సుమతీ శతకము

కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

కమలములు నీడఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

కరణము గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేడు సుమీ
కరణము తన సరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!

కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!

కవిగానివాని వ్రాఁతయు
నవరసభావములు లేని నాతుల వలపుం
దవిలి చను పందినేయని
వివిధాయుధ కౌశలంబు వృథరా సుమతీ!

కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!

కాదు సుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గూడుట యెల్లన్
బ్రేమమున జెరకు పిప్పికి
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ!

కారణములేని నగవును
బేరణమును లేని లేమ పృథివీస్థలిలో
బూరణము లేని బూరెయు
వీరణములేని పెండ్లి వృధరా సుమతీ!

కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

Pages