మా లోగో

లోగో గురించి:

  • పసుపు, కుంకుమ రంగులు మన సంస్కృతి కి చిహ్నాలుగా వాడటం జరిగింది.
  • మధ్యలో ఉన్న చిహ్నం మన పూర్వీకులైన “శాతవాహనులు” కు గుర్తుగా తీసుకోవటం జరిగింది.  ఇది “ఉజ్జయిని చిహ్నం”, (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు). శాతవాహనులు వారి రాజధాని అయిన ఉజ్జయిని నగరానికి గుర్తుగా ఈ చిహ్నాన్ని తమ నాణేల పైన ముద్రించారు.
  • క్రింద, “దేశ బాషలందు తెలుగు లెస్స” అని శ్రీనాధుడు మరియు శ్రీ కృష్ణదేవరాయులు కీర్తించినట్టి మాట.

శాతవాహనుల నాణేలు

గౌతమీ పుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) ముద్రించిన వెండి నాణెం. ఒక వైపు ఉజ్జయిని చిహ్నం, మరోవైపు కొండ, సూర్యుడు, చంద్రుడు, నధి, ఇంకా ఆనాటి రాజ బాష అయిన ప్రాకృతం ..

శతవాహనుల నాణెం, ఒక వైపు ఏనుగు మరోవైపు వారి ఉజ్జయిని చిహ్నం.

ఒక్క సారి మన చరిత్రను పరిశీలిస్తే

ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది.

క్రీ.పూ. 7 వ శతాబ్దంలోని సంస్కృత రచనలు ఆంధ్ర ప్రజలను ఆర్యులు (‘Aryans’) గా వర్ణిస్తాయి. చరిత్రలో, వీరు దక్షిణ వింధ్య పర్వత ప్రాంతాల నుండి వలస వచ్చి ద్రవిడులలో కలసినట్లుగా చెప్పబడింధి. క్రీ.పూ. 232 లో మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడి మరణం సమయంలో మళ్ళీ వీరి గురించి పేర్కొన్నారు. ఈ తేదీ నుండే ఆంధ్ర చరిత్ర ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు.

‘ఆంధ్రులు’ అన్న పదం శాతవాహన వంశం నుండి వచ్చింది. శాతవాహనులు పశ్చిమ మహారాష్ట్ర లోని ఆంధ్ర మావల్ (‘Andra Maval’) ప్రాంతంను పరిపాలించటం వలన, వారు ఆంధ్రులుగా (‘Andhras’) గా పిలవబడతారు. తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఆ పేరు ఈ రాజవంశం నుండే వచ్చింది. అశోకుని శిలాశాసనాలు శాతవాహనులను అతని సామంతులుగా పేర్కొన్నాయి.

శాతవాహనులు దక్షిణ మరియు మధ్య భారతదేశం ను ధరణికోట మరియు జున్నార్ ల నుండి పరిపాలించారు (ధరణికోట, గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన గ్రామము, ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణము. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది). వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.

పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.

శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి.

శాతవాహనులలో 17వ రాజైన హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాధాసప్తశతి ఒక ముఖ్యమైన చారిత్రిక, సాహిత్య గ్రంధం.

టాంక్ బండ్ పైన శాలివాహనుడి విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం

గౌతమీపుత్ర శాతకర్ణి (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను.అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను.

శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి.శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు.  గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో శాతవాహన ప్రాబల్యం దక్షినాన కంచి వరకు వ్యాపించింది.

భారతీయ పంచాంగం(కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు.