గుణములోగలవాని కులమెంచగానేల గుణము కలిగెనేని కోటిసేయు గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు విశ్వదాభిరామ వినురవేమ
శుభముల నొందని చదువును అభినయమున రాగరసము నందని పాటల్ గుభగుభలు లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
మేలెంచని మాలిన్యుని మాలను నగసాలివాని మంగలి హితుగా నేలిన నరపతి రాజ్యము నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు మొండి వాని హితుడు బండవాడు దుండగీడునకును కొండెడు దళవాయి విశ్వదాభిరామా వినురవేమ
కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు ఉభయులరయుగూడి యుండినట్లు పేద పేద గూడి పెనగొని యుండును విశ్వదాభిరామా వినురవేమ
కలిమిగల్గనేమి కరుణ లేకుండిన కలిమి తగునె దుష్టకర్ములకును తేనెగూర్పనీగ తెరువున బోవదా విశ్వదాభిరామ వినురవేమ
కదలనీయకుండ గట్టిగా లింగంబు కట్టివేయనేమి ఘనత కలుగు భావమందు శివుని భావించి కానరా విశ్వదాభిరామ వినురవేమ
కపటి వేషమూని కడగండ్లు పడనేల విపిన భూమి తిరిగి విసుగనేల యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా విశ్వదాభి రామ వినుర వేమ
కోపమున ఘనత కొంచెమైపోవును కోపమునను గుణము కొరతపడును కోపమణచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమ
ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!
ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా నలుపు నలుపేకాని తెలుపుకాదు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె విశ్వదాభిరామ వినురవేమ
ఎండిన మా నొకటడవిని మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్ దండిగల వంశమెల్లను చండాలుండొకడు పుట్టి చదుపును వేమా!
ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ నంటి చూడలేక యడవులందు నుంట మేటంచునుందురా జోగులై విశ్వదాభిరామ వినురవేమ!
ఇంగలంబు తోడ నిల సల్పుతోడను పరుని యాలితోడ పతితుతోడ సరసమాడుటెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినురవేమ!
ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె జీవబుద్ధి వలన జీవుడయ్యె మోహబుద్ధిలయము ముందర గనుగొను విశ్వదాభిరామ వినురమేమ!
ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి వేరేపోవువాడు వెర్రివాడు కుక్కతోక పట్టి గోదారీదినా? విశ్వదాభిరామ వినుర వేమ!
ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు కట్టుపడుచు ముక్తిగానరైరి జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో విశ్వదాభిరామ వినురవేమా!