తెలుగు జాతీయాలు

ఆముదపు విత్తులు ఆణిముత్యాలవుతాయా అన్నట్టు..

కొంతమందిని మార్చి మంచి పద్ధతిలో పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. వారి సహజ గుణాన్ని మార్చుకోక పాత పద్ధతిలో అలాగే ఉండిపోతారు. ఆముదపు గింజల్ని ఎంతగా చెక్కి రంగులద్దినా వాటిని ఆణిముత్యాలు అని ఎవరికైనా చూపించి నమ్మించటం కూడా కష్టమే అవుతుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

ఆపద మొక్కులు, సంపద మరపులు అన్నట్టు

మనుషుల మనస్తత్వాలను, ప్రవర్తనల తీరును విశ్లేషిస్తుంటాయి జాతీయాలు. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఆపదలొచ్చినప్పుడు ఆదుకోమని వేడుకొంటుంటారు చాలా మంది. దయతలచి ఎవరైనా ఆదుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడి ఆనందాన్ని అనుభవిస్తూ మేలు చేసిన వారిని మరచిపోయేవారు చాలామంది ఉంటారు.

ఆదివారం అందలం ఎక్కనూ లేదు...

'ఆదివారం అందలం ఎక్కనూ లేదు, సోమవారం జోలె కట్టనూ లేదు' అన్నది జాతీయం. సంపదలున్నప్పుడు ముందూ వెనుకా చూడకుండా భోగాలను అనుభవిస్తుంటారు కొంతమంది. ఆ సంపదలు కరిగిపోయాక దుర్భరంగా అప్పుచేస్తూనో, యాచిస్తూనో తిరుగుతుంటారు. ముందుచూపులేనితనానికి ఈ ప్రవర్తన ఓ ఉదాహరణ.

ఆత్మ సంతోషానికి రోకటిబండ తంబురా అన్నట్టు

ఎవరి పిచ్చి వారికానందం అనేలాంటిది ఇది. రోకటిబండతో రోట్లో పచ్చడి నూరుకోవచ్చేమో కానీ తంబురా లాగా దాన్ని ఉపయోగించటం సాధ్యం కాదు. కానీ అలా చేస్తున్నాడంటే పిచ్చికింద లెక్కే. ఆ పిచ్చి అతడి ఆత్మానందానికి సంబంధించింది. దీని ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆ మొద్దులోదే ఈ పేడు కూడా

ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. ఒకే తానులో ముక్కలు అనేలాంటిదే ఇది. అయినా దీని ప్రయోగం మాత్రం విమర్శనాత్మక పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆ గొడ్డు మంచిదైతే ఆ వూళ్లోనే అమ్ముడుపోతుందన్నట్టు

ఒకరి ప్రతిభను గురించి అంచనావేసి చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. కొంతమంది తమకు సరైన అవకాశాలు తామున్నచోట రావటం లేదని, అక్కడున్న వాళ్లంతా అసూయాపరులు, దుర్మార్గులు అని అందుకే వేరొక చోటికి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెబుతారు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్

ఆ ఇంటికి తలుపు లేదు

ఆ ఇంటికి తలుపు లేదు ఈ ఇంటికి గడియ లేదు అన్నట్టు అన్నది జాతీయం. అంటే ఒకదానికంటే మరొకటి మరీ నాసి రకమైనది అనే అర్థంలో ఈ జాతీయం వాడుతుంటారు. సాధారణంగా ఇంటికి తలుపు రక్షణ కల్పిస్తుంది. అలాంటిది ఓ ఇంటికి ఉన్న తలుపులకు గడియలేదట.

అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు

మన సంస్కృతీ సంప్రదాయాలలోని కొన్ని కొన్ని అంశాలను జాతీయాలు ప్రతిబింబిస్తుంటాయి. అటువంటి వాటిలో ఇదొక జాతీయం. అల్లుడు బెట్టుగా వ్యవహరిస్తుండాలని, ఇల్లాలు ఇంటిలో ఉన్న లొసుగులు బయటపడకుండా గుట్టుగా వ్యవహరిస్తుండాలని తెలియ చెబుతున్నట్లుంటుంది ఈ జాతీయం.

అమ్మా తల్లీ అంటే అప్పాలన్నీ తినేసిందన్నట్టు..

చనువిస్తే చంకనెక్కింది అన్న దానికి సమానార్థకం ఇది. కొంతమందికి ఏ కొంచెం అలుసిచ్చినా మొత్తం ఆక్రమించి అలుసిచ్చిన వారిని అణగదొక్కుతుంటారు. అలాంటి వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net

అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే..

అబ్బడి నెత్తి దిబ్బడు కొడితే దిబ్బడి నెత్తి సుబ్బడు కొట్టాడన్నది జాతీయం. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అనే దానికి సమానార్థకమిది.

Pages