శ్రీశ్రీ కలం నుండి జాలువారిన గొప్ప దేశభక్తి గీతం “పాడవోయి భారతీయుడా”

స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా! ఆ వీరుల త్యాగఫలాన్ని కున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యా, ద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీ శ్రీ వ్రాసిన ఈ పాడవోయి భారతీయుడా–ప్రభోధగీతం మనం తప్పని సరిగా వినాలి

ఈ పాటలో వున్న నగ్నసత్యాలు ఇప్పటికీ సంఘంలో పచ్చి నిజాలుగా మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఆనాడే బ్లాక్ మార్కెట్, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, ప్రాంతీయ వాదాలు ఆయన ఊహించి పాటలో నిక్షిప్తం చేసారు.  మనకు స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడకూడదనీ,దాన్ని కాపాడుకోడానికి కృషిచెయ్యాలనీ,ఆ ఫలాలను అందరికి సమంగా అందేలా చూడాలనీ ఆయన ఉద్భోధంచారు.

పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నీడే ఆనందం

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబరపడగానె సరిపోదోయి
సాధించినదానికి సంత్రుప్తిని పొంది
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా

ఆకశం అందుకొనే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగమింకొకవైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు
అలముకున్న ఈ దేశం ఏటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి

పదవీవ్యామోహాలు కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు
ప్రతిమనిషి మరియొకని దోచుకొనేవాడే
తనసౌఖ్యం తనభాగ్యం చూసుకునేవాడే
స్వార్ధమే అనర్ధకారణం
అది చంపుకొనుటె క్షేమదాయకం

నవసమాజ నిర్మాణమె నీధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె నీలక్ష్యం
సమసమాజ నిర్మాణమె నీధ్యేయం
సకలజనుల సౌభాగ్యమె నీలక్ష్యం
ఏకదీక్షతో గమ్యంచేరిననాడే
లోకానికి మన భారత దేశం
అందించునిదే సుభసందేశం