీ కుతుబ్‌షాహీ వంశ వారసులుగా సింహాసనాన్ని అధిష్టించవలసిన వారిలో చాలామంది మానసిక లేదా శారీరక వైకల్యంతోనో ఉండేవారు. ఒక్కోసారి రెండు వైకల్యాలూ ఉండేవి. అటువంటి వారి చేతుల్లో సామ్రాజ్యాన్ని ఉంచడం అంత క్షేమకరం కాదని సుల్తాన్ ఇబ్రహీంకి అత్యంత విశ్వాసపాత్రులు, మంత్రి 'రాయ్‌రావు' భయపడ్డాడు. అందుకే అతను ఇబ్రహీం చిన్న కుమారుడు సమర్థుడు, మేధావి 'మొహమ్మద్‌కులీ'కి సింహాసనం కట్టబెట్టాలని భావించాడు. ఇబ్రహీం పెద్దతమ్ముడినీ అందుకు ఒప్పించాడు. దాంతో ఇబ్రహీం పెద్ద కొడుకు చరిత్రలో కలిసిపోగా మొహమ్మద్ కులీ రాజ్యపాలన చేపట్టాడు.
సుల్తాన్ కులీకుతుబ్‌షా తన పూర్వీకులకన్నా భిన్నమైన వాడు. రాజ్యకాంక్ష, యుద్ధప్రియత్వం లేనివాడు. అప్పటికే కుతుబ్‌షాహి వంశస్తులు సామ్రాజ్యాన్ని పటిష్టంగా తీర్చిదిద్దారు. సౌందర్యదృష్టి, కళలపట్ల ప్రేమ ఉన్న కులీ వాటికి ప్రాధాన్యం ఇస్తూనే వీలుచిక్కినప్పుడల్లా, చదువుకొనేవాడు. మత నిబంధనలు, ఆచారాలనూ కచ్చితంగా పాటించేవాడు. ఈ విషయంలో మిగిలిన కుత్‌బ్‌షాహీ వంశస్తులందరికన్నా 'కులీ'కి పట్టింపు ఎక్కువే.
1565 ఏప్రిల్ 4న జన్మించిన కులీ అతని తండ్రి సుల్తాన్ ఇబ్రహీం చనిపోయే నాటికి పదిహేనేళ్ళవాడు. రాజనీతిజ్ఞుడు, గోల్కొండ సామ్రాజ్యానికి విశ్వసనీయుడు అయిన మంత్రి 'రాయ్‌రావు' ఎటువంటి తిరుగుబాట్లూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అదేరోజు మొహమ్మద్ కులీని సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఎంత సౌందర్యపిపాస ఉన్నా కులీ తన బాధ్యతలను మాత్రం మరవలేదు. అనుభవజ్ఞులు, మేధావులైన అధికారుల సహాయంతో తనపై పడిన భారాన్ని సులువుగానే మోయగలిగాడు.
రాచరిక పగ్గాలు చేతబట్టి పదేళ్ళు దాటకముందే తన తండ్రి కన్న కలల్ని నిజం చేయడానికి ఉపక్రమించాడు కులీ. గోల్కొండ కోటకు తూర్పున పదకొండు కిలోమీటర్ల దూరంలో అప్పటి భారతదేశంలోనే కొత్తదైన ఓ మహానగర నిర్మాణానికి పునాది పడింది. ఆ నగరానికి 'హైదరాబాద్' అని పేరు పెట్టాడు కులీ కుతుబ్‌షా.
అప్పటికి దక్కన్ రాజ్యాలన్నింటిలోకి గోల్కొండ సంపన్నమైన, సుభిక్షమైన రాజ్యం. దైనందిన రాజ్యపాలన, విదేశీ వ్యవహారాలు వంటి వాటిని సమర్థంగా నిర్వహిస్తూనే కళలనూ పెంచి పోషించేవాడు కులీ. నృత్యగానాలతో గోల్కొండ ప్రతిధ్వనిస్తూ ఉండేది. అదేవిధంగా తన కొత్త హైదరాబాద్ నగరాన్ని సంస్కృతికి కేంద్రంగా రూపుదిద్దడంలోనూ కులీ శ్రద్ధ వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులూ, కళాకారులను హైదరాబాద్‌ను సందర్శించేందుకు ప్రోత్సహించేవాడు. కుతుబ్‌షాహీ వంశానికీ పర్షియాకు సాంస్కృతిక, మత, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పటిష్టమైన అనుబంధం ఉంది. దాంతో పర్షియన్ కవులు, కళాకారులు హైదరాబాదును తరచూ సందర్శించేవారు.
విదేశీ కళాకారులను ఎంత గౌరవించినా కులీ తన దేశాన్ని, రాజ్యాన్నీ, తన వారినీ ముఖ్యంగా హిందువులను ఎక్కువగా ప్రేమించేవాడు, అభిమానించేవాడు. సాహిత్యం, కళలపట్ల కులీకున్న వ్యామోహం అతని పాలనలో మేధోవికాసానికి దోహదపడింది. కొత్త నగరంలో కులీకుతుబ్‌షా కీర్తి నలుదిశలా వ్యాపించింది. దాంతో పాటే భారతీయ చరిత్రలో అతనికో సుస్థిర స్థానాన్ని సంపాదించిపెట్టింది.
సుల్తాన్ కులీకుతుబ్‌షా పాలనలో హైదరాబాద్ కళలకు, విభిన్న సంస్కృతులకూ కేంద్రంగా భాసిల్లింది. హైదరాబాదును కళలకు విజ్ఞాన సముపార్జనకు కేంద్రంగా రూపుదిద్దాలన్న కులీ ఆశయం ఫలించింది. తూర్పు దేశాలలో సైతం హైదరాబాద్ నగర పేరు ప్రఖ్యాతులు మార్మోగాయి. చార్మినార్ పైనున్న మినార్ల మధ్య ఈ విధంగా లిఖించి ఉంటుంది.
''నేను విజ్ఞాన నగరాన్ని
అలీ ఆ నగరానికి ప్రవేశద్వారం వంటివాడు''.
దక్కను భూభాగంలో వాడుకలో ఉన్న ఉర్దూ భాషపై కులీకుతుబ్‌షా పట్టు సంపాదించాడు. ఆయనిలా రాసుకున్నాడు.
''ప్రపంచం ఒక ఉంగరం వంటిదైతే
దక్కను విలువైన రత్నం వంటిది
విలువైన రాయి
ఉంగరానికే గౌరవాన్నిస్తుంది''
కులీ పాలనలో ప్రాంతీయ భాషలకు అరబిక్, పర్షియన్‌లతో పాటుగానే ప్రోత్సాహం లభించింది. ప్రత్యేకించి చెప్పాలంటే తెలుగు భాషకు ఆదరణ దక్కింది. స్థానిక కవులు సుల్తాన్ అభిమానానికి పాత్రులయ్యారు. స్వయంగా కవిఅయిన కులీ అప్పుడప్పుడూ తెలుగులో కవితలూ, రచనలూ చేసేవాడు. ఆయన రచనల్లో పరిణతి కనిపిస్తుంది.
కులీకుతుబ్‌షా రచనల్లో పేరెన్నికగన్నది 'కుల్లియత్'. అప్పటి సామాజిక జీవనానికి ఈ రచన అద్దం పట్టింది. హిందుముస్లిం పండుగలను గురించి, దైనందిన వ్యవహారాలు, భాష వేషం, ఆహారపుటలవాట్లు, క్రీడలు వంటివి ఇందులో కథాంశాలు. మనం ఇప్పుడు ఆడుతున్న కబడ్డీ, పోలో వంటి ఆటల గురంచి కులీ తన పుస్తకంలో రాయడం విశేషం.
పవిత్ర రంజాన్ మాసంలో లైన్, ఓపియం వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేవాడు. తనూ ఆ నిబంధనలను కచ్చితంగా పాటించేవాడు 'కులి'. రంజాన్ మాసం ముగిశాక తిరిగి నృత్యగానాలను ఆస్వాదించేవాడు.
కుల్లియత్‌లో అప్పట్లో వివాహాల సందర్భంగా జరిగే వేడుకలు ఆచారాల గురించి వివరించాడు. అవే ఆచారాలు, వేడుకలు ఇంచుమించుగా ఇప్పటికీ ముస్లిం వివాహాల సందర్భంగా జరుగుతూండడం విశేషం. అప్పట్లో ఉన్న 'జల్వా' వేడుక ఇప్పటికీ కొనసాగుతుండడమే ఇందుకు ఉదాహరణ. ఈ వేడుకలో వధూవరులు ఒకరినొకరు తొలిసారి చూసుకుంటారు.
ముస్లిం విశ్వాసాల కనుగుణంగానే పెరిగినా హిందూ మతాన్నీ ఆదరించడం సుల్తాన్ కులీకుతుబ్‌షా, విశాల హృదయానికి నిదర్శనం. ఈ కారణంతోనే గతంలో లేనంతగా రాజ్యాన్ని ఐక్యంగా, పటిష్టంగా మార్చింది. ఒక విధంగా ఈ మత సహనం అనేది మహ్మద్‌కులీకి తండ్రి నుంచే వచ్చిందని చెప్పుకోవాలి. మరో ముఖ్యకారణం కులీ తల్లి సంప్రదాయ హిందూకుటుంబానికి చెందిన స్త్రీ కావడమే.
పాలన వ్యవహారాల్లో అనుభవజ్ఞులైన సలహాదారుల మార్గదర్శకత్వం కులీకి లభించేది. ఆచరణ సాధ్యంకాని చట్టాలను తొలగించేవారు. న్యాయం అందరికీ సమానంగానే దక్కేది. ప్రజలందరికీ కూడు గూడు కోసం సుల్తాన్ తపించేవాడు. రాజ్యరక్షణ కోసం విదేశీ శతృవుల భయం లేకుండా ఉండేందుకు విదేశీవ్యవహారాలను ఎంతో జాగరూకతతో, సమర్థంగా నెరపేవాడు. దురాక్రమణలు జరిగితే ధీటుగా ఎదుర్కోవడానికి వీలుగా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో సైనిక పోస్టులను నెలకొల్పాడు. అదే సమయంలో కొంత నియంత్రణతో విదేశీయులను తన రాజ్యంలోకి వ్యాపార తదితర వ్యవహారాల్లో పాలుపంచుకునేందుకు అనుమతిచ్చాడు. భారతదేశంలో ఇతర రాజ్యాలు, సంస్థానాలతో దౌత్య సంబంధాలను సాగించేవాడు. ఉత్తర భారతంలో మొగల్ సామ్రాజ్యంతోను, విదేశాలతోను మంచి దౌత్య సంబంధాలుండేవి.
తన నలభైఆరోయేట (46) డిసెంబరు 17, 1612లో మహ్మద్ కులీ కుతుబ్‌షా గుండెపోటుతో తనువు చాలించాడు. తన ముప్ఫైరెండేళ్ళ పాలనలో హైదరాబాద్ నగరంలో కళా సంస్కృతులకు కులీ ఇచ్చిన ప్రోత్సాహం చూపిన ఆదరాభిమానాలు కులీకుతుబ్‌షా పాలనను స్వర్ణయుగంగా మార్చాయి.
ఆ యుగం గతించినా అప్పటి వైభవం నగరం నలుదిశలా కనిపిస్తూనే ఉంటుంది. నగర వీధుల్లో, అప్పటి కట్టడాల శిల్పనైపుణ్యంలో, హైదరాబాదీ సంస్కృతిలో అదింకా బతికే ఉంది.
హైదరాబాద్ పేరు వెనుక చరిత్ర
అఫ్ఘాన్ ప్రాంతం నుంచి వలస వచ్చి మొగలుల ద్వారా దక్కన్ ప్రాంతానికి రాజైన సుల్తాన్‌కులీ పరిపాలన సజావుగానే సాగినప్పటికీ ఆయన ఏడుగురు కొడుకుల మధ్య సయోధ్య లేని కారణంగా కుటుంబ కలహాలు తీవ్రస్థాయిలో ఉండేవి. రాజ్య కాంక్ష, కక్షలు తీవ్రరూపం దాల్చటంతో కులీ కుమారుడు ఇబ్రహీం పొరుగు రాజ్యమైన విజయనగరంలో దాదాపు ఏడు సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే అతను విజయనగర యువరాణిలలో ఒకరైన భాగీరథిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇబ్రహీం, భాగీరథి దంపతులకు పుట్టిన మహ్మద్ కులీ కుతుబ్‌షా కలల సాకారంగా రూపొందిందే హైదరాబాద్ నగరం. మహ్మద్ కులీ ప్రేమ చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని పేర్కొనవచ్చు. షాజహాన్ ప్రేమ తాజ్‌మహల్ రూపంలో ప్రపంచం అంతా పాకింది. కులీ తన భార్య భాగమతికి ఒక నగరాన్నే అంకితం ఇచ్చాడు. అయితే పేరు వివాదాస్పదం కావటం, దానిని మార్చటానికి కులీ అంగీకరించటంతో చరిత్రలో షాజహాన్ అంతటి గొప్ప ప్రేమికుడిగాప్రత్యేక ముద్ర సంపాదించుకోలేకపోయాడు. సంప్రదాయాలను ఎదిరించి కులీ భాగమతిని వివాహం చేసుకుని కోటకు తీసుకువచ్చాడు. భాగమతి ప్రతి కదలికా అప్పట్లో సంచలనం కలిగించేదట. స్వతహాగా మంచి కవి, కళాభిరుచి ఉన్న వ్యక్తి అయిన మహ్మద్ కులీ ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కురిపించేవాడు. ఒక రోజు తాను కొత్తగా నిర్మిస్తున్న ప్రాంతానికి భాగమతిని తీసుకువెళ్లిన కులీ 'దీన్ని నీకు అంకితం ఇస్తున్నా' అని చెప్పాడట. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత భాగమతి పేరు మీద నగరాన్ని భాగ్యనగరంగా పిలిచాడు మహ్మద్‌కులీ. అయితే ముస్లిం ప్రపంచానికి ప్రతినిధులుగా ఉండాల్సిన ప్రభువులు తమ రాజధానిని హిందూ ఛాయలు ఉన్న పేరుతో వ్యవహరించటం రాచకుటుంబంలో అనేక మందికి నచ్చలేదు. తరువాత భాగమతి తన మనుగడకే ప్రమాదం వచ్చే సూచనలు ఉండటంతో నిరాశకులోనైంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచిన మహ్మద్‌కులీ మరో మార్గంలేక ప్రవక్త అల్లుడైన హైదర్‌అలీ పేరు మీద భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చటానికి అంగీకరించాడని చరిత్రకారుల నమ్మకం. అయితే కులీ మాత్రం హైదరాబాద్‌ని భాగ్యనగరంగానే వ్యవహరించేవాడని తెలుస్తోంది.
నగరాభివృద్ధిలో మహిళల పాత్ర
హైదరాబాద్ నగరాభివృద్ధిలో పలువురు మహిళలు తమ వంతు పాత్ర వహించారు. మహ్మద్‌కులీ, భాగమతి దంపతుల వారసురాలు హయత్. మూడు పదుల వయసులోనే ఈమె భర్తను కోల్పోయింది. అయినప్పటికీ ఆమె తన 12 సంవత్సరాల కుమారుడు అబ్దుల్లాని పట్టాభిషిక్తుడ్ని చేసి రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించింది. అతను స్వంతంగా బాధ్యతలను నిర్వహించగలిగే సమర్ధతను సాధించినప్పటి నుంచి ఆమె రాజ్యాధికార బాధ్యతల నుంచి సమాజ సేవ వైపు దృష్టి మరల్చింది. ప్రస్తుతం నగరంలోని హయత్‌నగర్ ప్రాంతం ఆమె పేరు మీద ఏర్పడిందే. జౌరంగజేబు మొదటిసారి హైదరాబాద్ ప్రాంతాన్ని ఆక్రమించాలనే తలంపుతో వచ్చినప్పుడు రాజమాతగా దౌత్యం నడిపి యుద్ధ వాతావరణాన్ని తప్పించిన ఘనత ఆమెది. తన మనుమరాల్ని ఔరంగజేబు కుమారుడితో వివాహం జరిపించి చాలా కాలం మొగలులతో సమస్యలు రాకుండా చేసిన ఆమె చర్య ఆమె రాజనీతిజ్ఞతకు అద్దం పడుతోంది.
నిజాం కుటుంబానికి ఆత్మీయురాలు మామా జమీల
19వ శతాబ్దంలో ప్రజలలో పలుకుబడి సంపాదించిన మహిళ మామా జమీల. అంతపుర స్త్రీ అయిన ఈమె రాజకుమారుల ఆలనా పాలన చూసేది. ఆమెకి నిజాం దగ్గర ఎంతో చనువు ఉండేదని తెలుస్తోంది. అధికారులకు, మంత్రులకు కూడా వారం రోజుల వరకు వేచి ఉంటే కాని దొరకని నిజాం దర్శనం చిటికెలో ఆమెకు లభించేది.
కవికోకిల సరోజిని
20వ శతాబ్దంలో అందరి మెప్పు పొందిన మహిళ సరోజినీనాయుడు. తన మృదుమధురమైన కవిత్వం, బ్రిటిష్ ప్రభుత్వంపై జరిపిన రాజకీయ పోరాటాలు మర్చిపోలేనివి. హైదరాబాద్‌ని నిజాం పరిపాలిస్తున్న కాలంలో నెలకొని ఉన్న మత సామరస్య పరిస్థితుల గురించి మంచి కవిత్వం రచించి 'రంజాన్ దర్బార్' వినిపించి ప్రశంసలందుకున్నారీమె. ఈ కాలంలోనే జాతీయోద్యమంతో పాటు మహిళోద్ధరణకు కూడా కంకణం కట్టుకున్న మరో మహిళ దుర్గాభాయ్ దేశ్‌ముఖ్. మహిళా చైతన్యానికి, హక్కుల సాధనకు విద్య ఎంత అవసరమో గుర్తించిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆంధ్ర మహిళా సభ పేరిట ట్రస్టును ఏర్పాటు చేసి స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిచ్చింది. ఆంధ్ర మహిళా సభ ఆధ్వర్యంలో ప్రస్తుతం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బిఇడి కళాశాల, లా కళాశాలలతో పాటు నర్సింగ్ స్కూల్ నడుస్తున్నాయి. వైద్యం అందక విలవిల్లాడుతున్న పేద ప్రజల పట్ల దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ సేవా సంకల్పం ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిగా అవతరించింది.
నిలోఫర్ రాణి
1940 ప్రాంతంలో హైదరాబాద్ నగరానికి నిలోఫర్ రాణి మారుపేరుగా మారింది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన కుమారులు అజంఝూ, మొజంఝూలకు టర్కీ దేశానికి చెందిన సుల్తాన్‌అబ్దుల్ మజీద్‌ఖాన్ కూతురు మర్రుషెవర్, మేనకోడలు నిలోఫర్‌లతో ఫ్రాన్స్‌లో వివాహం జరిపించాడు. ఇంగ్లీషు విద్యనభ్యసించిన మర్రుషెవర్, నిలోఫర్ రాణులు ఇస్లాం సంప్రదాయక పరదా పద్ధతికి స్వస్తి చెప్పి పలు సంఘసేవా కార్యక్రమాల్లో, సామాజిక సమావేశాల్లో చురుగ్గా పొల్గొనేవారు. అందులో మొజంఝా భార్య నిలోఫర్ రాణి నిరుపమాన సౌందర్యవతిగానే కాకుండా సాటిలేని మానవతామూర్తిగాను దేశవ్యాప్త గుర్తింపు పొందింది. పసిపిల్లల పట్ల ఆమెకున్న మక్కువ ఫలితంగా నిలోఫర్ నెలకొల్పిన ట్రస్టు ద్వారా ఏర్పాటైన ఆరోగ్య కేంద్రం నేటికీ రాష్ట్రంలో అత్యుత్తమ పెడియాట్రిక్ ఆస్పత్రిగా నిలిచిపోయింది. హైదరాబాద్ నగర స్వాతంత్య్రానంతర రాజకీయ కార్యకలాపాల్లో సైతం మహిళలు గణనీయమైన చైతన్యాన్ని కనబరచారు. అంబేద్కర్ ఆశయసాధన కోసం ఏర్పాటైన భారతీయ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర శాఖ నాయకురాలిగా మంత్రిగా డాక్టర్ జె.ఈశ్వరీబాయి జాతీయ గుర్తింపు పొందారు.
కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల హయాంలో ముస్లిమేతరుల ప్రాధాన్యత
''హైదరాబాద్ ప్రజలు ఒక ప్రత్యేక సంస్కృతిని రూపొందించుకొన్నారు. ఇతర సంస్కృతుల వలెనే ఇందులో కూడా మంచి-చెడు రెండూ ఉన్నాయి. నవభారతంలో 'దర్బారీ' సంప్రదాయాలకు స్థానంలేదు. క్రమేణా ఆ సంప్రదాయాలకు బదులు నూతన పరిస్థితులకు అనుగుణమైన పద్ధతులను అనుసరించాలి. అయితే, హైదరాబాద్ సంస్కృతిలో మంచి కూడా ఉంది. దానిని ఏ విధంగానైనా వత్తిడితోనైనా సరే కొనసాగించాలి. మిశ్రమ సంస్కృతి ఇలాగే ఉండేటట్లు చూడాలి. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది'' ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా 1956లో నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి. హిందూ, ముస్లింల మధ్య ప్రేమకు చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలు ఈ ప్రాంతాన్ని మత సహనానికి ప్రతీకగా తీర్చిదిద్దడానికి అహర్నిశలూ కృషి చేశారు. వారి తర్వాత అధికారంలోకి వచ్చిన అసఫ్‌జాహీలు సైతం ఇదే ఆనవాయితీని కొనసాగించడంతో హిందూ, ముస్లింల మధ్య విడదీయరాని బంధమేర్పడింది. ఉభయ మతాల ఆచార వ్యవహారాలు కూడా మిళితం కావడంతో దేశంలోనే ప్రత్యేక తరహా సంస్కృతి ఇక్కడ నిలదొక్కుకుంది. ఇతర రంగాల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో పాలకులు ఉభయ మతాల వారికి సమానమైన అవకాశాలు కల్పించారు. ముస్లింలైన కుతుబ్‌షాహి, అసఫ్‌జాహీ పాలకులు కొన్ని ప్రత్యేక విధుల నిర్వహణ కోసం ఇరాన్, అరబ్బు దేశాల నుంచి నిష్ణాతులను రప్పించుకొన్నప్పటికీ, హిందువులకు సైతం ప్రధాన పదవులిచ్చి అర్హతకు తగినట్లు ఆదరించారు. కుతుబ్‌షాహీలైతే తాము స్వయంగా తెలుగు భాషను నేర్చుకొని పాలనా వ్యవహారాలలో తెలుగు భాషను ప్రవేశపెట్టారు. కుతుబ్‌షాహీల పాలనా కాలంలో అక్కన్న, మాదన్నల కున్న ప్రాధాన్యాన్ని తెలంగాణా ప్రాంతంలో నేటికీ కథలుగా చెప్పుకొంటారు. సోదరులైన అక్కన్న, మాదన్నలు ఒకరు ప్రధానమంత్రిగా, మరొకరు రెవిన్యూ మంత్రిగా అబుల్‌హసన్ తానీషాకు మార్గదర్శకత్వం చేశారు. వారి సమీప బంధువైన భద్రాచలం ప్రాంత తహసీల్దారు కంచర్ల గోపన్న భద్రాద్రి రామాలయ నిర్మాణానికి ప్రభుత్వ ధనాన్ని వినియోగించాడు. ప్రభుత్వ ధనంతోనే సీతారాములకు అనేక అమూల్యాభరణాలను తయారు చేయించాడు. ఈ అపరాధానికి గోపన్నకు 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ప్రభుత్వ సంపదంతా రత్నాభరణాల రూపంలో భద్రాచలంలో భద్రంగా ఉందని తెలిసినా దాన్ని కొల్లగొట్టించకపోవడం తానీషా మత సహనానికి తార్కాణంగా పేర్కొంటారు. అసఫ్‌జాహీల పాలనాకాలంలో జమీందారులు, జాగీర్దార్లలో అధికశాతం హిందువులే. అనేక పాలనా పరమైన సంస్కరణలను ప్రవేశపెట్టి జనరంజకుడైన పాలకుడిగా పేరొందిన మీర్ మహబూబ్ అలీఖాన్, మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ల పాలనా కాలంలో హైదరాబాద్ సామ్రాజ్యానికి మహరాజ సర్ కిషన్ ప్రసాద్ బహద్దూర్ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. హైదరాబాదీలు ప్రసాద్ అనే పదాన్ని 'పర్‌షాద్' అని పలుకుతారు. షాద్ అనే పదానికి అంకితం అనే అర్థం ఉంది. అందుకే చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తరచూ తన ప్రధానమంత్రి కిషన్ ప్రసాద్‌తో 'ఆప్ కిషన్ పర్‌షాద్ హైతో మై ఖుదా పర్‌షాద్ హూఁ' (నువ్వు కృష్ణుడికి అంకితమైతే, నేను భగవంతుడికి అంకితమైనవాడిని). నీకు నాకు తేడా ఏముందని అనేవారుట. 1985 నుంచి హైదరాబాద్ నగరంలోను సంస్థానంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకన్నా హిందువుల సంఖ్యే అధికమని నాటి రికార్డులు తెలుపుతున్నాయి. చివరికి నగర పోలీస్ కమిషనర్ (కొత్వాల్)గా పాలనా బాధ్యతలు సైతం నిర్వహించిన రాజా బహద్దూర్ వెంకట్రామరెడ్డి మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొలువులో సమర్థుడైన అధికారిగా పేరొందారు.
చారిత్రక కట్టడాలు
మక్కా మసీదు
భారతదేశంలో మూడోది, దక్షిణ భారతదేశంలో అతిపెద్దది మక్కా మజీదు. సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా ఈ మసీదుకు 1614లో పునాది వేసినా, 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దీని నిర్మాణం పూర్తిచేశాడు. అప్పట్లో ఈ మసీదు నిర్మాణానికి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు చెబుతారు. పదివేలమంది ఒకేసారి ఈ మసీదులో ప్రార్థనలు చేసే వీలుంది. దరోగ్ మీర్, ఫైజుల్లాబేగ్, చౌదరి రంగయ్య నేతృత్వంలో ఈ మసీదు నిర్మాణం ప్రారంభమైంది. మక్కా నుంచి తెచ్చిన ఇటుకలను పవిత్ర చిహ్నంగా మసీదు మధ్యలో ఉంచారు. మసీదు అసలు పేరు బైతుల్ అతిక్ అయినప్పటికీ మక్కానుంచి తెప్పించిన ఇటుకలు ఇందులో ఉండడంతో ఈ మసీదు మక్కా మజీద్ అని పిలుస్తున్నారు. మసీదులో ఉన్న కొలను, అందమైన పదిహేను కమాన్‌లు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
నాటి దాద్‌మహల్ నేటి హైకోర్టు
మూసీ నది దక్షిణ ఒడ్డున రాష్ట్ర హైకోర్టు ఉంది. కుతుబ్‌షాహీల కాలంలో ఈ స్థలంలోనే దాద్‌మహల్ (న్యాయమందిరం) ఉండేది. మహ్మద్ కులీ స్వయంగా ఇందులో కూర్చుని తీర్పు చెప్పేవాడట. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1919లో ప్రస్తుత హైకోర్టు భవనాలను నిర్మించాడు. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చయింది. ఇండో ఇస్లామిక్ వాస్తుకు ఈ భవనాలు సంకేతం. ఎరుపు, తెలుపు రంగు రాయితో, పైన బురుజులు, మినార్‌లతో ఎంతో ఆకర్షణీయంగా, గాంభీర్యం ఉట్టిపడేవిధంగా ఈ భవనాన్ని నిర్మించారు.
చార్‌కమాన్
కుతుబ్‌షాహీల రాచరిక వైభవానికి, కళారాధనకు ప్రతీక చార్‌కమాన్. చార్మినార్ దగ్గర నలుదిక్కుల ఉన్న నాలుగు తోరణ ద్వారాలను కలిపి చార్‌కమాన్ అని పిలుస్తారు. కులీకుతుబ్‌షా 1594లో ఈ చార్‌కమాన్‌ను కట్టించారు. నాటి కళాకారుల సృజనాత్మకత, నైపుణ్యం ఈ కట్టడంలో అణువణువునా కనిపిస్తాయి. అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ తోరణ ద్వారాలకు ఉన్న పేర్ల వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. కుతుబ్ షాహీలు తమ అదృష్టానికి చిహ్నమైన చేప పేరుతో ఉత్తరాన ఉన్న కమాన్‌కు మచ్లీకమాన్ అని పేరుపెట్టారు. తూర్పున ఉన్న తోరణ ద్వారానికి నఖర్‌ఖానా ఎ షాహీ, ప్రస్తుతం దీనిని కాలీ కమాన్ అని, పడమటి వైపున ఉన్న ద్వారానికి షేర్-ఎ-బాతిల్‌కీ కమాన్ అని దీనినే సింహద్వారం అని పిలిచేవారు. కుతుబ్‌షాహీల ప్రధాని మీర్‌మోమిన్ ఈ సింహద్వారాన్ని బంగారు నగిషీలతో, బొమ్మలతో అలంకరింపజేశాడని చరిత్ర చెబుతోంది. చార్‌కమాన్ లోపల ఉన్న రాజభవనాల సముదాయాన్ని దుష్టశక్తుల బారినుంచి కాపాడటానికిగాను సింహద్వారం వద్ద నున్న పెద్దస్తంభం మీద ఖురాన్‌లోని పవిత్రమైన వచనాలను చెక్కించారు. దక్షిణం వైపున ఉన్న ద్వారాన్ని మేవా వాలా కమాన్ లేదా చార్మినార్ కమాన్ అని పిలుస్తారు. జామా మసీదుకు కూడా ఇది ప్రవేశ ద్వారం. నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలున్నందున ఈ ప్రాంతాన్ని చార్‌కమాన్ అని పిలుస్తున్నారు. ఈ ప్రాంతం ప్రస్తుతం గుల్జార్‌హౌజ్ అనే పేరుతో వాడుకలో ఉంది. 1687లో ఈ ప్రాంతం మీద మొఘల్‌సేనలు దాడిచేసి రాజభవనాలను ధ్వంసం చేశాయి. ప్రస్తుతం ఇక్కడ మిగిలిపోయిన రాజభవనాల ముందరి గదుల్లో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. ముత్యాలు, వెండి, బంగారు నగలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. కుతుబ్‌షాహీల గత వైభవానికి ప్రతీకలుగా నిలిచిన ఈ తోరణ ద్వారాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవలే మరమ్మతులు చేశారు. వేగంగా సాగే నగర జీవితంలో నాలుగు కాలాలపాటు నిలిచిన ఈ చార్‌కమాన్‌కు ఈనాటికి చెప్పుకోదగిన ప్రాశస్త్యం ఉంది.
మొఘల్‌పురా సమాధులు
కుతుబ్‌షాహీ శైలిలో మొఘల్‌పురాలో నిర్మించిన రెండు సమాధుల్లో నిమతుల్లాగా ప్రసిద్ధికెక్కిన ఖుతుబుద్దీన్ సమాధి ఒకటి కాగా, రెండో సమాధి ఆయన అల్లుడు మీర్జా షరీఫ్‌ది. ఐదు అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపై ఈ సమాధులను నిర్మించారు. ప్రిన్స్ అబ్దుల్లా జన్మించినప్పుడు ఆయనకు పన్నెండేళ్లు వచ్చేదాకా తండ్రి మహ్మద్ ఖుతుబ్‌షా (1612-1626)ను చూడకూడదని జ్యోతిష్యులు సూచించారట. ఛాందసానికి పోయి ఖుతుబ్‌షా ఈ మాటలు నమ్మి అబ్దుల్లాను తన సోదరుడు మీర్ కుతుబుద్దీన్ వద్ద విద్యాభ్యాసానికి వుంచాడని చెబుతారు. అయిదు సంవత్సరాల తర్వాత 1618లో కుతుబుద్దీన్ మృతిచెందాడు. మొఘన్‌పురా సమాధులను సున్నంతో లలితమైన పనితనంతో చక్కని కమానులతో ఆకర్షణీయంగా నిర్మించారు.
పురానా హవేలి
ఛత్తాబజార్, డబీర్‌పురా ప్రధాన రోడ్డు మధ్యలో పురానాహవేలి ఉంది. ఒకప్పుడిది కులీకుతుబ్‌షా కాలంలో హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఉన్న మీర్ మొమిన్ నివాసం. సుమారు మైలు పొడవునా ఎత్తయిన గోడ ఉండడంవల్ల ఈ భవన శోభ బయటికి కనిపించదు. 1717లో రెండో నిజాం మీర్ నిజాం అలీఖాన్ మోమిన్ వంశానికి చెందిన రుకునుద్దౌలా నుంచి మీర్‌ఆలం సేకరించాడు. ప్రధాన భవనం పద్దెనిమిదో శతాబ్దపు యూరోపియన్ వాస్తు శిల్పానికి ప్రతీక. సికిందర్‌జా కొంతకాలం ఇక్కడ ఉండి, తన నివాసాన్ని ఖిల్వత్ మహల్‌కు మార్చడంతో ఈ భవనాలకు పురానా హవేలీ అనే పేరు వచ్చింది. ఈ భవన సముదాయంలో ఐనా ఖానా (అద్దాల నిలయం), చినిఖానా (చీనా గ్లాసు నిలయం) నిర్మించాడు. నాలుగో నిజాం నసీరుద్దౌలా ఈ భవనాల్లోనే జన్మించాడు. ఆ తరువాత ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా ఈ భవనాలపై మోజుపడి, వీటిని తన నివాసంగా మార్చుకున్నాడు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భవనాల్లో అనేక నిర్మాణాలు చేపట్టాడు. ఇందులో విశాలమైన తోట కూడా ఉంది. దీని వైశాల్యం లక్షా నలభై ఐదు వేల చదరపు గజాలు. 1971లో ఈ భవన సముదాయాన్ని మీర్ బర్కత్ అలీఖాన్ ముఖరంజా ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. ఈ భవన సముదాయంలోని మొదటి భవనంలో గ్రంథాలయం, ట్రస్టు కార్యదర్శి నివాసం ఏర్పాటుచేశారు. రెండో భవనంలో ప్రిన్స్ అజమత్ జా గ్రంథాలయం నడుస్తోంది. మూడో భవనంలో అన్వరులూం మహిళా కళాశాల, ఆరోభవనం అజ్మత్ జా భవన సముదాయంలో సెట్విన్ కార్యాలయం, ఏడో భవనంలో నిజామియా మహిళల విద్యాసంస్థ నడుస్తోంది. అసఫ్‌జాహీ రాజుల పాత ఫర్నీచర్ ఈ భవనాల్లో ఉంది. పురానా హవేలీ మొత్తం ముఖరంజా ట్రస్ట్ ఆధీనంలో ఉంది. తూర్పువైపు పైఅంతస్తులో జూబ్లీ పెవిలియన్ మ్యూజియం, పశ్చిమ వైపు పైఅంతస్తులో ముఖరంజా సాంకేతిక విద్యాసంస్థ ఉన్నాయి.
తానీషా గురుభక్తికితార్కాణం
ఆస్మాన్-ఇ-హజ్రత్ సయ్యద్ షా మహ్మద్ షా రాజు హుస్సేనీ దర్గాపై ఉన్న గుమ్మటం జంటనగరాల్లోనే అతిపెద్దది. షాగంజ్‌లో ఉన్న ఈ దర్గా ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని ఎత్తు 170 అడుగులు. ఈ దర్గాను చూడగానే ఒక్కసారిగా కుతుబ్‌షాహీ సమాధులు గుర్తుకువస్తాయి. ఈ దర్గాను కుతుబ్‌షాహీ వంశంలో చివరి రాజైన అబుల్ హసన్ తానీషా తన గురువు సయ్యద్‌షా మహ్మద్ షా రాజు హుస్సేనీ స్మారకార్థం సుమారు 350 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ దర్గాకు 110 రాతిస్తంభాలు ఉన్నాయి. తానీషా బాల్యంలో దాదాపు 14 సంవత్సరాలపాటు గురువు దగ్గరే గడిపినట్లు ఆ సమయంలో పేదరికంలో మగ్గుతున్న తానీషాకు ఏదో ఒకరోజు తప్పకుండా రాజువవుతావని ఆయన గురువు చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. తానీషా రాజు అయి, ఆతర్వాత మొఘల్ చక్రవర్తి చేతిలో ఓటమి పాలయిన తరువాత తన కరవాలాన్ని, తలపాగాను తెచ్చి గురువు సన్నిధిలో ఉంచినట్లు చెబుతారు. వాస్తురీత్యా, చరిత్ర దృష్ట్యా ఈ దర్గాకు ప్రత్యేకత ఉంది.
జహనుమా
ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ఉత్తరంలో షమా థియేటర్‌కు ఎదురుగా ఉన్న అందమైన భవనం జహానుమా ప్యాలెస్, పైగా నవాబు రెండో షమ్స్-ఉల్-ఉమ్రా (నవాబ్ ఫకృద్దీన్ ఖాన్) ఈ భవనాలను యూరోపియన్ శైలిలో నిర్మించారు. సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రస్తుతం పూర్తిగా శిథిలమై పోయింది. ఈ అపురూప భవనాన్ని నవాబు తన అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించాడు. ఈ భవన సముదాయం ప్రాంగణంలో బాగే జహనుమా పేరిట ఓ తోట ఉండేదట. అనంతరం ఈ భవనంలో అజంతా సినీ స్టూడియోను ఏర్పాటుచేసి తొలిసారిగా లలిత శివజ్యోతి వారి 'రహస్యం' సినిమాను నిర్మించారు. నిర్వహణలోపం వల్ల గోడలు శిథిలమై పడి పోతున్నాయి. ఈ ప్యాలెస్‌లో గతంలో అపురూపమైన విగ్రహాలు అనేకం ఉండేవి. కొంతమంది ప్యాలెస్ కమాన్‌లు తప్ప మిగిలిన భవనాలను కూల్చివేసి కబ్జాచేసి ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మించారు.
సిటీ కాలేజీ
నగరంలో ఆధునిక భవన నిర్మాతగా వాసికెక్కిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో 1921లో ఈ భవనాలను నిర్మించారు. అప్పట్లో ఉన్నత పాఠశాల కోసం నిర్మించిన ఈ భవనాల్లో ప్రస్తుతం ప్రభుత్వ నగర కళాశాల (సిటీ కాలేజీ) నడుస్తోంది. ఆరోజుల్లో ఈ భవన నిర్మాణానికి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ కళాశాల మూసీనది ఒడ్డున, హైకోర్టు పక్కన ఉంది. హిందూ-ముస్లిం వాస్తు శైలుల మేలుకలయికకు ఈ భవనాలు ప్రతీకగా నిలిచాయి.
లాడ్‌బజార్
చారిత్రక చార్మినార్ కట్టడానికి పశ్చిమాన ఉన్న లాడ్‌బజార్ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే గాజులు దేశవిదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. లాడ్‌బజార్‌లో అంతర్జాతీయ గాజుల ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఈ ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన గాజుల తయారీదారులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ గాజుల ప్రదర్శన జరిగినా ఇక్కడి వ్యాపారులు అందులో పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ గాజుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా వర్థిల్లుతోంది. అనేకమంది గాజులు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దేశవిదేశాల నుంచి నగరానికి వచ్చే సందర్శకులు ప్రధానంగా మహిళలు చార్మినార్‌తో పాటు ఇరువైపులా గాజుల దుకాణాలతో సందడిగా కనిపించే లాడ్‌బజార్ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. నిత్యం వ్యాపార లావాదేవీలతో బిజీగా కనిపించే లాడ్‌బజార్‌ను పెడెస్ట్రెయన్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చి మరింత శోభను చేకూర్చి నైట్‌బజార్‌గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్‌అలీఖాన్ తన భార్య లాడ్లీ బేగం పేరుమీద, ఈ ప్రాంతానికి లాడ్‌బజార్ అని పేరు పెట్టారు.
జజ్గీఖానా ఆసుపత్రి
ఇండియాకు తొలి బ్రిటీష్ రాణి విక్టోరియా జ్ఞాపకార్థం జజ్గీఖానా ఆసుపత్రిని 1902లో ఏర్పాటుచేసినట్లు ఒక వాదన ఉండగా 1906లో మూసీనది ఒడ్డున అమీన్‌బాగ్‌లో ప్రిన్సెస్‌వేల్స్ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగినట్లు మరో వాదన ఉంది. తన కూతురు అనారోగ్యం కారణంగా ఆరో నిజాం మహబూబ్ అలీపాషా ఈ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదని చెబుతుంటారు. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినపుడు ఆసుపత్రిలో చాలా భాగం కొట్టుకుపోయి; అందులో చికిత్స పొందుతున్న రోగులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో 1911లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ఆసుపత్రిని పునర్నిర్మాణం చేశారు. ఈ ఆసుపత్రి పాతనగర మహిళలకు వరప్రసాదంగా భావించవచ్చు. లోగడ ఈ ఆసుపత్రి నిర్మించిన స్థలం సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ప్రధాని అమీన్-ఉల్-ముల్క్ సొంత ఆస్థి కావడంతో ఈ ఆసుపత్రిని కొందరు అమీన్‌బాగ్ ఆసుపత్రిగా వ్యవహరిస్తారు. ఈ ఆసుపత్రి పాతభవనాలు మొగల్‌వాస్తుకు సంకేతంగా నిలిచాయి. అనంతరం ఈ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేసి మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నారు. దీనిని జజ్గీఖానా అని పిలుస్తున్నారు.
యునాని ఆసుపత్రి
చరిత్ర ప్రసిద్ధికెక్కిన అపూర్వ కట్టడం యునాని ఆసుపత్రి భవనం. చార్మినార్‌కు ఆగ్నేయంలో, మక్కా మసీదుకు ఎదురుగా ఈ అందమైన కట్టడం ఉంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్‌అలీ ఖాన్ కాలంలో 1928లో ఈ భవనాన్ని ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. దేశంలో ప్రసిద్ధిపొందిన యునాని, ఆయుర్వేద ఆసుపత్రులు ప్రస్తుతం ఈ భవనాల్లో ఉన్నాయి. ఇండో-ఇస్లామిక్ వాస్తుకు ఈ భవనాలు ప్రతీక. ప్రభుత్వ నిజామియా యునాని ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ ఈ భవనంలో ఉన్నాయి.
శ్యాంరాజ్ గేట్
నిజాం ప్రభుత్వంలో రెవిన్యూశాఖను నిర్వహించిన రాజా శ్యాం రాజ్‌బహద్దూర్ తన భవనం ముందు ఆకర్షణీయమైన భారీ గేటును 1904 ఏప్రిల్‌లో నిర్మించారు. దీనిపై అదే ఏడాది పెద్దసైజు గడియారాన్ని ఏర్పాటుచేశాడు. శాలిబండలో గల శ్యాంరాజ్ భవనం శిథిలమైపోయింది. శిథిలం కాగా మిగిలిన ముందు భాగం, దాని ముందు గేటు, పైన గడియారం నేటికీ మనకు కనిపిస్తాయి. చిన్నసైజు మినార్‌ను పోలిన నిర్మాణం మధ్యలో ఈ గడియారాన్ని అమర్చారు. దీనిపై గుమ్మటాన్ని పోలిన కట్టడం ఉంది. ఇండో-యూరోపియన్ శైలిలో ఈ గేటును నిర్మించారు. జీర్ణమైపోయిన భవనం స్థానంలో దుకాణాలు, నివాసగృహాలు వెలిశాయి.
