వ్యావహారిక భాషకు దిక్సూచి

నేడు గిడుగు రామమూర్తి గారి జయంతి ( తెలుగిడుగు రామమూర్తిగు భాషా దినోత్సవం )

ఆంగ్లేయుల పాలన వచ్చేవరకు మనం ప్రజల భాష గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే- మనది బానిసదేశమై ఉండేది కాదు. ఇంగ్లిషువాళ్లు కొత్త బడులు పెట్టారు. కొత్త చదువులు మొదలుపెట్టారు. కొత్త పుస్తకాలు రాయించారు. అన్నిటికీమించి అందరికీ చదువు అనే ఆలోచన పెంచారు. కొత్త విద్యార్థులు ఎందరో బడిబాట పట్టారు. అప్పుడు కొత్తభాష అవసరమైంది. ఈ దశలో పద్యం జోరు తగ్గింది. వచనం హోరు మొదలైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యాడు. చిన్నయసూరి పుట్టి రెండు వందల ఏళ్లయినా, ఇప్పటికీ భాష ఆయన కనుసన్నల్లో మెలగాలని అనుకునేవాళ్లు లేకపోలేదు.

ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యాడు. ఆయన పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందునుంచీ వాడుక భాషలో రాసిన వాళ్లున్నారు. ఏనుగుల వీరస్వామయ్య, సామినీన ముద్దు నరసింహం, గురజాడ అప్పారావు లాంటివారు వాడుక భాష విషయంలో గిడుగు కంటే ముందు అడుగువేసినవారిలో ప్రసిద్ధులు. గిడుగు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. 1911లో వాడుక, గ్రాంథిక భాషల మధ్య అధికార ముద్రకోసం ఎడతెగనిపోరు మొదలైంది. అంటే- ఈ సమరానికిది శతజయంతి సంవత్సరమన్నమాట. ఈ పోరులో దొంగదారిలో నెగ్గిన గ్రాంథిక శైలి ఏభై ఏళ్లపాటు (అ)యోగ్యతా పత్రాలనిచ్చే బడుల్లో చలామణి అయింది. అయినా, వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరింది. అధికారం దిగివచ్చి ఆ బావుటా కింద తలవంచి నిలిచింది. ప్రజలు ఎదిగినప్పుడు పాలకులు ఒదగక తప్పదు కదా! గిడుగు లేకపోతే ఈ గెలుపు ఇంత త్వరగా మనకు కైవసమై ఉండేది కాదు.

తిరుపతి వేంకట కవులు భాష విషయంలో కొంత తెలివిగా వ్యవహరించారు. కాలాన్నిబట్టి భాష మారుతుందని వాళ్లు తెలుసుకున్నారు. ‘కథలు-గాథలు’ అనే పేరుతో వేలపుటలు దాటిన వారి వచన రచన, వాడుక భాషలోనే ఉంది. అందుకే మూడు సంపుటాలుగా ఉన్న ఆ గ్రంథం ఇప్పటికీ సజీవంగా నిలిచింది. పశ్చిమ బుద్ధులైన పండితుల పెడతలల్లో గిడసబారిన తెలుగుకు విడుదల కల్పించిన గిడుగు పిడుగుకు జడిసి బడలిపోయినవారిలో తానూ జమ కాకుండా ఉండటం కోసమే ఆయన వాడుక భాషలో రాశారు. పండితులైన వారెందరో ఆయన మార్గంలో నడచి వాడుక భాషలో సరికొత్త పండిత శైలిని సృష్టించడానికి మార్గదర్శి అయ్యాడు. ఇలా ఇష్టం ఉండి కొందరు, లేక మరికొందరు ఈ తోవలో నడవక తప్పలేదు.సరళగ్రాంథిక భాషలో వాడుక భాష ప్రశంసను, పరిమితిని, ప్రయోజనాన్ని, వ్యాప్తిని వేటూరి ప్రభాకర శాస్త్రి తెలియజేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా భాషను ముందుకు ఉరికించారు. ఇదంతా గిడుగు వెలుగుకు చిహ్నమే. తాపీ ధర్మారావు తొలిదశలో కరడుగట్టిన గ్రాంథికవాది. ఆ రోజుల్లో పాతపాళీకి పనిపెట్టారు. వీర గ్రాంథిక శైలిలో కొంతకాలం పద్యాలను అంపజల్లుగా కురిపించిన గొప్ప పండితుడు. హఠాత్తుగా ఆయనకూ జ్ఞానోదయమైంది. తాతాజీ అంతటి గొప్ప పండితుణ్ని వ్యావహారిక వాదానికి మళ్లించిన ఘనత- పరోక్షంగానైనా గిడుగుకే దక్కుతుంది!

