మేల్కోవాల్సిన తరుణం
కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు... ఏమయ్యాయి ఇవన్నీ? ఇవి అంతరించడం అంటే తెలుగుదనం అంతరించడం కాదూ?
మనిషి పుట్టుకకు ముందే మాతృభాషతో బంధం మొదలవుతుంది. అమ్మ మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలను కడుపులోని బిడ్డ గ్రహించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, అలా అమ్మభాషను తన భాషగా సొంతం చేసుకునేందుకు ఆయత్తమవుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎంతమందిలో ఉన్నా అమ్మ గొంతును పసివాడు గుర్తించడం, స్పందించడంలోని రహస్యం అదేనని తేల్చారు. అలా అమ్మనుంచి నేర్చిన భాష కనుక అది మనకు అమ్మభాష అవుతోంది. అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మనీటిలో ఉన్ననాటిది! పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన ఆంధ్ర జాతికి అమ్మభాష తెలుగు. ఇంతమందికి ఇంటి నుడిగా స్థిరపడిన భాషలు ప్రపంచంలోనే బాగా అరుదు. అంతటి ఘనత వహించిన తెలుగు భాష 2030 నాటికి అంతరించిపోయే ప్రమాదంలో పడినట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
అంటే, తెలుగు జాతి తల్లిపేగు అస్తిత్వానికే ఆపద వాటిల్లిందని అర్థం. మనిషి జీవ లక్షణాల మూలకణాలకు బొడ్డుపేగే దొడ్డ స్థావరం కనుక, తెలుగుజాతి మూలాలు మొదలంటా కదల బారే గడ్డుస్థితి వచ్చిపడింది. ఒక భాష ఎప్పుడు అంతరించిపోతుందంటే- ఆ భాషతో వ్యవహారాలు, అవసరాలు క్రమంగా తగ్గిపోయినప్పుడు. కన్నతల్లికన్నా సవతి తల్లిపై ప్రేమ ఎక్కువై పొర్లిపోయినప్పుడు. తెలుగు భాష విషయంలో ప్రస్తుతం జరుగుతున్నదదే! 'పండుగ పూట వేకువనే లేచి సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు పోసుకో'మని పిల్లలకు చెప్పవలసి వస్తే- వేకువ.. సున్నిపిండి... నలుగు... తలంటు... ఈ పదాలనూ ఆంగ్లంలో వివరించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నప్పుడు తెలుగు వర్ణమాల మరి సిగ్గుతో కుంచించుకుపోదా? 'అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా?' అని కాళోజీ ఏనాడో ఆగ్రహించిన వైనం మనకు తెలుసు. చావడం కాదు, భాషను చంపేస్తున్నాడని ఇప్పుడు ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది.
అడుగంటిన అక్షర సంస్కారాలు
'జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశ భాషలందు తెలుగు లెస్స!' అన్నాడు క్రీడాభిరామం వల్లభరాయడు. 'తెలుగుకు అది తల్లిభాష కావచ్చుగాని, సంస్కృతంతో సంపర్కం వద్దు... మాకు అచ్చ తెనుగే ఎంతో ముద్దు' అన్న కోవలోవి- యయాతి చరిత్ర, నీలాసుందరీ పరిణయం... పట్టుతేనె లాంటి తెనుగు తీపిని పట్టి చూపించినవాడు తిక్కన మహాకవి. 'ఆంధ్రావళి మోదం బొరయ...' అనేది ఆయన కవితా లక్ష్యం. అక్కడినుంచి తెలుగు భాష వేనవేల రేకులతో కమలం మాదిరి విచ్చుకుంది. కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు, ప్రహసనాలు, యక్షగానాలు, శతకాలు, కథలు, గాథలు ముఖ్యంగా జానపదగీతాలు, సుద్దులు... ఇలా ఎన్నెన్నో రూపాలతో ఎన్నెన్నో పేర్లతో అమోఘంగా పరిమళించింది. దరిమిలా పింగళి సూరనాదులు కొత్తవిత్తులు నాటారు. నన్నయ మాదిరి తత్సమ పదాలతో తెలుగు పదాలు చక్కగా పోహళించి, అటు గాంభీర్యం ఇటు సౌకుమార్యం రెండింటినీ సొగసుగా పండించే దిశగా సాగారు. అదే సమయంలో సంస్కృత కావ్యాల్లోని చిన్నచిన్న కథాభాగాలను గ్రహించి, తమ సృజన పటిమతో తెలుగులో విస్తరింపు దిశగా మరికొందరు ప్రబంధ కవులు కృషిచేశారు. ఫలితంగా వరూధినీ ప్రవరాఖ్యులు, వసురాజు గిరిక తదితర పాత్రలు అమరభాషలోకన్నా ఆంధ్రభాషలో మేలనిపించాయి. నుడికారపు గడబిడలకు అచ్చతెనుగు బొమ్మ కట్టిన పోతనది మరో సారవంతమైన మడి. పద్యమంతటా సంస్కృత సమాసాలు కదనుతొక్కినా, చివర్లో... 'మా విజయుం చేరెడి వన్నెకాడు' వంటి తేటతెనుగు పదప్రయోగంతో- 'ఇది అచ్చుతెనుగు కవిత్వం' అనిపించే ప్రతిభ పోతన సొంతం. సాహితీ సౌష్ఠవ ప్రధానమైన కవితామార్గాన్ని అనుసరించిన శివభారతం వంటి కావ్యాల్లో వీరరసం చిందులేస్తే, పల్లెపట్టుల పరవళ్లతో దేశి కవితామార్గం తాండవం చేసింది. బాలచంద్రుడు, బ్రహ్మనాయుడు, ఖడ్గతిక్కన, తాండ్ర పాపయ్య కథానాయకులయ్యారు. మగువ మాంచాలి, కాకతి రుద్రమ, నాయకురాలు నాగమ వంటి వీరవనితలు నాయికలయ్యారు. ఆంధ్రదేశంలో ఒకో ప్రాంతం ఒక్కో జానపద వీరగాథకు పురుడుపోసింది. ప్రజాకవి వేమన దగ్గరకు వచ్చేసరికి భాష సరళసుందరమై జానుతెనుగు జాతిగీతమై ప్రవహించింది. పోతన 'వూరకరారు మహాత్ములు' మొదలు 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' (చిలకమర్తి గయోపాఖ్యానం) దాకా తెలుగుకవుల ఎన్నో పద్యపాదాలు లోకోక్తులై తెలుగింటి లోగిళ్లకు తోరణాలు కట్టాయి. హరిశ్చంద్రుడి కథలో గౌరనకవి సృష్టించిన పాత్ర తెలుగువారికి 'నక్షత్రకుడి'లా తగులుకుంది. ఇంతా చేసి ఇది తెలుగు ఘనవాఞ్మయ చరిత్రలోని చిన్న భాగం. గోరంత పరిశీలన. సాహిత్య సాగరం నుంచి ఎత్తి తెచ్చిన చెంబెడు నీళ్లు మాత్రమే. నన్నయ, కృష్ణదేవరాయలు, విశ్వనాథ... ఇదొక పాయ. శ్రీనాథుడు, పెద్దన, కృష్ణశాస్త్రి- అదొక పాయ. సోమన, వేమన, శ్రీశ్రీ వంటివి ప్రత్యేక ప్రతిభా ప్రవాహాలు. తెలుగు సాహిత్య సంపద సర్వ సంపన్నతను అర్థం చేసుకోవాలంటే మొత్తం నిండు ప్రవాహాన్ని ఈదాలి. ఇప్పుడు అలాంటి గజ ఈతగాళ్లు తగ్గిపోయారు. నిండు ప్రవాహాలు తరిగిపోయాయి. చదువులు అయితే పెరిగాయి గాని, భాష మాత్రం ఎదగలేదు. అక్షర సంస్కారాలు అడుగంటాయి. అమృత భావనలు అంతరించాయి. తెలుగుతల్లి ముఖచిత్రం క్రమేపీ దయనీయంగా మారింది.
మనదంటూ మిగిలిందేమిటి?
భాషా సాహిత్యాల ప్రగతి అలా గడ్డు స్థితిలో ఉండగా అసలు జాతి జనజీవనంలోంచి తెలుగుదనం క్రమంగా కరవైపోతోంది. పతనం వేగం పుంజుకుంది. సంస్కృతీ సంప్రదాయాలు క్షీణించాయి. ఆచార వ్యవహారాలు తలకిందులయ్యాయి. పండుగలు పబ్బాలకు అర్థం మారిపోయింది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతోంది. ప్రతి పండుగలాగే సంక్రాంతీ వస్తోంది, వెళ్ళిపోతుంది. చలిపొద్దులు, గంగిరెద్దులు, భోగిమంటలు, తలంటులు, పిండివంటలు, జడగంటలు, కొత్త పంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, భోగిపళ్లు, పాశురాలు, దాసరి కీర్తనలు, పిళ్ళారి ఆరగింపులు, సాతాని జియ్యర్లు, రంగవల్లులు, రథం ముగ్గులు, బొమ్మల కొలువులు అన్నీ కలిస్తే... సంక్రాంతి అన్నీ కలిస్తేనే సంక్రాంతి! మరి వాటిలో ఈవాళ ఎన్ని మిగిలాయి మనకు?
తెలుగువాడి కట్టూ బొట్టూలోంచి తెలుగుదనం తప్పుకొంది. తలపులోంచీ పిలుపులోంచీ తప్పుకొంది. అత్తయ్య, మావయ్య, తాతయ్య, బాబయ్య, బామ్మ, పిన్ని... వంటి తియ్యని వరసలు ఆట్టే వినపడటం లేదు. బంధువుల వరస లేమిటి, అమ్మ అన్న కమ్మని పిలుపే సంకరం అయిపోయింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లతోనే తప్ప- పిచ్చుకలు, పావురాలు, తూనీగలు, గోరువంకలు, లేగదూడలు, కుక్కపిల్లల వంటి సజీవ సహజీవులతో సావాసాలను బాల్యం మరిచేపోయింది. వాటితో సంభాషణలు మానేసింది. అసలవి మానవ పరివారంలోంచే తప్పుకొన్నాయి. చెట్లతో, ఏటిగట్లతో, పైరగాలితో స్నేహం చెడిపోయింది. పసివాళ్ల బతుకులు బోన్‌సాయి మొక్కలైపోయాయి. మొదళ్లు గిడసబారిపోయాయి. నిరంతరం యంత్రాలతోనే గడిపేస్తూ, పిల్లలు తామూ వాటిలో భాగం అయిపోతున్నారు. గురిచూసి దొంగతనంగా రాలగొట్టిన దోరజాంకాయి తాజా రుచికి, కాగితం పెట్టెల్లో పోసి మురగబెట్టిన పండ్ల రసాలకు పోలికేమిటి? దంత సంరక్షణ వంటి ఆరోగ్య సూత్రాలు అలా ఉంచి, ఆ రెండింటి మధ్యా అమ్మ పాలకు, డబ్బా పాలకు ఉన్నంత తేడా లేదూ? మాతృభాషలో విద్యాబోధన ఏ దశలోంచి కరవైపోయిందో అప్పుడే విద్యావ్యవస్థలోంచి తెలుగుదనం తప్పుకొంది. పసితనంలోనే ఆదర్శ జీవనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, సంస్కార వికాసానికి దోహదం కూర్చే శతక వాఞ్మయం వూసే లేకుండాపోయింది. చందామామలతోనే గాని, చందమామతో చనువు లేకుండా పోయింది. వ్యవస్థలో నైతిక విద్యార్జన, బోధన అడుగంటిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- మన తిండి మనది కాదు. మన ఆలోచనలు మనవి కావు. మన మాటలు మనవి కావు. మన సినిమాలు మనవి కావు. మన బతుకే మనది కాకుండాపోయింది. అన్నింటా తెలుగుదనాన్ని... కాదు.. కాదు.. మనల్ని మనమే పోగొట్టుకుంటున్నాం.
ఇప్పుడేం చేయాలి?
తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిందనో, తెలుగు మహాసభలు ఏర్పాటయ్యాయనో మనలో తహతహ పుట్టడం ఎలా ఉందంటే- అమ్మకు జబ్బు చేసినప్పుడు గుర్తొచ్చినట్లుంది. రోగాలబారిన పడకముందే జాగ్రత్త పడలేదు, కనీసం ఇప్పుడు సరైన చికిత్స అందించి తెలుగు భాషను దక్కించుకుందామన్నట్లుంది. 'నా మాతృభాష నానా దుష్ట భాషల ఔద్ధత్యమును తలను అవధరించింది' అని బాధపడ్డారు 'ఆంధ్రప్రశస్తి'లో విశ్వనాథ. ముందు ఆ బరువు దించాలి. ఆ దుష్ట భాషల రాలుగాయితనంలోంచి తెలుగును విడిపించుకోవాలి. పెద్దాపరేషను, సూదిమందు వంటి చక్కని అనువాద పదాలు గ్రామీణ స్త్రీల నోటినుంచే వచ్చాయన్నది మనకు స్ఫూర్తిదాయకం కావాలి. 'స్త్రీలనుంచే నేను కమ్మని తెలుగు భాష నేర్చుకున్నాను' అన్న కథకచక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి మాటలను మనం నిత్యం గుర్తుంచుకోవాలి. జాతి ప్రత్యేకతను ప్రతిబింబించే తల్లిపేగు లాంటి మౌలిక జీవన సూత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విభిన్న మాండలికాలు, నుడికారాలు, సామెతలు, పొడుపుకథలు, జాతీయాలు, పరిభాషలు, సూక్తులు తదితర సర్వ సమగ్ర సామగ్రితో తెలుగు భాషను పరిపుష్టం చేసే దిశగా కృషి సాగించాలి. తెలుగు సమాజాన్నీ, జాతిని, ముఖ్యంగా స్త్రీల మనోభావాలను కించపరచే విధంగా వ్యవహరిస్తున్న చలనచిత్రాలను, వివిధ దృశ్య మాధ్యమాల ధోరణులను కట్టడి చేయాలి. జాతి హుందాతనానికి, సంస్కారానికి మచ్చ తెస్తున్న ప్రసార మాధ్యమాల ఇటీవలి ధోరణి నిజానికి చాలా అభ్యంతరకరంగా ఉంటోంది. గతంలో బూతు మాటలుగా ముద్రపడిన అనేక పదాలు ఇప్పుడు చాలా తేలిగ్గా సంభాషణల్లోకి, చిత్రగీతాల్లోకి చొరబడుతున్నాయి. ఈ రకం సంస్కారహీనమైన భాషను చిత్రాల్లోనే మొదట నిషేధించాలి. సభల్లో, సమావేశాల్లో, ఉత్సవాల్లో తెలుగుజాతి ప్రత్యేక కళారూపాన్నొకదాన్ని విధిగా వ్యాప్తిలోకి తేవాలి. స్వచ్ఛమైన జానపద సాహిత్యం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, విభిన్నమైన కట్టుబాట్లను పునరుద్ధరించాలి. వారి ఔషధ విజ్ఞానం ప్రాచుర్యంలోకి రావాలి. 'అరిశిరస్సులనుత్తరించిన అలుగునేనే తెలుగు నేనే! అఖిలజగములు చుట్టి వచ్చే పులుగు నేనే తెలుగు నేనే! తెలుగు నేనే వెలుగు నేనే' అన్న దాశరథి గర్జనలోని తత్పరత మనందరినీ నిండుగా ఆవహించాలి. ఉద్యమ స్ఫూర్తితో నేనుసైతం నేనుసైతం... అంటూ మనమంతా ముందుకు ఉరకాలి. 'ఆంధ్రుడవై జన్మించితివాంధ్రుడవై అనుభవింపుమా ఉర్వీభవంబు, ఆంధ్రుడవై మరణింపుమి, ఆంధ్రత్వములేని బ్రతుకునాశింపకుమీ!' అన్న ప్రసిద్ధ కవి తుమ్మల సీతారామ్మూర్తి ప్రబోధం మనందరకూ శిరోధార్యం కావాలి. మనమంతా పూర్తిస్థాయి తెలుగువాళ్లం కావాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి. మన మాతృభాషను మనమే భద్రంగా కాపాడుకోవాలి. తెలుగుదనం మన జీవ లక్షణం కావాలి. మనకు గర్వకారణం కావాలి. అది మన తక్షణ కర్తవ్యం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