చిడియా బజార్
పక్షుల కిలకిల రావాలతో, అమ్మకం, కొనుగోలుదారులతో నిత్యం కిటకిటలాడుతూ కనిపిస్తుంది చిడియా బజార్. చార్మినార్‌కు సమీపంలో ఉన్న ఈ బస్తీకి అరవై సంవత్సరాల చరిత్ర ఉంది. వందకు పైగా రకాల అందమైన పక్షుల క్రయవిక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. పక్షుల అమ్మకాన్ని జీవనాధారంగా చేసుకున్న ఇక్కడి వ్యాపారులు కొనుగోలు దారుల అభిరుచిని బట్టి వారికి కావలసిన పక్షులను పెంచి విక్రయిస్తుంటారు. రకరకాల పక్షులు, పావురాలు ఇక్కడ లభిస్తాయి. అరుదైన పక్షులకు నిలయంగా పేరుగాంచిన చిడియాబజార్‌లో పక్షులను అమ్మడంతోపాటు, సినిమా షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. పాపపుణ్యాలపై నమ్మకం ఉన్నవారు పక్షులను కొనుగోలు చేసి వాటిని స్వేచ్ఛగా వదిలేస్తారు. పక్షుల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు పక్షులు కొని పెంచుకుంటారు. రంగురంగుల పక్షులకు కేంద్ర బిందువుగా మారిన చిడియా బజార్ పాతనగర పూర్వవైభవానికి ప్రతీక.
దారుల్‌షిఫా
దారుల్‌షిఫాలో ఉన్న బల్దియా పాత భవనాలను నిర్మించి వందేళ్ళు దాటింది. 1878లో కేవలం రాజవంశీయుల కోసం ఏర్పాటుచేసిన పాఠశాల- మదర్‌సా-ఐ-ఐజా ఇందులో ఉండేది. ఈ పాఠశాలను సర్ నిజామత్ జంగ్ ఏర్పాటుచేశాడు. ఆ తరువాత ఈ భవనాలను టంకసాలగా మార్చారు. ప్రస్తుతం విక్టోరియా జెనానా ఆసుపత్రి ఉన్న భవనంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయాన్ని 1906లో దారుల్‌షిఫాలోని ఈ భవనాలకు తరలించారు. ట్యాంక్‌బండ్ వద్ద నూతన భవనాలను నిర్మించిన అనంతరం నగరపాలకసంస్థ కార్యాలయాన్ని ఇక్కడినుంచి అందులోకి మార్చారు. గతంలో టంకసాల ద్వారం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానికి పక్కనే ఉండేది. పశ్చిమవైపున అజఖానా-జోహర వైపుగల భవన భాగం నూతనంగా నిర్మించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కొనసాగిన ఈ భవనాల్లో ప్రస్తుతం కులీకుతుబ్‌షా పట్టణావృద్ధి సంస్థ ('కుడా') కార్యాలయం ఉంది.
పురానీ ఈద్గా
కుతుబ్‌షాహీల కాలంలో సుమారు 300 సంవత్సరాల క్రితం పురానీ ఈద్గాను నిర్మించారు. ఈదిబజార్‌లో ఉన్న ఈ పురానీఈద్గా భవనం చిన్నదే అయినప్పటికి దీనికి ఉన్న రెండు భారీ మినార్లు చూస్తే చార్మినార్ కళ్ళలో మెదులుతుంది. కుతుబ్‌షాహీ వాస్తులో అపురూపంగా నిర్మించిన ఈ కట్టడం మతరీత్యా కూడా జంటనగరాలలో ఎంతగానో ప్రశస్తి పొందింది.
చౌమహల్లా సౌధాలు
అసఫ్‌జాహీ నవాబుల రాజసానికి, మొగలాయి రీతి శిల్ప పాటవానికి, సౌందర్యానికి ప్రతీక చౌమహల్లా భవనాలు. మక్కామసీదు నుంచి ఖాజీపురా వరకు రెండు లక్షల తొంబై వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం వ్యాపించి ఉండేది. చౌమహల్లా ప్యాలెస్‌ను 1750లో సలాబత్‌జంగ్ నిర్మించారు. చతుష్కోణమైన ఉద్యానవనానికి నాలుగువైపులా నాలుగు భవనాలు సుందరంగా నిర్మించారు. చౌమహల్లా అంటే నాలుగు భవనాలు అని అర్థం. 1857-1869 మధ్యకాలంలో ఐదో నిజాం హయాంలో ఈ నాలుగు భవనాలను నిర్మించారు. ఈ నాలుగు భవనాలు అఫ్‌తబో మహల్, మహతబో మహల్, తహనియత్ మహల్, అఫ్జల్‌మహల్. ఈ నాలుగు భవనాలు టెహరాన్ షా భవనాలకు నమూనా. ఈ నాలుగు భవనాలు ఒక్కో రంగులో ఉండేవి, ఈ వర్ణాలు కలిసే గాజు చాండిలియర్లు రాత్రనక, పగలనక వెలుగుతుండేవి. ఫ్రెంచి కాలపు ఫర్నీచర్, సీలింగ్‌పై లతలు, రంగురంగుల పుష్పాల నమూనాలు, నీళ్లు చిమ్మే ఫౌంటెయిన్‌లు, ఎత్తయిన పాలరాతి కుండీలు ఉండేవి. ఈ భవన సముదాయంలో షాహిచాయల్ ఖిల్‌వత్ చెప్పుకోదగింది. ఖిల్‌వత్‌లో రాజదర్బారు నిర్వహించేవారు. చౌమహల్లా ద్వారం జిలూఖానా ద్వారా లాడ్‌బజార్‌లో ఉండేది. ఖిల్వత్‌లో చలువ రాయి సింహాసనంపై కూర్చుని నిజాం దర్బారు నిర్వహించేవాడు. జిలుఖానా, దౌలత్‌ఖానా-ఇ-అలీని మొదటి ఆసఫ్ జాహీ కాలంలో 1724-1748లో నిర్మించారు. రోషన్‌బంగ్లా, షాదీఖానా, రోషన్‌మహల్ దివాన్-ఇ-ఆమ్ 1763-1803 మధ్యకాలంలో నిర్మించారు. 1912లో చౌమహల్లా భవనాల మరమ్మతు, కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. కొత్త నిర్మాణాలను 1926లో మూడో నిజాం ప్రారంభించాడు. ఖిల్వత్, పంచమొహల్లా ప్రాంతాలు చౌమహల్లా, భక్షీబేగంహవేలీ, మంజిలీ బేగం హవేలీ, మోతీబంగ్లా, తోషాఖానా-మహల్ కుల్-ఇ-పిరావ్, రసగ్‌మహల్ తదితర భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన భవనం ఒకటే కనిపిస్తుంది. మిగతా భాగం కబ్జాలకు గురైంది.
ఫలక్‌నుమా ప్యాలెస్
ఫలక్‌నుమా అంటే 'ఆకాశదర్పణం' అని అర్థం. ప్రపంచంలోని అత్యంత అందమైన, రాజఠీవి ఉట్టిపడే భవనాలలో ఫలక్‌నుమా ప్యాలెస్ ఒకటి. చార్మినార్‌కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో చాంద్రాయణగుట్టవెళ్ళే మార్గంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను పైగా వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్‌వికారుల్ ఉమ్రా ఇక్బాదుదౌలా బహదూర్ నిజాంమీర్ మహబూబ్ అలీఖాన్‌కు కానుకగా ఇచ్చారు. దీన్ని హైదరాబాద్ రాజులు అతిథి గృహంగా వాడారు. బ్రిటిష్ ఐదో కింగ్ జార్జ్, క్వీన్‌మేరీ, ఎనిమిదో కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్‌వేవెల్, తొలి భారత గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ లోగడ ఈ భవనంలో విడిది చేయడం విశేషం. చిన్నకొండపై నిర్మించిన ఈ భవనంపైనుంచి చూస్తే నగరం సమస్తం కనుచూపుమేర కనిపిస్తుంది. ఈ ప్యాలెస్‌కు 1884 మార్చి 3వ తేదీన పునాది వేసి, 1893 నాటికి నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు ఖర్చయినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భవనాల్లోనే ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా 1911లో మరణించాడు. మూడు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్ నిర్మాణంలో ఇటాలియన్ పాలరాయి, ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన కలపను ఉపయోగించారు. సీలింగ్‌ను, కుడ్యాలను ఫ్రెంచి వారితో చేయించారు. డ్రాయింగ్ రూంలో ఆభరణాలతో అలంకరించిన అపురూపమైన అద్దం ఉంది. దీని విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా జేడ్ కలక్షన్ కూడ ఇక్కడే ఉంది. సీలింగ్‌పై, కుడ్యాలపై ఉన్న పెయింటింగ్‌లు, చిత్రాలు, విశాలమైన డైనింగ్ హాల్‌లో పెద్ద డైనింగ్‌టేబుల్ దాని చుట్టూ నూటరెండు కుర్చీలు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లోని ఫర్నిచర్ విక్టోరియన్ పద్ధతి పనితనానికి ఆనవాళ్ళు. ప్రస్తుతం ప్యాలెస్ ఉన్న స్థలంలో లోగడ ఖులీ ఖుతుబ్‌షా 1580-1611లో నిర్మించిన కోహెతూర్ భవనం ఉండేది. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ను తాజ్ గ్రూప్‌నకు లీజుకిచ్చారు. ఈ ప్యాలెస్‌లో విందులు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫైవ్‌స్టార్ హోటల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హజరత్ షాజుద్దీన్ దర్గా
మత ప్రవక్త హజరత్ షాజుద్దీన్ దర్గా ఈదిబజార్‌లో ఉంది. నియో ఖుతుబ్‌షాహీ శైలిలో ఈ కట్టడాన్ని నిర్మించారు. హజరత్ మీర్ షుజాఉద్దీన్ సాహెబ్ 1774లో బరంపూర్‌లో జన్మించాడు. మూడో నిజాం నవాబు సికిందర్‌జా కాలంలో 1779లో హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈయన పెరిగి పెద్దయ్యాక మతప్రవక్తగా మారాడు. ఈయన వద్ద ఎంతోమంది శిష్యులుగా చేరారు. నిజాం సైతం ఈయనపట్ల ఎంతో భక్తి, గౌరవాలను పెంచుకున్నాడు. హజరత్ షాజుద్దీన్ తన జీవితాంతం మతప్రవక్తగా మత ప్రచారం చేశాడు. 1848లో మరణించాడు. షాజుద్దీన్ సమాధిని చతురస్రాకారంలో ఎత్తయిన టెర్రాస్‌పై నిర్మించారు. ఈ సమాధికి ప్రతివైపునా మూడు కమానులను నిర్మించారు. దీనికి వాయువ్యంగా ఒక మసీదును, ప్రధాన ద్వారం మొదటి అంతస్తుపై నఖర్‌ఖాన్ (భజంత్రీల గది) నిర్మించారు.
పైగా సమాధులు
నిజాం నవాబు దర్బార్‌లో పాయగాలుగా ప్రసిద్ధిచెందిన జాగీర్ కుటుంబ సభ్యుల సమాధులు రియాసత్‌నగర్‌లో ఉన్నాయి. 1786లో మృతిచెందిన వీరి కుటుంబంలో మొట్టమొదటి నవాబ్ తేజ్ జంగ్ షమ్స్‌ఉల్ ఉమ్రా బహద్దూర్ సమాధి పక్కనే కుటుంబీకులందరి సమాధులు ఉన్నాయి. నవాబ్ రఫీయుద్దీన్‌ఖాన్, నవాబ్‌సర్ ఆస్మాన్‌జా, నవాబ్‌సర్ ఖుర్షీద్‌జా, వికారుద్ ఉమ్రా, జషర్‌జంగ్ బహద్దూర్, తదితరుల సమాధులు ఉన్నాయి. మూడో నవాబ్ షంషుల్ ఉమ్రా, బేగం ఖుర్షీద్‌జా బహదూర్ సమాధులు అతి సుందరంగా నిర్మించడం విశేషం. పైగా సమాధులన్నీ చెట్లమధ్యన ఉన్నాయి. ఈ విశాల ఆవరణకు రెండంతస్తుల ద్వారం వుంది. ''నౌబత్‌ఖాన్''గా వ్యవహరించే ఈ ద్వారంపైన నిర్ణీత సమయాలలో ఢంకా మ్రోగించేవారు. ద్వారాల గచ్చుగోడలలో పొదిగిన చక్కని అలంకరణలు, అల్లిక, కమానులు హైదరాబాద్ వాస్తురీతికి గీటు రాయిగా నిలిచాయి. ప్రస్తుతం ఈ సమాధులు పురాతత్వశాఖ ఆధీనంలో ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన ఈ సమాధులకు ప్రస్తుతం 16 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మతులు చేస్తున్నారు. అపురూపమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించాడు.
మదీనా
ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లాద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి మదీనా అనే పేరు వచ్చింది. ఈ భవన సముదాయంలో ఉన్న అనేక రకాల దుకాణాలు, హోటల్‌వల్ల లభించే అద్దెను ధర్మసంస్థ వసూలు చేసి మక్కా, మదీనా, జెడ్డాలలో అవసరమైన విద్యార్థుల చదువు సంధ్యల కోసం వెచ్చించడానికి పంపించేవారు. అయితే మధ్య ప్రాచ్య దేశాలలో చమురు ఉత్పత్తి బాగా పెరిగిన తరువాత ఇక్కడి నుంచి డబ్బు పంపే సంప్రదాయానికి స్వస్తి పలికారు. పాతనగరంలో ప్రసిద్ధిచెందిన మదీనా హోటల్ ఈ భవనంలోనే ఉంది. నయాపూల్ నుంచి చార్మినార్‌వెళ్ళే మార్గంలో దివాన్ దేవిడీకి ఎదురుగా మదీనా బిల్డింగ్ ఉంది.
దారుల్‌షిఫా
భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ఇన్ పేషంట్ సౌకర్యం గల ఆసుపత్రి దారుల్‌షిఫా. ప్రపంచ ప్రసిద్ధమైన మూడు ఆసుపత్రులలో ఇది ఒకటి కావడం విశేషం. ఉచితంగా వైద్య సేవలు అందించిన ఈ ఆసుపత్రిలో దేశీయ వైద్యులే గాకుండా గ్రీస్, ఇటలీ తదితర దేశాలనుంచి వచ్చిన నిపుణులైన డాక్టర్లు (హకీంలు) పనిచేసేవారు, వారే విద్యార్థులకు వైద్య విద్య నేర్పేవారు. పురానా హవేలీ సమీపంలోని ఉద్యానవనాల్లో ఈ రెండంతస్తుల భవనాన్ని మహ్మద్ ఖులీఖుతుబ్‌షా 1595లో నిర్మించాడు. సుమారు 600 గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని యునానీ వైద్యంలో రెసిడెన్షియల్ కమ్ టీచింగ్ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. ఈ ఆసుపత్రిలో ఒకేసారి 400 మంది రోగులకు వసతి సౌకర్యం ఉంది. కింది భాగంలో డబుల్ బెడ్‌రూంలు, మొదటి అంతస్తులో ఇన్‌పేషంట్ల కోసం గదులు ఏర్పాటు చేశారు. ఉత్తరం నుంచి వచ్చే గాలి రోగుల ఆరోగ్యానికి మంచిదని గదులను ఉత్తరముఖంగా నిర్మించారు. ఈ భవనంలో ఓ మూలన అషూర్‌ఖానా ఉండేది. చిన్నగా చీకటిగా ఉన్న అషూర్‌ఖానా స్థానంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కొత్త దానిని నిర్మించారు. ఈ ఆసుపత్రిని రెండో నవాబ్ నిజాం అలీఖాన్ కాలంలోనే మూసివేశారు. ఈ భవనాలను నిజాం ఎస్టేట్ ప్రధాన కేంద్రంగా సర్ష్-ఇ-ఖాన్‌గా మార్చారు. నిజాం పదాతి దళాలు ఇక్కడ ఉండేవి. 1948లో పోలీసు చర్య తర్వాత ఇక్కడి నుంచి సైన్యాన్ని తరలించారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ప్రస్తుతం ఈ భవనంలోనే ఉంది.
జామే మసీదు
హైదరాబాద్‌నగరంలో నిర్మించిన తొలి మసీదు- జామే మసీదు. చార్మినార్‌కు సమీపంలో ఈశాన్యంలో ఈ మసీదును 1598లో మహ్మద్ కులీకుతుబ్‌షా నిర్మించారు. ఈ మసీదుకు అనుబంధంగా ఒక పాఠశాల, ఒక అతిథి గృహం, టర్కిష్ పద్ధతిలోగల ఒక స్నాన వాటిక నిర్మించారు. ఈ స్నాన వాటిక పూర్తిగా జీర్ణమైపోయినా దాని ఆనవాలు ఇంకా ఉంది. మూడో అసఫ్‌జా సికిందర్‌జా, జామే మసీదుకు మరమ్మతులు చేయించాడు. ఈ మసీదు కుతుబ్‌షాహీ శైలి వాస్తుకు ప్రతీక. ఈ కట్టడంలో ఇండో-పర్షియన్ ప్రధానంగా దక్షిణ భారత వాస్తు సైతం ప్రతిబింబిస్తుంది.
మహరాజా కిషన్‌ప్రసాద్ బహద్దూర్ నివాసం
చార్మినార్‌కు దక్షిణాన కిలోమీటర్ దూరంలో శాలిబండ వద్ద ఈ భవనం ఉంది. యూరోపియన్ వాస్తుశైలిలో నిర్మించిన ఈ సువిశాలమైన, ఆకర్షణీయమైన భవనంలో ప్రస్తుతం సూరజ్‌బాన్ భగవతీబాయి ప్రసూతి ఆసుపత్రి ఉంది. ఈ భవనాన్ని నిజాం కొలువులో ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్ ముత్తాతగారైన మహరాజా చందూలాల్ 1802లో నిర్మించారు. ఇందులోని జిలూఖానాను మొహరం పండుగ సందర్భంగా అందంగా అలంకరిస్తారు. తూర్పు దిశలో ఉన్న ఐనఖానాను డ్రాయింగ్ రూంగా, దాని పైఅంతస్తులో ఉన్న బాలాఖానాను డైనింగ్ హాల్‌గా ఉపయోగించేవారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌లు ఇక్కడినుంచే మొహరం పండుగను పురస్కరించుకుని ఏర్పాటుచేసే లంగర్ ఊరేగింపు తిలకించేవారు. దీనికి ఉత్తరంలో ఖాస్‌బాగ్ ఉండేది. ఇక్కడ అతిథులకు బస ఏర్పాటు చేసేవారు. ఇక్కడ వైస్‌రాయ్ లార్డ్ ఇర్విన్ లాంటి ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. దక్షిణంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన జనానా ఖానా, దానిపక్కన ఖయ్యాం మహల్ ఉంది. వీటిలో అనేక భవనాలు జీర్ణమైపోయాయి. ఇందులోని ''షాద్ మాన్షన్''లో మాత్రం ప్రస్తుతం సూరజ్‌బాన్ ప్రసూతి ఆసుపత్రి ఉంది.
నేటి విమెన్స్ కాలేజి
ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజి ఉన్న భవనం అప్పట్లో బ్రిటిష్ ఉన్నతోద్యోగి క్రిక్ పాట్రిక్ నివాసం. ఆ భవనాన్ని ఆయన ముచ్చటపడి మరీ కట్టించుకున్నాడు. దాన్ని నిర్మించటానికి నిజామ్ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. పాట్రిక్ తాను నిర్మించదలచిన భవనం నమూనాను ఓ పెద్ద కాయితంపై గీసి నిజాం అనుమతికి పంపాడు. నిజాం ఆ ప్లాన్‌ను పరిశీలించి... నిర్మాణానికి అనుమతించలేదు. కారణం ఏమిటో తెలుసుకుందామని దివాన్ మీర్ ఆలంను సంప్రదించాడు పాట్రిక్. ''దొరగారూ! తమరు నిజాం ప్రభువుల భవంతి అంత పెద్దసైజు పేపరుపై ప్లాన్ గీస్తే ఎలా? ప్రభువులకు కోపం వచ్చిందేమో. అందుకే అనుమతించలేదు'' అని చెప్పాడు.
తాను అంత పెద్ద భవంతి కట్టుకోవటం నిజాంకు ఇష్టం లేదని పాట్రిక్‌కు అర్థమైంది. ఈసారి విజిటింగ్ కార్డు అంత చిన్న కాయితం ముక్కపై ప్లాన్ గీసి అనుమతికి పంపాడు.
వెంటనే నిజాం అనుమతి లభించింది. 'కోఠీ ప్యాలెస్ మద్రాసులోని గవర్నమెంట్ హౌస్ కంటే గొప్పగా ఉంది... కలకత్తాలోని గవర్నర్-జనరల్ నివాసానికి సాటి వస్తుందని' సర్ జాన్ మాల్కమ్ అనే పెద్దమనిషి కితాబు ఇచ్చాడు కూడా.
ఇందులోని ఫర్నిచర్ కూడా లండన్ కార్ల్‌టన్ హౌస్‌లో బ్రిటిష్ రాజోద్యోగులు వాడిందే.
చార్మినార్
హైదరాబాద్ పాత బస్తీలోనున్న చార్మినార్ నాలుగు మినార్లతో నిర్మించిన మహాప్రాసాదం. కుతుబ్‌షాహీల కళా పిపాసకు ఇది మచ్చు తునకగా నిలిచిపోయింది. దీనిని 1590-91లో మహమ్మద్ కులీకుతుబ్‌షా నిర్మించారు. చతురస్రాకారంలో నున్న ఈ నిర్మాణంలో నలువైపులా ఒక్కోటి 11 మీటర్లున్న నాలుగు మీనార్లున్నాయి. ఈ మీనార్లు పునాదికి 20 మీటర్ల ఎత్తు నుంచి 11 మీటర్ల వైశాల్యం తో ఉన్నాయి. చార్మినార్‌కు పశ్చిమ దిక్కున ఒక మసీదు ఉంది. ఈ ప్రాసాదం లో మొత్తం 45 ప్రార్థనా ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలలో ప్రజలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటారు. తూర్పు వైపున పెద్ద వరండా ఉంది. హైదరాబాద్ పురాతన చరిత్రకు దర్పణంగా ఈ కట్టడం నిలిచివుంది.
గోల్కొండ కోట
హైదరాబాద్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. ఎత్త్తెన కొండ పై నిర్మించిన ఈ దుర్గం చుట్టూ రక్షణ గోడలున్నాయి. లోపల అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కోట కింది భాగం నుంచి చప్పట్లు కొడితే 61 మీటర్ల పైన ఉన్న వారికి వినిపించడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బహమనీ రాజుల నుంచి కుతుబ్‌షాహీలు ఈ కోటను 1518లో వశపరచుకున్నారు. ఈ కోటలో మొత్తం 87 బురుజులున్నాయి. 69 అడుగుల ఎత్తున్న 8 ద్వారాలున్నాయి. ప్రపంచంలోనే విలువైన కోహినూర్ వజ్రం ఈ ప్రభువుల దగ్గరే ఉండేది. వీరు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన రాజులుగా ప్రఖ్యాతి గడించారరు. ఔరంగజేబు సైన్యానికి చెందిన 20 అడుగుల ఎత్త్తెన రెండు ఫిరంగులు ఇప్పటికీ ఈ కోట వద్ద మనం చూడవచ్చు. మార్చి, అక్టోబరు నెలల్లో ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు, నవంబరు, ఫిబ్రవరి నెలల్లో సాయంత్రం 6.30 గంటలకు అద్భుతమైన సూర్య కాంతిని ఇక్కడ చూడవచ్చు.
మక్కామసీదు
చార్మినార్‌కు నైరుతి దిక్కున 100 గజాల దూరంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మక్కామసీదు ఉన్నది. మక్కా లోని ఒక గొప్ప మసీదు పేరును ఈ మసీదుకు పెట్టారు. 67మీటర్ల పొడవు, 54 మీటర్ల వైశాల్యం ఉన్న ఈ మసీదు 23 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిలో మొత్తం 15 కమాన్లున్నాయి. ఇవి కప్పు కు ఆధారంగా కూడా ఉంటాయి. భారతదేశంలోని గొప్ప మసీదులలో ఇది ఒకటి. ఇందులో ఒకేసారి 10 వేల మంది ప్రార్థనలు చేయవచ్చు. దీనిని చౌదరి రంగయ్య, దరోగా మీర్ ఫైజుల్లా బేగ్ ల సూచనల మేరకు మహమ్మద్ కుతుబ్‌షా నిర్మించాడు. 8 వేల మంది తాపీపనివారు, కూలీలు దీని నిర్మాణంలో పనిచేశారు. అబ్దుల్లా కుతుబ్‌షా, అబుల్ హసన్‌షా కాలంలో నిర్మాణ పనులు ప్రారంభం కాగా క్రీ.శ. 1694లో ఔరంగజేబు కాలంలో పూర్తయ్యాయి.
ఈ నిర్మాణం గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ మసీదు శంఖుస్థాపన ను చేయటానికి అన్ని మతాలకు చెందిన మత పెద్దలను కుతుబ్‌షా పిలిపించారు. జీవితకాలంలోప్రతి రోజు ప్రార్ధన చేసే వ్యక్తిని నిర్మాణానికి శంకుస్థాపన చేయమని ఆహ్వానించాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. తన 12 ఏళ్ల వయస్సు నుంచి మధ్య రాత్రి ప్రార్ధనను కూడా తప్పకుండా చేస్తున్న కుతుబ్‌షానే స్వయంగా చేసినట్లు చెపుతారు.
మాసాబ్ ట్యాంక్
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల మాదిరిగానే 'మాసాబ్‌ట్యాంక్' ప్రాంతానికీ ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. హయత్‌బక్షీబేగం కులీకుతుబ్‌షా ఏకైక కుమార్తె. కులీ కుతుబ్‌షాకు ఆమెపై ఎనలేని ప్రేమ. అల్లారుముద్దుగా కుమార్తెను చూసుకునేవారు. సామాన్య ప్రజానీకం కూడా హయత్‌బక్షీ బేగంను గౌరవంగా చూసేవారు. ఆమెను ప్రేమగా 'మాసాహెబ్' అని వ్యవహరించేవారు. అదే పేరున కట్టిన తటాకమే 'మాసాహెబ్ ట్యాంక్'. మాసాహెబ్ ట్యాంక్ రానురాను వాడుకలో మాసాబ్‌ట్యాంక్‌గా మారింది. ఇప్పటికీ అదేపేరు చలామణిలో ఉంది. మాసాబ్‌ట్యాంక్ పక్కన ఏర్పడిన పార్కును మాసాబ్‌ట్యాంక్ పార్కు అనే పిలిచేవారు. ఈపార్కును ప్రస్తుతం చాచా నెహ్రూ పార్కుగా పిలుస్తున్నారు.
ఔరంగజేబును నిలువరించిన నయాఖిలా
డక్కన్ ప్రాంతాన్ని కులీకుతుబ్‌షాహీలు విజయవంతంగా పరిపాలిస్తున్న సమయం అది. ఈ గోల్కొండ కోటపై మొఘల్ రాజు ఔరంగజేబు కన్నుపడింది. తన దండయాత్రలో ఎన్నో రాజ్యాలను గెలిచిన ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో తన సైన్యాన్ని గోల్కొండ శివారు ప్రాంతాలకు తరలించాడు. ఆ సమయంలో గోల్కొండను పరిపాలిస్తున్న అబ్దుల్లా కుతుబ్‌షా గోల్కొండ కోట ద్వారాలను మూయించాడు. గోల్కొండ కోటపైకి ఫిరంగులను గుప్పించేందుకు ఔరంగజేబుకు ఎక్కడా స్థావరం దొరకలేదు. గోల్కొండ కోటకు ఉత్తర ఈశాన్యం ప్రాంతంలో ఒక ఎత్త్తెన గుట్ట ఉండటం ఔరంగజేబుకు వరంగా మారింది. ఆ గుట్టను స్థావరంగా చేసుకుని గోల్కొండ కోటపైకి ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాడు. ఎన్నిరోజులు గుళ్లవర్షం కురిపించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగాడు. మొగల్ రాజు ఔరంగజేబుకు స్థానం కల్పించిన ఆ గుట్టను గోల్కొండ కోటలో భాగం చేయాలని భావించిన గోల్కొండ రాజు అబ్దుల్ కుతుబ్‌షా ఆ గుట్టచుట్టూ కొత్తగా ప్రహరీగోడ నిర్మించి ఆ ప్రాంతానికి నయాఖిలా (కొత్త కోట) అని పేరు పెట్టారు. గోల్కొండ కోటలో కలసిన ఈ నయాఖిలా సుందరప్రదేశంగా పేర్కొనవచ్చు. సుందరమైన చెరువు, పచ్చిక బయళ్లతో ఎప్పుడూ కళకళలాడే ఈ నయాఖిల్లా మొత్తం 50 ఎకరాలలో ఉంది. ఇక్కడే ప్రపంచప్రఖ్యాతి గాంచిన బూరుగు వృక్షం ఉంది. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే నయాఖిలాకు నవంబరు, మార్చి నెలల్లో రెండు దఫాలుగా విదేశీపక్షులు వలసవస్తాయి. దాదాపు 40 రోజుల పాటు ఇక్కడ గడిపి వెళతాయి. ఆనాటి నిజాం కుటుంబీకులు ఈ నయాఖిలాకు విహారానికి వచ్చేవారట. వందల సంఖ్యలో వలసపక్షులు రావడంతో టూరిజంశాఖ ఈ నయాఖిలాను పక్షుల అవాసకేంద్రంగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే నయాఖిలా ప్రక్కనేగల జమాలి దర్వాజ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్టుకు 200 ఎకరాలు కేటాయించింది. అయితే తమకు మరో 50 ఎకరాలు నయాఖిలా స్థలం కేటాయించాలని కోరగా, కేంద్రపురావస్తుశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. పురాతన కట్టడాలు ఉన్న ఈ నయాఖిలా ప్రాంతంను గోల్ఫ్ సెంటర్‌కు ఇవ్వమని పురావస్తుశాఖ అధికారులు తేల్చిచెప్పారు. టూరిజం శాఖ పక్షుల ఆవాసకేంద్రానికి పురావస్తుశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అతిథి దేవోభవ!
''అతిథి దేవోభవ'' అన్నారు పెద్దలు. మన ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, మన దేశంకు వచ్చే వారిని ఆదరించడం మన ప్రభుత్వం కనీస ధర్మం. ఈ అతిథులను ఆదరించడం పురాతన కాలం నుండి వస్తున్న సంస్కృతి. ఈ అతిథుల కోసం పురాతన కాలంలో ప్రత్యేక భవనాలే నిర్మించేవారట. డక్కన్ ప్రాంతాన్ని విజయవంతంగా పరిపాలించిన కులీ కుతుబ్‌షా రాజులు గోల్కొండ ప్రాంతంలో అతిథుల కోసం నిర్మించిన ''అతిథి భవనం'' తీరును చూస్తే, వారు ఏ స్థాయిలో అతిథులను గౌరవించేవారో అర్థం అవుతుంది. కుతుబ్‌షాహి మూడవ రాజు అయిన ఇబ్రహీం కులీకుతుబ్‌షా తన హయాంలో (1553లో) గోల్కొండ కోటకు ఉత్తర భాగంలో బంజారా దర్వాజకు కిలోమీటరు దూరంలో గోల్కొండ అతిథి భవనాన్ని సువిశాలంగా నిర్మించాడు. బీదరు కోట మార్గంలా నిర్మించిన ఈ అతిథి భవనంలో నూటాయాభై గదులు, గుర్రాలకు వేరుగా గుర్రపు శాలలు, అతిథుల కోసం సువిశాలమైన బావి, ఒక మసీదు, ఒక మందిరం నిర్మించారు. ఇతర రాజ్యాల నుండి వచ్చే రాయబారులు అతిథులు, గోల్కొండ సుల్తాను దర్శనం లభించే వరకు ఈ అతిథి గృహంలో బస చేసేవారుట. సుల్తాను దర్శనానికి అనుమతి లభించిన తర్వాత సైనికులు అతిథుల్ని బంజారా దర్వాజ మార్గం గుండా పాలకుల దర్శనానికి తీసుకువెళ్ళేవారు. అద్భుత కళానైపుణ్యానికి తార్కాణమైన గోల్కొండ అతిథి భవనం నేడు శిథిలావస్థలో ఉంది. రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనశాఖ ఆధీనంలో ఉన్న ఈ భవనం ఆనవాలును కోల్పొయే స్థితిలో ఉంది. అప్పుడప్పుడు తెలుగు చిత్రపరిశ్రమవారు భవనంను విలన్ల స్థావరంగా వాడుకుని షూటింగ్‌లు జరుపుకుంటున్నారు. చిత్రాల షూటింగ్ సమయంలో బాంబులను పేల్చడం వల్ల ఆ శబ్దానికి పురాతన కట్టడంలో బీటలు పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ చారిత్రక భవనంకు మరమ్మతులు చేపడితే భవిష్యత్ తరాలకు ఓ చారిత్రక భవనాన్ని అందించినవారం అవుతాము.
