సుమతీ శతకము

పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి సేయకు
సిరిచెడి జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!

పరసతుల గోష్టినుండి
పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్
బరుసతి సుశీయైనను
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

పరుల కనిష్టము సెప్పకు
పొరుగిండ్లకు బనులులేక పోవకు మెపుడున్
బరుఁగదిసిన సతి గవయకు
ఎరింగియు బిరుసై సహయము నెక్కకు సుమతీ!

పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో
గర్వింపనాలి బెంపకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ

పలుదోమి సేయు విడియము
తలగడిగిన నాఁటినిద్ర తరుణులయెడలం
బొలయలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినురా సుమతీ!

 

పాటెరుగని పతికొలువును
గూటంబున కెరుకపడని కోమలిరతియు
జేటెత్తజేయు చెలిమియు
నేటికి నెదిరీదినట్టు లెన్నగ సుమతీ

పాలను గలిసిన జలమును
బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!

పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

Pages