నేడు గిడుగు రామమూర్తి గారి జయంతి ( తెలుగు భాషా దినోత్సవం )
ఆంగ్లేయుల పాలన వచ్చేవరకు మనం ప్రజల భాష గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే- మనది బానిసదేశమై ఉండేది కాదు. ఇంగ్లిషువాళ్లు కొత్త బడులు పెట్టారు. కొత్త చదువులు మొదలుపెట్టారు. కొత్త పుస్తకాలు రాయించారు. అన్నిటికీమించి అందరికీ చదువు అనే ఆలోచన పెంచారు. కొత్త విద్యార్థులు ఎందరో బడిబాట పట్టారు. అప్పుడు కొత్తభాష అవసరమైంది. ఈ దశలో పద్యం జోరు తగ్గింది. వచనం హోరు మొదలైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యాడు. చిన్నయసూరి పుట్టి రెండు వందల ఏళ్లయినా, ఇప్పటికీ భాష ఆయన కనుసన్నల్లో మెలగాలని అనుకునేవాళ్లు లేకపోలేదు.
ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యాడు. ఆయన పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందునుంచీ వాడుక భాషలో రాసిన వాళ్లున్నారు. ఏనుగుల వీరస్వామయ్య, సామినీన ముద్దు నరసింహం, గురజాడ అప్పారావు లాంటివారు వాడుక భాష విషయంలో గిడుగు కంటే ముందు అడుగువేసినవారిలో ప్రసిద్ధులు. గిడుగు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. 1911లో వాడుక, గ్రాంథిక భాషల మధ్య అధికార ముద్రకోసం ఎడతెగనిపోరు మొదలైంది. అంటే- ఈ సమరానికిది శతజయంతి సంవత్సరమన్నమాట. ఈ పోరులో దొంగదారిలో నెగ్గిన గ్రాంథిక శైలి ఏభై ఏళ్లపాటు (అ)యోగ్యతా పత్రాలనిచ్చే బడుల్లో చలామణి అయింది. అయినా, వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరింది. అధికారం దిగివచ్చి ఆ బావుటా కింద తలవంచి నిలిచింది. ప్రజలు ఎదిగినప్పుడు పాలకులు ఒదగక తప్పదు కదా! గిడుగు లేకపోతే ఈ గెలుపు ఇంత త్వరగా మనకు కైవసమై ఉండేది కాదు.