శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!
అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!
అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ!
అప్పుగొని సేయు విభవము ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్ దప్పురయని నృపురాజ్యము దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ!
అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
ఆఁకొన్న కూడె యమృతము తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
ఇమ్ముగఁ జదువని నోరును అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్ మడుపునఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!
ఉత్తమ గుణములు నీచు కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ!
ఉదకము ద్రావెడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్ మొదవుకడ నున్న వృషభము జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ!
ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నుపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్ సర్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ!
ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగ జెరువునిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
ఒకయూరికి నొక కరణము నొక తీర్పరియైనఁ గాక వొగిఁదరుచైనం గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
ఒల్లనిసతి నొల్లనిపతి నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే గొల్లండు గాక ధరలో గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
ఓడల బండ్లును వచ్చును ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!
కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం దడవుండనిచ్చె నేనియు బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!