మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”

డా.కట్టమంచి రామలింగారెడ్డి రచించిన “ముసలమ్మ మరణం”. తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం. ఇది “ముసలమ్మ” అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ.కథకు మూలం చార్లెస్ పి. బ్రౌన్ రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం). 1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.

107 గద్య పద్యాలున్న చంపూ కావ్యం ‘ముసలమ్మ మరణం’ కథ. 17వ పద్యంతో కథ మొదలవుతుంది. 104వ పద్యానికి కథ ముగిసిపోతుంది.

కథ:  “అనంతపురం సమీపంలో బుక్కరాయ సముద్రం అనే గ్రామంలో ఒక చెరువు ఉంది. చెరువు నిండి పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఒక్కసారిగా పొంగి దాని కట్ట తెగిపోయింది. ఆ నీళ్ళు ఊరంతా ముంచేస్తున్న సమయంలో ప్రజలంతా గ్రామ దేవత పోలేరమ్మని ప్రార్ధిం చారు. ఇంతలో ఆకాశవాణి చెరువు చుట్టూ గుమిగూడిన ఊరి ప్రజల నుద్దేశించి మాట్లాడుతుంది. అదే ఊరిలో ఉంటున్న బసిరెడ్డి చివరి కోడలు ముసలమ్మని చెరువు కట్టకి బలి ఇస్తే చెరువు కట్ట నిలుస్తుందని చెప్తుంది. విషయం తెలుసుకున్న ముసలమ్మ ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. భర్త, అత్తమామల అనుమతి తీసుకుని, బిడ్డను భర్తకు అప్పగిస్తుంది. ప్రజల అనుమతిని కూడా తీసుకుని, దేవుడ్ని ప్రార్థించి ముసలమ్మ చెరువులో పడి ప్రాణాలు బలి ఇస్తంది.”