సుమతీ శతకము

తన కలిమి ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్
తన చావు జతద్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

తన కోపమె తన శతృవు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తనయూరి తపసితనమును
దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తనవారు లేనిచోటను
జనవించుక లేనిచోట జగడముచోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తములము వేయని నోరును
విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్
గమలములు లేని కొలకుఁను
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను బ్రాన వల్లభునైనం
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

తాను భుజింపని యర్థము
మానవపతిఁ జేరుఁగొంత మరి భూగతమౌఁ
గానల నీఁగల గూర్చిన
దేనియ యెరుఁజేరునట్లు తిరగమున సుమతీ!

దగ్గర కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మరితా
నెగ్గుఁబ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతీ!

ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!

Pages