మాటకు బ్రాణము సత్యము కోటకుఁ బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికిఁ బ్రాణము మానము చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలములలోపల నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
నాది నొకని వలచియుండగ మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్ బొది జిలుక పిల్లి పట్టిన జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
రా పొమ్మని పిలువని యా భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే దీపంబు లేని ఇంటను చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ గోపించురాజుఁ గొల్వకు పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!
లావుగలవానికంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ గ్రావంబంత గజంబును మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమీ పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
వరి పంటలేని యూరును దొరయుండని యారు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
వినదగు నెవ్వరుచెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
వీడెము సేయని నోరును జేడెల యధరామృతంబుఁ జేయని నోరును బాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
వెలయాలివలనఁ గూరిమి గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడి తెరుపునఁ బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
వెలయాలు సేయు బాసలు వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్ గలలోఁన గన్న కలిమియు, విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
వేసరవు జాతి కానీ వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ దాసి కొడుకైన గాని కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
హాని కలుగబోదు హరిమది నెంచెడు వాని కబ్దు పరము వసుధయందు పూని నిష్ఠమీరి పొదలక యుండుము విశ్వరాభిరామ వినురవేమ!
శాంతమే జనులను జయమునొందించును శాంతముననె గురువు జాడ తెలియు శాంత భావ మహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినురవేమ!
వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు చేతకంటె హెచ్చు వ్రాత లేదు వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త విశ్వదాభిరామ వినురవేమ!
వేషధారినెపుడు విశ్వసింపగరాదు వేషదోషములొక విధయె యగును రట్టుకాదె మునుపు రావణు వేషంబు విశ్వదాభిరామ వినురవేమ!
వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భండి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినురవేమ!
వినియు వినకయుండు కనియు గనక యుండు తలచి తలపకుండు తాను యోగి మనుజవరులచేత మణిపూజ గొనుచుండు విశ్వదాభిరామ వినురవేమ!
లోభమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పి చనును తానొకటి దలచిన దైవమొండగుచుండు విశ్వదాభిరామ వినురవేమ