గోల్కొండ సమాధులు
గోల్కొండను పాలించిన రాజుల గుర్తుగా ఈ సమాధులు నిలిచి ఉన్నాయి. గోల్కొండ కోటలోని బంజారా దర్వాజాకు ఉత్తరంగా కిలోమీటర్ దూరంలో ఇవి ఉన్నాయి. అద్భుతమైన కళాసంపదకు ఈ సమాధులలో గోచరిస్తుంది. ఎత్త్తెన మైదానప్రాంతంలో వీటిని నిర్మించారు. రాజుల సమాధులన్నీ ఒకే దగ్గర ఇక్కడ ఉన్నట్లుగా ప్రపంచంలో మరెక్కడా లేవు.ఇక్కడున్న సమాధులు, ఇతర కట్టడాలు పర్షియన్, పఠాన్, హిందు శిల్పకళకు గుర్తులుగా ఉన్నాయి.
ఉస్మానియా మహిళా కళాశాల
కోఠిలోని బ్రిటిష్ రెసెడెన్సీ భవనమే నేటి మహిళా కళాశాల. మేజర్ కిర్క్ పాట్రిక్ రెసిడెంట్ గా ఉన్న కాలంలో దీనిని నిర్మించారు. రాయల్ ఇంజనీర్స్‌కు చెందిన పి.రస్సెల్ దీనిని రూపొందించారు. దీని ప్రధాన ద్వారం ఉత్తరం దిక్కుగా ఉంటుంది.అద్భుత కళానైపుణం ఈ భవనంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
మన హైకోర్టు మూసీ నదికి దక్షిణ ఒడ్డుపై ఉంది.జైపూర్ కు చెందిన శంకర్‌లాల్,స్థానిక ఇంజనీర్ మెహర్ ఆలీ ఫజల్ దీనికి రూపకల్పన చేశారు. ఈ నిర్మాణాన్ని చేపట్టింది ఏడవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ ఆలీఖాన్. నిర్మాణం 1915 ఏప్రిలో ప్రారంభంకాగా మార్చి 1919 లో పూర్తయింది. 1920ఏప్రిల్ 20న నిజాం దీనిని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పునాదులు తీస్తుండగా కుతుబ్‌షాహీ పాలకుల ప్రాసాదాలైన హీనా మహల్, నాడీమహల్ వెలుగు చూశాయి. 1932లో ఈ స్వర్ణోత్సవాలు జరిగాయి,. ఈ సందర్భంగా న్యాయ శాఖ అప్పటి నిజాంనవాబుకు హైకోర్టు వెండి జ్ఞాపికతో బాటు ఒక తాళంచెవిని బహూకరించింది. 100కిలోల బరువున్న ఈ జ్ఞాపిక ప్రస్తుతం పురానా హవేలీలో భద్రపరచబడింది.
రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం
అసఫ్‌జాహీ పేరు మీదుగా ఏర్పాటుచేసిన ఈ గ్రంథాలయాన్ని ప్రస్తుతం రాష్ట్ర గ్రంథాలయంగా పిలుస్తున్నారు. 1891లో దీనిని మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామి స్థాపించాడు. మొదట దీనిని ఆబిడ్స్‌లోని ఒక పాత బంగ్లాలో నెలకొల్పారు. ఈ గ్రంథాలయంలో అరబిక్, ఉర్దు, పర్షియన్, ఇంగ్లీష్ గ్రంథాలతో పాటు అనేక చేతిరాత గ్రంథాలు ఉన్నాయి. తరువాత ఈ చేతిరాత గ్రంథాలను రాష్ట్ర ప్రాచ్య భాండాగారానికి పంపించారు. 1936లో మూసీనది తీరాన నూతన గ్రంథాలయాన్ని స్థాపించారు. 1948లో గ్రంథాలయం పేరును రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం గా మార్చారు.
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల
ఉన్నత విద్యాభ్యాసానికి నెలకొల్పిన గొప్ప విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. దేశంలోని ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. ఈ విశ్వవిద్యాలయంలో కళాఖండంగా నిలిచిపోయే ఆర్ట్స్ కళాశాల ప్రత్యేక ఆకర్షణ. దీనిని 1939లో ఏడవ నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ స్థాపించాడు. మాన్సియర్‌జాస్పర్ అనే బెల్జియం రూపశిల్పి ఆర్ట్స్ కళాశాల భవనానికి రూపకల్పన చేశాడు.వివిధ విభాగాలలో విద్యార్థులకు ఉన్నత విద్యనందిస్తోంది.
ఉస్మానియా ఆసుపత్రి
1925లో ఏడవ నిజాం కాలంలో దీనిని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ఆసుపత్రి ఇది. దీనిలో 1000పడకలు ఉన్నాయి.అత్యాధునిక వైద్యపరికరాలు ఈ ఆసుపత్రిలోఉన్నాయి.
ఫలక్‌నుమా భవనం
దేశంలోని అత్యత్భుత భవనాల్లో ఇది ఒకటి.చార్మినార్‌కు దక్షిణదిశగా 5 కిలోమీటర్ల దూరాన 2000 అడుగుల ఎత్త్తెన కొండపై ఉందిది.19వ శతాబ్దంలో నవాబ్ వికార్-ఉల్-ఉమర్ స్థాపించాడు. ఇటలీ రూపశిల్పి దీనిని రూపొందించగా దీనినిర్మాణంలో ఉపయోగించిన రాయిని ఇటలీ నుంచి తెప్పించారు. దీనిలో వెలకట్టలేని చిత్రలేఖనం, శిల్పాలు,ఆంగ్లేయ వస్తుసామాగ్రి ఉన్నాయి. ఈ భవనం ద్వారా నగరాన్ని మొత్తం చూడవచ్చు. ఆరవనిజాం దీనిని 1897లో కొనుగోలు చేశాడు. తన విశ్రాంతి గృహంగాదీనిని వినియోగించాడు.
చౌ మొహల్లా
చౌ మొహల్లా అంటే నాలుగు భవనాలు అని అర్థం. దీనిని ఐదవ నిజాం నవాబ్ అఫ్జర్ ఉద్-దౌలా బహదూర్ (1857-69)లో నిరించాడు. టెహ్రాన్(ఇరాన్) లోని షా భవనానికి ప్రతిరూపమే ఇది. 1912లో దీనికి మెరుగులు దిద్దారు. నిజాంనవాబులకు అత్యంత ప్రీతిపాత్రమైన భవనమిది. ఏడవ నిజాం సర్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బహదూర్ దీనిని నివాసంగా వినియోగించాడు. అసఫ్‌జాహి పాలనాకాలంలో దీనిలో కొన్ని భాగాలను విదేశీ శైలిలో నిర్మించారు.
కింగ్‌కోఠీ భవనం
ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బహదూర్(1911648) కు నివాసంగా ఉపయోగపడిన భవనమిది. ఈభవన సొంతదారు కమల్ ఖాన్ అనేధనవంతుడు.21ఎవరాలలో విస్తరించిన భవనమిది. నిజాం కాలంలో దీనిని అతిథులను స్వాగతించడానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం దీనిలో కింగ్‌కోఠీ ఆసుపత్రినినిర్వహిస్తున్నారు.కింగ్‌కోఠీలో పలు రకాల యూరోపియన్ కళాకృతులున్నాయి. మూడు భవనాలుగా ఉన్న ఈ కింగ్‌కోఠీ చారిత్రక, కళాకృతులకునిలయమైనది.
సొరంగ మార్గాలు...
నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కుతుబ్‌షాహి, అసఫ్‌జాహీ పాలకులు నిర్మించిన సొరంగాలు, భూగృహాలు, రక్షణ స్థావరాలు నేటికీ ప్రజలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చార్మినార్ నుంచి నగరం పశ్చిమ, తూర్పు శివార్ల వరకు సొరంగ మార్గాలు చారిత్రక సత్యమేకాక ఇప్పటికి భవన నిర్మాణాల సందర్భంగా ఉనికిని చాటుకొంటూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం దివాన్‌దేవిడి ప్రాంతంలోని పాత బురుజును రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేసినప్పుడు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆధునిక యంత్రపరికరాలు ఉపయోగించినా, 20 చదరపు అడుగుల వైశ్యాలం కలిగిన ఆ గుండ్రటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి మూడు నెలలు పట్టిన విషయం తెల్సిందే. కూల్చివేత పూర్తయిన తర్వాత అక్కడ సొరంగ మార్గం బయటపడింది. అది శత్రుదేశాల దాడుల నుంచి రక్షణ పొందడానికి నిజాం రాజులు నిర్మించుకొన్న బాంబు షెల్టర్ అని పురావస్తు శాఖాధికారులు తేల్చి చెప్పేవరకు ప్రజలలో ఉత్కంఠ కొనసాగింది. అలాంటి నిర్మాణాల జాబితాలోకి వస్తుంది చార్మినార్‌కు పశ్చిమాన కూతవేటు దూరంలో ఉన్న 'ఖజానా-ఎ-ఆమ్రా' భవన సముదాయం. అసఫ్ జాహిరాజుల అధికార నివాసమైన ఖిల్వత్ మహల్‌కు అత్యంత చేరువలో మోతిగల్లీ పక్కన నిర్మించిన ఖాజానా-ఎ-ఆమ్రా (ప్రభుత్వ ధనాగారం) ఒకప్పుడు ప్రపంచంలోనే అతి సంపన్నులుగా పేరొందిన హైదరాబాద్ పాలకుల ధనగారంగా ప్రఖ్యాతి పొందింది. 19వ శతాబ్దం చివరలో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ భవనాన్ని నిర్మించారని చెబుతారు.
సాలార్‌జంగ్ వస్తు ప్రదర్శనశాల
ఒక వ్యక్తి ప్రపంచంలో విలువైన వస్తువులను సేకరించి ఏర్పాటుచేసిన వస్తుప్రదర్శనశాలిది. తన తాత, తండ్రి అడుగుజాడలలో నడిచి మూడవ సాలార్‌జంగ్ ఈ వస్తువులన్నీ సేకరించాడు. తన వారసత్వంగా కొన్ని వస్తువులు వచ్చినప్పటికీ అంతకన్నా ఎక్కువ పురాతన కళాఖండాలను సాలార్‌జంగ్ సొంతంగా సేకరించాడు. దీనిని చూడటానికి సంవత్సరానికి 10లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. దీనిలో 43వేల కళాఖండాలు, 50వేల పుస్తకాలు ఉన్నాయి.
బిర్లా మందిరం
280 అడుగుల ఎత్తున నౌబత్ పహాడ్‌పై ఉన్నదిఈ దేవాలయం. 2వేల టన్నుల పాలరాతితో ఇక్కడి వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టించారు.ఉత్తర, దక్షిణ శిల్ప శైలిలో ఈ ద