ఒకానొక దశలో పండితులు తమకు అలవాటైన గ్రాంథిక శైలిని విడిచిపెట్టకుండానే వాడుక భాష గొప్పతనాన్ని వేనోళ్ల కొనియాడటం మనం చూస్తాం. యెంకిపాటలను సమర్థిస్తూ ప్రసిద్ధ పండితులు, కళా విమర్శకులు అయిన పురాణం సూరిశాస్త్రి 1925లో రాసిన విధానం అటువంటిదే. మహా పండితులు, శతావధానులు అయిన వేంకట రామకృష్ణ కవులు గ్రాంథిక శైలిలో రచనలు చేసినా గిడుగు, గురజాడల రచనలను, వారి వాదాన్ని ఎంత గౌరవించారో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అనుభవాలు, జ్ఞాపకాలు చదివినవారందరికీ తెలుస్తుంది. కృతక గ్రాంథిక శైలిలో పద్య కావ్యాలు, వచన కావ్యాలు రాసిన కందుకూరి వీరేశలింగం తన అవసాన దశలో గ్రాంథిక శైలిని వదలి వాడుక భాషలో రచనలు చేయడానికి సమ్మతించిన సంగతి చరిత్రలో స్పష్టంగా నమోదైంది. కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు శుద్ధగ్రాంథిక శైలిలో సంపాదకీయాలు రాసేవారు. మొదటి దశలో బరువైన భాషతో, పొడవైన సమాసాలతో, మూడు నాలుగు పంక్తులకు విస్తరించిన వాక్యాలతో ఆయన శైలి కొంత జటిలంగా ఉండేది. గిడుగు భాషావాదం విస్తరించిన తరవాత ఆయన సరళగ్రాంథిక శైలిలో, సులభమైన మాటలతో, చిన్నచిన్న వాక్యాలలో, సూటిగా తేటగా రాశారు.

గురజాడ మరణం సందర్భంగా ఆయన రాసిన సంపాదకీయాన్ని చదివినవారికి తాను అనుసరించకపోయినా ఆయనకు గిడుగు-గురజాడల వాదం ఎంత గౌరవపాత్రమైనదో తెలుస్తుంది. ఇలా గ్రాంథికశైలిని వదులుకోలేనివారూ వాడుక శైలిని పరోక్షంగా ఆమోదించడం, మన్నించడం గిడుగు సాధించిన విజయానికి తార్కాణమే. చింతా దీక్షితులు, చలం, కొడవటిగంటి వంటి ఆధునికులు సాహిత్యక్షేత్రంలో ప్రవేశించి గిడుగు వాదానికి కంచుకోట కట్టారు. తెలిసో తెలియకో ముందు గ్రాంథిక శైలిలో రాయడం మొదలుపెట్టి చటుక్కున తెలివి తెచ్చుకుని వాడుకశైలిని అందుకుని తిరుగులేని రచనలు చేసిన చలం, శ్రీశ్రీ, రా.వి.శాస్త్రి వంటివారు గిడుగు సాధించిన విజయానికి నిలువుటద్దాలుగా మిగిలారు. కాలం గడుస్తున్నకొద్దీ మాండలిక రచనలు విస్తరిస్తూ గిడుగు వాదానికి కొమ్మలు, రెమ్మలు మొలుస్తున్నాయి.

రాజు అధికారంలో ఉన్నంతవరకే తన రాజ్యంలో గౌరవాన్ని పొందుతాడు. విద్వాంసుడు తన జీవితకాలంలోనే కాక కీర్తిశేషుడిగానూ గౌరవాన్ని పొందుతాడు. ఆనాటి పర్లాకిమిడి రాజు, నానాటి గిడుగు పండితులే ఇందుకు సాక్షులు. తెలుగువారే కాదు, ఇతర భారతీయులతోపాటు పాశ్చాత్యులూ గిడుగును భాషా పండితునిగా, భాషోద్యమ ప్రవర్తకునిగా గుర్తించారు, శ్లాఘించారు, గౌరవించారు, ఆరాధించారు. ఉన్నత వ్యక్తిత్వం అంటే అది. సన్నుత వ్యక్తిత్వం అది. అయిదు రూపాయల జీవనభృతికోసం అడవులు, కొండలు, నదులు దాటుకుని దూర ప్రదేశానికి తరలివెళ్లిన ఒక సామాన్య వ్యక్తి దృఢ సంకల్పంతో, విశిష్ట వ్యక్తిత్వంతో, అపార జ్ఞానంతో, అచంచలమైన నిబద్ధతతో అడవి బిడ్డలకు అక్షరదానం చేయడంతో అసాధారణ వ్యక్తిగా అందరి మన్ననలు పొందడం-ఆంధ్రదేశ చరిత్రలో విస్మరించరాని ఘట్టం. సవరలకే కాదు ప్రాచీన భాషా ప్రవరులకూ సరికొత్త భాషాదానం చేసిన ఆచార్యుడు గిడుగు. అభ్యుదయశక్తి, మానవతాదృష్టి, అపార మేధ అనే అంశాల్లో తనకు సరిజోడుగా నిలచిన గురజాడతో కలిసి అటు ప్రజల భాషకు, ఇటు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేసిన కార్యశూరుడు గిడుగు. ఇప్పుడు పర్లాకిమిడిలో ఆయన నివసించిన ఇల్లు నేల మట్టమై ఉంటే ఉండవచ్చు. కానీ, ప్రజల గుండెల్లో, తెలుగు రచయితల ఆలోచనాధారలో ఆయన నిర్మించిన భాషాసౌధం కలకాలం సమున్నతంగా నిలిచే ఉంటుంది. తెలుగు భాషలో ఏర్పడిన, ఏర్పడుతోన్న, ఏర్పడబోయే ప్రయోజనకరమైన పరిణామ దశలన్నింటికి గిడుగు ఉద్యమం అంతస్సూత్రంగా ఉంటుంది. మంచి సాహిత్య భాషకోసం వివిధ దశలలో నూరేళ్లుగా కొనసాగుతున్న పోరుకు ప్రాణస్పందన గిడుగు