నీవనినను నేననినను భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా భావంబు దెలిసి మదిని ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా
నరుడెయైన లేక నారాయణుండైన తత్త్వబద్ధుడైన దరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామా వినురవేమ
దేవుడనగ వేరే దేశముందున్నాడె దేహితోడ నెపుడు దేహమందె వాహనములనెక్కి పడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినురవేమ
దొంగమాటలాడ దొరుకునె మోక్షము చేతగాని పలుకు చేటుదెచ్చు గురువుపద్దు కాదు గునహైన్య మదియగు విశ్వదాభిరామ వినురవేమా!
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు దశయలేమి నెంత్రు తక్కువగను దశయన గమ ధన దశమొక్కటే దశ విశ్వదాభిరామ వినురవేమా!
ధూమాదుల నావృతమై వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో శ్రీమించు శివుని జేరును గామాదుల గలియడతడు ఘనముగ వేమా
ద్వారంబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామా వినురవేమ
తనగుణము తనకు నుండగ నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో దన గుణము తెలియ కన్యుని బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా!
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల నొనర శివుని జూడ నుపమ గలదు మనసు చదరనీక మహిలోన జూడరా విశ్వదాభిరామ వినురవేమా!
తనదు మనసుచేత దర్కించి జ్యోతిష మెంత చేసే ననుచు నెంచి చూచు తన యదృష్టమంత దైవ మెఱుంగడా విశ్వదాభిరామ వినురవేమా!
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలవేక మిణుకుచున్న నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ విశ్వదాభిరామ వినురవేమా!
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు తలచి చూడనతకు తత్వమగును వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమా!
జ్ఞానియైనవాని మానక పూజించు మనుజుడెప్పుడు పరమునను ముదంబు సుఖమునందుచుండుసూరులు మెచ్చగ విశ్వదాభిరామ వినురవేమ!
జన్నములను మరియు జన్నియల ననేక ముల నొనర్చియున్న ఫలముకాన రాక యుండు నీతి లేకున్న మాత్రాన విశ్వదాభిరామ వినురవేమ!
జాతి, మతము విడిచి చని యోగికామేలు జాతితో నెయున్న నీతివలదె మతముబట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినురవేమా
జాలినొందరాదు జవదాటి కనరాదు అది మూలమైన ఆత్మమఱుగు పోరిచేరి పొంది పూర్ణము నందురా విశ్వదాభిరామ వినురవేమా
జనన మరణములన స్వప్న సుషుప్తులు జగములందు నెండ జగములుండు నరుడు జగమునంట నడుబాటు కాదొకో విశ్వదాభిరామ వినురవేమా!
జాణలమని యంద్రు చపలాత్ములగువారు తెలివిలేక తమ్ముతెలియలేరు కష్టమైన యడవి గాసీలుచున్నారు విశ్వదాభిరామ వినురవేమా!
జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటినందు రిమ్మరేచునపుడు రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా విశ్వదాభిరామ వినురవేమా!
గంగి గోవుపాలు గరిటడైనను చాలు కడవెడైనను నేమి ఖరముపాలు భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