పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి బుట్టిరేమి వారు గిట్టరేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా! విశ్వదాభిరామ వినుర వేమా!
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల పుట్టి గిట్టలేదె పూర్వులెవరు పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, విశ్వదాభిరామ వినుర వేమా!
పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమంతలేక జారడగును ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు విశ్వదాభిరామ వినురవేమా!
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి పురుషుడవనిలోన పుణ్యమూర్తి పరుల విత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినురవేమా!
పాల నీటి కలత పరమహంస మెఱుగును నీరు పాలు నెట్లు నేర్చునెమలి లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? విశ్వదాభిరామ వినురమేమా!
పగలుడుగ నాసలుడుగును వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!
పంచ ముఖములందు బంచాక్షరి జనించె పంచ వర్ణములను ప్రబలె జగము పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ విశ్వదాభిరామ వినురవేమ
పండువలన బుట్టె బరగ ప్రపంచము పండువలన బుట్టె పరము నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినురవేమ
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు జ్యోతిషము జనముల నీతుల దప్పించు విశ్వదాభిరామ వినురవేమ!
నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచులకడ నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా విశ్వదాభిరామ వినుర వేమ!
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ!
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది ఎట్లు కలగుబర మదెంతయైన ధనము గలిగియున్న దైవంబు గలుగదు విశ్వదాభిరామ వినుర వేమ!
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని కడుపు చల్లజేసి ఘనత విడుచు నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా విశ్వదాభిరామ వినురవేమ!
నలుగురు కల చోటను దా దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా దలచెడి యాతడు నిచ్చలు గల మాటలే పలుకుచుండగా దగు వేమా!
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె పలుకవలయుగాని పరులకొరకు చావకూడ దింక నోపదవ్యం పల్క విశ్వదాభిరామ వినురవేమ
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు నిజములాడకున్న నీతిదప్పు నిజములాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమా!
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు వ్రాతకన్న సాక్షి వలవదన్న పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు విశ్వదాభిరామ వినురవేమా!
నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ లింగ జీవావేశులను గాంచి భంగపడక పూజ మదియందు జేరుట పూర్ణపదవి పరము గోరిన నిదిచేయ బాగువేమా
నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టిపడును పెరుగురీతి పోరిపోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినురవేమ
నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమా